యెహోషువ 14:1-15

  • యొర్దానుకు పడమటి వైపున్న దేశాన్ని విభజించడం (1-5)

  • కాలేబు హెబ్రోనును స్వాస్థ్యంగా పొందడం (6-15)

14  కనాను దేశంలో ఇశ్రాయేలీయులు స్వాస్థ్యంగా పొందిన ప్రాంతాలు ఇవే. యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడైన యెహోషువ, ఇశ్రాయేలు గోత్రాల పూర్వీకుల కుటుంబాల పెద్దలు వాటిని ఇశ్రాయేలీయులకు వారసత్వంగా ఇచ్చారు.+  తొమ్మిది గోత్రాలవాళ్ల విషయంలో, అర్ధగోత్రం వాళ్ల విషయంలో యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్టు,+ చీట్లు* వేసి వాళ్లకు భూమి ఇచ్చారు.+  మిగతా రెండు గోత్రాలకు, అర్ధగోత్రానికి మోషే యొర్దాను అవతల* భూమి ఇచ్చాడు.+ అతను ఆ దేశంలో లేవీయులకు భూమి ఇవ్వలేదు.+  యోసేపు వంశస్థుల్ని మనష్షే, ఎఫ్రాయిము+ అనే రెండు గోత్రాలుగా పరిగణించారు;+ లేవీయులకు దేశంలో భాగం ఇవ్వలేదు. అయితే వాళ్లు నివసించడానికి నగరాల్ని,+ వాళ్ల పశువులకు, మందలకు పచ్చికబయళ్లను ఇచ్చారు.+  అలా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు, ఇశ్రాయేలీయులు దేశాన్ని భాగాలుగా విభజించారు.  తర్వాత యూదా వంశస్థులు గిల్గాలులో+ ఉన్న యెహోషువ దగ్గరికి వచ్చారు. కనిజ్జీయుడూ, యెఫున్నె కుమారుడూ అయిన కాలేబు+ యెహోషువతో ఇలా అన్నాడు: “కాదేషు-బర్నేయ+ దగ్గర సత్యదేవుని సేవకుడైన మోషేతో+ యెహోవా నీ గురించి, నా గురించి ఏమన్నాడో+ నీకు బాగా తెలుసు.  దేశాన్ని వేగుచూడడానికి యెహోవా సేవకుడైన మోషే నన్ను కాదేషు-బర్నేయ నుండి పంపించినప్పుడు నాకు 40 ఏళ్లు;+ నేను వెనక్కి తిరిగొచ్చి, చూసినదాన్ని నిజాయితీగా, ఉన్నది ఉన్నట్టుగా అతనికి చెప్పాను.+  నాతో వచ్చిన నా సహోదరులు ప్రజల ధైర్యాన్ని నీరుగార్చినా,* నేను నిండు హృదయంతో* నా దేవుడైన యెహోవాను అనుసరించాను.+  ఆ రోజున మోషే ఇలా ప్రమాణం చేశాడు: ‘నా దేవుడైన యెహోవాను నువ్వు నిండు హృదయంతో అనుసరించావు కాబట్టి, నువ్వు నడిచిన దేశం, నీకూ నీ కుమారులకూ ఎప్పటికీ వారసత్వంగా ఉంటుంది.’ 10  ఇశ్రాయేలీయులు ఎడారిలో తిరిగిన కాలంలో యెహోవా మోషేతో ఆ వాగ్దానం చేశాడు.+ అప్పటినుండి ఈ 45 సంవత్సరాలు యెహోవా తాను మాటిచ్చినట్టు+ నన్ను సజీవంగా ఉంచాడు;+ ఇప్పుడు నాకు 85 ఏళ్లు. 11  మోషే నన్ను పంపించిన రోజున నేను ఎంత బలంగా ఉన్నానో ఈ రోజు కూడా అంతే బలంగా ఉన్నాను. యుద్ధం చేయడానికి, ఇతర పనులు చేయడానికి నాకు అప్పుడెంత శక్తి ఉందో ఇప్పుడు కూడా అంతే శక్తి ఉంది. 12  కాబట్టి, యెహోవా ఆ రోజు వాగ్దానం చేసిన ఈ పర్వత ప్రాంతాన్ని నాకు ఇవ్వు. అక్కడ అనాకీయులు ఉన్నారనీ, వాళ్లకు ప్రాకారాలుగల గొప్ప నగరాలు ఉన్నాయనీ+ నువ్వు ఆ రోజు విన్నావు. అయితే యెహోవా తప్పకుండా* నాతో ఉంటాడు,+ యెహోవా వాగ్దానం చేసినట్టు నేను వాళ్లను వెళ్లగొడతాను.”+ 13  కాబట్టి యెహోషువ యెఫున్నె కుమారుడైన కాలేబును ఆశీర్వదించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చాడు.+ 14  అందుకే ఈ రోజు వరకు కనిజ్జీయుడూ యెఫున్నె కుమారుడూ అయిన కాలేబుకు హెబ్రోను స్వాస్థ్యంగా ఉంది. ఎందుకంటే అతను ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు హృదయంతో అనుసరించాడు.+ 15  హెబ్రోనుకు అంతకుముందు కిర్యతర్బా+ అనే పేరు ఉండేది (అనాకీయుల్లో అర్బా గొప్పవాడు). ఆ తర్వాత దేశం యుద్ధం లేకుండా ప్రశాంతంగా ఉంది.+

అధస్సూచీలు

పదకోశం చూడండి.
అంటే, తూర్పు వైపున.
లేదా “గుండెల్ని నీరుగారిపోయేలా చేసినా.”
అక్ష., “పూర్తిగా; సంపూర్ణంగా.”
లేదా “బహుశా.”