యెహోషువ 18:1-28

  • మిగతా దేశాన్ని షిలోహులో పంచి ఇవ్వడం (1-10)

  • బెన్యామీను గోత్రానికి వచ్చిన భూమి (11-28)

18  అప్పుడు ఇశ్రాయేలీయుల సమాజమంతా షిలోహు+ దగ్గర సమావేశమైంది, అక్కడ వాళ్లు ప్రత్యక్ష గుడారాన్ని+ నిలబెట్టారు. ఎందుకంటే అప్పటికే వాళ్లు దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు.+  అయితే ఇశ్రాయేలీయుల ఏడు గోత్రాలకు ఇంకా భూమి కేటాయించబడలేదు.  కాబట్టి యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు: “మీరు ఇంకా ఎంతకాలం వాయిదా వేస్తారు? మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశాన్ని మీరు ఎప్పుడు వెళ్లి స్వాధీనం చేసుకుంటారు?+  ప్రతీ గోత్రం నుండి ముగ్గుర్ని నాకు ఇవ్వండి, నేను వాళ్లను పంపిస్తాను; వాళ్లు వెళ్లి దేశమంతా నడిచి తమకు వారసత్వంగా రావాల్సిన ప్రాంతాల ప్రకారం దాని వివరాలు రాయాలి. తర్వాత వాళ్లు నా దగ్గరికి తిరిగిరావాలి.  వాళ్లు దాన్ని ఏడు భాగాలుగా విభజించుకోవాలి.+ యూదావాళ్లు దక్షిణం వైపు తమ భూభాగంలోనే ఉంటారు, యోసేపు కుటుంబంవాళ్లు ఉత్తరం వైపు తమ భూభాగంలోనే ఉంటారు.  మీరు దేశాన్ని ఏడు భాగాలుగా విభజించి, ఆ వివరాలు రాసి ఇక్కడ నా దగ్గరికి తీసుకురండి, నేను మన దేవుడైన యెహోవా ముందు మీ కోసం చీట్లు వేస్తాను.+  అయితే లేవీయులకు మీ మధ్య వంతు ఇవ్వబడదు.+ ఎందుకంటే యెహోవాకు యాజకులుగా సేవచేయడమే వాళ్ల ఆస్తి;+ గాదు, రూబేను, మనష్షే అర్ధగోత్రానికి+ యెహోవా సేవకుడైన మోషే యొర్దాను తూర్పు వైపున వారసత్వంగా ఇచ్చిన భూమిని వాళ్లు ఇప్పటికే తీసుకున్నారు.”  అప్పుడు ఆ మనుషులు వెళ్లడానికి సిద్ధమయ్యారు. దేశం వివరాలు రాయడానికి వెళ్తున్నవాళ్లకు యెహోషువ ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు వెళ్లి దేశమంతటా నడుస్తూ దాని వివరాలు రాసుకొని నా దగ్గరికి రండి, నేను ఇక్కడ షిలోహులో+ యెహోవా ముందు మీ కోసం చీట్లు వేస్తాను.”  దాంతో ఆ మనుషులు వెళ్లి దేశమంతటా ప్రయాణం చేస్తూ, నగరాల ప్రకారం దాన్ని ఏడు భాగాలుగా చేసి ఆ వివరాల్ని పుస్తకంలో రాశారు. ఆ తర్వాత వాళ్లు షిలోహులోని పాలెంలో ఉన్న యెహోషువ దగ్గరికి వచ్చారు. 10  అప్పుడు యెహోషువ షిలోహులో యెహోవా ముందు వాళ్ల కోసం చీట్లు వేశాడు. అక్కడ యెహోషువ వాళ్లవాళ్ల వాటాల ప్రకారం ఇశ్రాయేలీయులకు దేశాన్ని పంచి ఇచ్చాడు.+ 11  మొదటి చీటి వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం బెన్యామీను గోత్రానికి వచ్చింది. యూదా ప్రజలకు,+ యోసేపు ప్రజలకు+ మధ్య ఉన్న భూభాగం చీటి ద్వారా వాళ్లకు వచ్చింది. 