యెహోషువ 17:1-18

  • పశ్చిమాన మనష్షే గోత్రానికి వచ్చిన భూమి (1-13)

  • యోసేపు వంశస్థులకు అదనంగా భూమి రావడం (14-18)

17  తర్వాత మనష్షే గోత్రం+ పేరు మీద చీటి+ పడింది. ఎందుకంటే అతను యోసేపు మొదటి సంతానం.+ మనష్షే పెద్ద కుమారుడూ గిలాదుకు తండ్రీ అయిన మాకీరు+ యోధుడు కాబట్టి అతనికి గిలాదు, బాషాను ప్రాంతాలు వచ్చాయి.+  మనష్షే వంశస్థుల్లో మిగతావాళ్లకు వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం అంటే అబీయెజరు కుమారుల,+ హెలెకు కుమారుల, అశ్రీయేలు కుమారుల, షెకెము కుమారుల, హెపెరు కుమారుల, షెమీదా కుమారుల పేర్ల మీద చీట్లు పడ్డాయి. కుటుంబాలవారీగా యోసేపు కుమారుడైన మనష్షే వంశస్థుల్లో మగవాళ్లు వీళ్లు.+  మనష్షే కుమారుడు మాకీరు, మాకీరు కుమారుడు గిలాదు, గిలాదు కుమారుడు హెపెరు, హెపెరు కుమారుడు సెలోపెహాదు.+ అయితే, సెలోపెహాదుకు కూతుళ్లే కానీ కుమారులు లేరు. అతని కూతుళ్ల పేర్లు: మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా.  వాళ్లు యాజకుడైన ఎలియాజరు,+ నూను కుమారుడైన యెహోషువ, ప్రధానుల ఎదుటకు వచ్చి ఇలా అన్నారు: “మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యాన్ని ఇవ్వమని యెహోవాయే మోషేకు ఆజ్ఞాపించాడు.”+ కాబట్టి, యెహోవా ఆదేశించినట్టు, యెహోషువ వాళ్ల తండ్రి సహోదరుల మధ్య వాళ్లకు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు.+  యొర్దానుకు అవతలి వైపు* ఉన్న గిలాదు, బాషాను ప్రాంతాలే కాకుండా ఇంకో పది వాటాలు మనష్షేకు వచ్చాయి.+  ఎందుకంటే, మనష్షే కూతుళ్లకు అతని కుమారులతో పాటు భూమి వారసత్వంగా వచ్చింది. గిలాదు ప్రాంతం మనష్షే వంశస్థుల్లో మిగతావాళ్ల ఆస్తి అయ్యింది.  మనష్షే గోత్రంవాళ్ల సరిహద్దు ఆషేరు నుండి షెకెముకు+ ఎదురుగా ఉన్న మిక్మెతాతు+ వరకు ఉంది, అక్కడి నుండి దక్షిణం* వైపు ఏన్తప్పూయ నివాసుల ప్రాంతం వరకు కొనసాగింది.  తప్పూయ ప్రాంతం+ మనష్షే గోత్రానికి వచ్చింది, కానీ మనష్షే సరిహద్దు మీద ఉన్న తప్పూయ నగరం ఎఫ్రాయిము వంశస్థులకు వెళ్లింది.  ఆ సరిహద్దు కిందికి దిగి, కానా వాగు దక్షిణం వైపుకు సాగింది. మనష్షే నగరాల మధ్య ఎఫ్రాయిము నగరాలు కూడా ఉన్నాయి.+ మనష్షే గోత్రం సరిహద్దు వాగుకు ఉత్తరం వైపు కొనసాగి, సముద్రం దగ్గర ఆగిపోయింది.+ 10  దక్షిణం వైపు ప్రాంతం ఎఫ్రాయిము వాళ్లది, ఉత్తరం వైపు ప్రాంతం మనష్షే వాళ్లది. సముద్రం మనష్షేవాళ్ల సరిహద్దు.+ మనష్షేవాళ్ల ప్రాంతం ఉత్తరం వైపు ఆషేరువాళ్ల ప్రాంతం వరకు, తూర్పు వైపు ఇశ్శాఖారువాళ్ల ప్రాంతం వరకు వెళ్లింది. 11  ఇశ్శాఖారు, ఆషేరు ప్రాంతాల్లో బేత్షెయాను, ఇబ్లెయాము,+ దోరు,+ ఏన్దోరు,+ తానాకు,+ మెగిద్దో నగరాలు, వాటిలోని నివాసులు, ఆ నగరాల చుట్టుపక్కల పట్టణాలు మనష్షే గోత్రానికి ఇవ్వబడ్డాయి. మూడు కొండ ప్రాంతాలు మనష్షేకు ఇవ్వబడ్డాయి. 12  కానీ మనష్షే వంశస్థులు ఈ నగరాల్ని స్వాధీనం చేసుకోలేకపోయారు; కనానీయులు మొండిగా అక్కడే ఉండిపోయారు. 13  ఇశ్రాయేలీయుల బలం పెరిగినప్పుడు, వాళ్లు కనానీయుల చేత వెట్టిచాకిరి చేయించుకున్నారు,+ కానీ వాళ్లను పూర్తిగా వెళ్లగొట్టలేదు.+ 14  యోసేపు వంశస్థులు యెహోషువతో ఇలా అన్నారు: “మాకు కేవలం ఒక్క చీటితో, ఒక్క వాటా భూమి మాత్రమే ఎందుకు ఇచ్చావు?+ మేము చాలామందిమి, ఎందుకంటే ఇప్పటివరకు యెహోవా మమ్మల్ని దీవించాడు.”+ 15  దానికి యెహోషువ వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు చాలామంది ప్రజలైతే, వెళ్లి పెరిజ్జీయుల,+ రెఫాయీయుల దేశంలో+ అడవి నరికి అక్కడ నివసించండి. ఎందుకంటే ఎఫ్రాయిము పర్వత ప్రాంతం+ మీకు చాలా ఇరుకుగా ఉంది.” 16  అప్పుడు యోసేపు వంశస్థులు ఇలా అన్నారు: “మాకు పర్వత ప్రాంతం సరిపోవడం లేదు, లోయలో ఉంటున్న కనానీయులందరి దగ్గర అంటే బేత్షెయాను, దాని చుట్టుపక్కల పట్టణాల్లో, అలాగే యెజ్రెయేలు లోయలో+ ఉంటున్నవాళ్ల దగ్గర చక్రాలకు ఇనుప కత్తులుగల యుద్ధ రథాలు* ఉన్నాయి.”+ 17  కాబట్టి యెహోషువ యోసేపు ఇంటివాళ్లకు, అంటే ఎఫ్రాయిము వాళ్లకు, మనష్షే వాళ్లకు ఇలా చెప్పాడు: “మీరు చాలామంది ఉన్నారు, మీకు చాలా శక్తి ఉంది. మీకు వచ్చేది ఒక్క చీటి మాత్రమే కాదు, 18  పర్వత ప్రాంతం కూడా మీది అవుతుంది.+ అది అడవే అయినా మీరు దాన్ని నరుకుతారు. అది మీ ప్రాంత సరిహద్దు అవుతుంది. కనానీయులు బలవంతులైనా, వాళ్ల దగ్గర చక్రాలకు ఇనుప కత్తులుగల యుద్ధ రథాలు* ఉన్నా మీరు వాళ్లను వెళ్లగొడతారు.”+

అధస్సూచీలు

అంటే, తూర్పు వైపు.
అక్ష., “కుడి.”
అక్ష., “ఇనుప రథాలు.”
అక్ష., “ఇనుప రథాలు.”