యెహోషువ 23:1-16
23 యెహోవా ఇశ్రాయేలీయుల చుట్టూ ఉన్న శత్రువులందరి నుండి వాళ్లకు విశ్రాంతి ఇచ్చిన+ చాలా రోజుల తర్వాత, యెహోషువ బాగా ముసలివాడైనప్పుడు,+
2 అతను ఇశ్రాయేలీయులందర్నీ, వాళ్ల పెద్దల్ని, నాయకుల్ని, న్యాయమూర్తుల్ని, అధికారుల్ని+ పిలిపించి,+ వాళ్లతో ఇలా అన్నాడు: “నేను బాగా ముసలివాణ్ణి అయ్యాను, వయసు పైబడింది.
3 మీ దేవుడైన యెహోవా మీ కోసం ఈ దేశాలన్నిటికీ చేసినదంతా మీరే స్వయంగా చూశారు, మీ దేవుడైన యెహోవాయే మీ తరఫున పోరాడాడు.+
4 చూడండి, పడమటి వైపున* యొర్దాను నుండి మహా సముద్రం* వరకు నివసిస్తున్న దేశాలవాళ్లను నేను వెళ్లగొట్టి,+ ఆ ప్రాంతాన్ని చీట్లు వేసి నేను మీకు ఇచ్చాను; ఇతర జనాలు ఇంకా ఆ ప్రాంతంలోనే ఉన్నారు, అయినా ఆ ప్రాంతం మీదే.+
5 మీ దేవుడైన యెహోవాయే వాళ్లను మీ ఎదుట నుండి నెట్టేసి+ మీ కోసం వాళ్లను బయటికి వెళ్లగొట్టాడు. మీ దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసినట్టే వాళ్ల దేశాన్ని మీరు స్వాధీనం చేసుకున్నారు.+
6 “కాబట్టి మీరు ఇప్పుడు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో+ రాయబడిన వాటన్నిటినీ పాటించి, అమలు చేయడానికి చాలా ధైర్యంగా ఉండాలి. దాని నుండి మీరు కుడివైపుకు గానీ ఎడమవైపుకు గానీ ఎప్పుడూ మళ్లకూడదు,+
7 మీ మధ్య మిగిలివున్న ఈ దేశాలవాళ్లతో ఎన్నడూ కలవకూడదు.+ మీరు కనీసం వాళ్ల దేవుళ్ల పేర్లు కూడా పలకకూడదు, వాళ్ల దేవుళ్ల పేరున ప్రమాణం చేయకూడదు; మీరు ఎన్నడూ వాళ్ల దేవుళ్లను సేవించకూడదు, వాటికి మొక్కకూడదు.+
8 బదులుగా, మీరు ఈ రోజు వరకు ఉన్నట్టే మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండాలి.+
9 యెహోవా శక్తివంతమైన గొప్ప దేశాల్ని మీ ఎదుట నుండి వెళ్లగొడతాడు. ఈ రోజు వరకు ఏ మనిషీ మీకు ఎదురు నిలవలేకపోయాడు.+
10 మీలో ఒక్క మనిషి వెయ్యిమందిని తరుముతాడు.+ ఎందుకంటే మీకు మాటిచ్చినట్టే+ మీ దేవుడైన యెహోవా మీ కోసం యుద్ధం చేస్తున్నాడు.+
11 కాబట్టి మీ దేవుడైన యెహోవాను ప్రేమించే విషయంలో+ ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండండి.+
12 “అయితే మీరు దేవుణ్ణి విడిచిపెట్టి, మీ మధ్య మిగిలివున్న+ ఈ దేశాల ప్రజల్ని హత్తుకొని వాళ్లతో పెళ్లి సంబంధాలు కలుపుకొని,+ వాళ్లతో సహవసిస్తుంటే,
13 మీ దేవుడైన యెహోవా మీ కోసం ఈ దేశాలవాళ్లను వెళ్లగొడుతూ ఉండడని+ మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నాశనమయ్యేంతవరకు వాళ్లు మీకు బోనులా, ఉరిలా, మీ వీపులమీద కొరడాలా, మీ కళ్లలో ముళ్లలా తయారౌతారు.
14 “చూడండి! నేను చనిపోబోతున్నాను,* మీ దేవుడైన యెహోవా మీకు చెప్పిన మంచి వాగ్దానాలన్నిట్లో ఒక్కమాట కూడా తప్పిపోలేదని మీకు బాగా తెలుసు.* అవన్నీ మీ విషయంలో నిజమయ్యాయి. వాటిలో ఒక్కమాట కూడా తప్పిపోలేదు.+
15 అయితే మీ దేవుడైన యెహోవా మీకు చెప్పిన మంచి వాగ్దానాలన్నిటినీ మీ కోసం నెరవేర్చినట్టే,+ యెహోవా తాను వాగ్దానం చేసిన విపత్తులన్నిటినీ* మీ మీదికి తీసుకొస్తాడు, మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మిమ్మల్ని నాశనం చేస్తాడు.+
16 మీరు పాటించాలని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ఒప్పందాన్ని మీరు మీరితే, మీరు వెళ్లి ఇతర దేవుళ్లను సేవించి, వాటికి మొక్కితే యెహోవా కోపం మీ మీద రగులుకుంటుంది;+ ఆయన మీకు ఇచ్చిన మంచి దేశంలో ఉండకుండా మీరు త్వరగా నాశనమౌతారు.”
అధస్సూచీలు
^ లేదా “సూర్యాస్తమయం వైపున.”
^ అంటే, మధ్యధరా సముద్రం.
^ అక్ష., “నేను ఈ రోజు సర్వలోక మార్గంలో వెళ్తున్నాను.”
^ అక్ష., “మీ నిండు హృదయంతో, మీ నిండు ప్రాణంతో మీకు బాగా తెలుసు.”
^ లేదా “శాపాలన్నిటినీ.”