12  వాళ్ల ఉత్తర సరిహద్దు యొర్దాను దగ్గర ప్రారంభమై, యెరికో+ ఉత్తర ఏటవాలు ప్రాంతం మీదుగా పడమటి వైపున్న పర్వతం వైపు వ్యాపించి, బేతావెను+ ఎడారి వరకు విస్తరించింది. 13  అది అక్కడి నుండి లూజు నగరం వరకు, అంటే బేతేలు+ వరకు వెళ్లింది. అది లూజు దక్షిణ ఏటవాలు ప్రాంతం మీదుగా సాగి, అక్కడి నుండి కిందికి, దిగువ బేత్‌-హోరోనుకు+ దక్షిణం వైపు పర్వతం మీదున్న అతారోతు-అద్దారు వరకు వ్యాపించింది. 14  ఆ సరిహద్దు, బేత్‌-హోరోనుకు ఎదురుగా ఉన్న పర్వతం దగ్గర దక్షిణం వైపుకు తిరిగింది; అది కిర్యత్బయలు లేదా కిర్యత్యారీము అనే యూదా నగరం దగ్గర ఆగిపోయింది. అది పడమటి సరిహద్దు. 15  దక్షిణం వైపు సరిహద్దు కిర్యత్యారీము చిట్టచివరి నుండి మొదలై పడమటి వైపు విస్తరించింది; అది నెఫ్తోయ నీళ్ల ఊట వరకు వెళ్లింది. 16  అది అక్కడి నుండి కిందికి బెన్‌హిన్నోము* లోయ+ ఎదురుగా ఉన్న పర్వతం అడుగుభాగం వరకు వెళ్లింది; ఆ పర్వతం రెఫాయీము+ లోయలో ఉత్తరం వైపు ఉంది. సరిహద్దు అక్కడి నుండి కిందికి హిన్నోము లోయ వరకు, దక్షిణాన ఉన్న యెబూసీయుల ఏటవాలు ప్రాంతం వరకు విస్తరించి, కిందికి ఏన్రోగేలుకు+ వెళ్లింది. 17  అది ఉత్తరం వైపు తిరిగి ఏన్షెమెషు వైపు విస్తరించి, అక్కడి నుండి అదుమ్మీముకు ఎక్కే మార్గానికి ఎదురుగా ఉన్న గెలీలోతు వరకు వెళ్లి, తర్వాత కిందికి రూబేను కుమారుడైన బోహను రాయి+ వరకు వెళ్లింది. 18  అది అరాబాకు ఎదురుగా ఉన్న ఉత్తర ఏటవాలు ప్రాంతం వైపుగా కొనసాగి, అక్కడి నుండి కిందికి అరాబాకు వెళ్లింది. 19  ఆ సరిహద్దు బేత్‌-హోగ్లా ఉత్తర ఏటవాలు ప్రాంతానికి వెళ్లి, యొర్దానుకు దక్షిణాన ఉన్న ఉప్పు సముద్రం* ఉత్తర తీరం దగ్గర ఆగిపోయింది. ఇది దక్షిణ సరిహద్దు. 20  వాళ్ల తూర్పు సరిహద్దు యొర్దాను. వాళ్లవాళ్ల కుటుంబాల చొప్పున, అన్నివైపుల ఉన్న సరిహద్దుల ప్రకారం బెన్యామీను వంశస్థులకు వారసత్వంగా వచ్చిన భూమి ఇది. 21  వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం బెన్యామీను గోత్రంవాళ్ల నగరాలు ఇవి: యెరికో, బేత్‌-హోగ్లా, యెమెక్కెసీసు, 22  బేతరాబా, సెమరాయిము, బేతేలు,+ 23  ఆవీం, పారా, ఒఫ్రా, 24  కెపరమ్మోని, ఒప్ని, గెబా;+ మొత్తం 12 నగరాలు, వాటి పల్లెలు. 25  గిబియోను,+ రామా, బెయేరోతు, 26  మిస్పే, కెఫీరా, మోసా, 27  రేకెము, ఇర్పెయేలు, తరలా, 28  సేలా,+ ఎలెపు, యెబూసు, అంటే యెరూషలేము,+ గిబియా,+ కిర్యతు; మొత్తం 14 నగరాలు, వాటి పల్లెలు. వాళ్లవాళ్ల కుటుంబాల ప్రకారం బెన్యామీను వంశస్థులకు వారసత్వంగా వచ్చిన భూమి ఇది.

అధస్సూచీలు

అక్ష., “హిన్నోము కుమారుడి.”
అంటే, మృత సముద్రం.