యెహోషువ 3:1-17

  • ఇశ్రాయేలీయులు యొర్దానును దాటడం (1-17)

3  ఆ తర్వాత యెహోషువ ఉదయాన్నే లేచి, అతనూ ఇశ్రాయేలీయులు* అందరూ షిత్తీము+ నుండి బయల్దేరి యొర్దాను నది దగ్గరికి వచ్చారు. వాళ్లు వెంటనే నది దాటే బదులు ఆ రాత్రి అక్కడే గడిపారు.  మూడు రోజుల తర్వాత, అధికారులు+ పాలెం అంతా తిరిగి,  ప్రజలకు ఇలా ఆజ్ఞాపించారు: “మీ దేవుడైన యెహోవా ఒప్పంద* మందసాన్ని* లేవీయులైన యాజకులు మోయడం+ మీరు చూడగానే, మీరున్న చోట నుండి బయల్దేరి దాని వెనక వెళ్లాలి.  అయితే, మీరు దానికి దాదాపు 2,000 మూరల* దూరంలో ఉండాలి; అంతకుమించి ఏమాత్రం దగ్గరికి వెళ్లకండి, అప్పుడు మీరు వెళ్లాల్సిన దారి మీకు తెలుస్తుంది. ఎందుకంటే, మీరు ఇంతకుముందు ఎప్పుడూ ఆ దారిలో వెళ్లలేదు.”  అప్పుడు యెహోషువ ప్రజలకు ఇలా చెప్పాడు: “రేపు యెహోవా మీ మధ్య అద్భుతమైన పనులు చేస్తాడు+ కాబట్టి మిమ్మల్ని మీరు పవిత్రపర్చుకోండి.”+  తర్వాత యెహోషువ యాజకులతో, “ఒప్పంద మందసాన్ని ఎత్తుకొని+ ప్రజలకు ముందుగా వెళ్లండి” అని చెప్పాడు. కాబట్టి వాళ్లు ఒప్పంద మందసాన్ని ఎత్తుకొని ప్రజలకు ముందుగా వెళ్లారు.  ఆ తర్వాత యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు: “ఈ రోజు నేను ఇశ్రాయేలు ప్రజలందరి దృష్టిలో నిన్ను ఘనపర్చడం మొదలుపెడతాను.+ అప్పుడు, నేను మోషేకు తోడుగా ఉన్నట్టే+ నీకూ తోడుగా ఉంటానని+ వాళ్లు తెలుసుకుంటారు.  ఒప్పంద మందసాన్ని మోస్తున్న యాజకులకు నువ్వు ఈ ఆజ్ఞ ఇవ్వు: ‘మీరు యొర్దాను నది నీళ్ల దగ్గరికి చేరుకున్నప్పుడు ఆ నీళ్లలో కదలకుండా నిలబడాలి.’ ”+  యెహోషువ ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడు: “మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా చెప్పేది వినండి.” 10  ఆ తర్వాత యెహోషువ ఇలా అన్నాడు: “జీవంగల దేవుడు మీ మధ్య ఉన్నాడనీ+ ఆయన కనానీయుల్ని, హిత్తీయుల్ని, హివ్వీయుల్ని, పెరిజ్జీయుల్ని, గిర్గాషీయుల్ని, అమోరీయుల్ని, యెబూసీయుల్ని మీ ఎదుట నుండి తప్పకుండా వెళ్లగొడతాడనీ+ మీరు దీనివల్ల తెలుసుకుంటారు. 11  ఇదిగో! భూమంతటికీ ప్రభువైన వ్యక్తి ఒప్పంద మందసం మీకు ముందుగా యొర్దాను నదిలోకి వెళ్తోంది. 12  ఇప్పుడు మీరు ఇశ్రాయేలు గోత్రాల నుండి, గోత్రానికి ఒకరు చొప్పున 12 మంది మనుషుల్ని ఎంపిక చేయండి.+ 13  భూమంతటికీ ప్రభువైన యెహోవా మందసాన్ని మోస్తున్న యాజకుల పాదాలు యొర్దాను నీళ్లను తాకగానే, ఎగువ నుండి ప్రవహిస్తున్న యొర్దాను నది నీళ్లు ఆగిపోతాయి; అవి కదలకుండా గోడలా* నిలబడతాయి.”+ 14  కాబట్టి ప్రజలు యొర్దాను దాటడానికి తమ డేరాల దగ్గర నుండి బయల్దేరినప్పుడు, ఒప్పంద మందసాన్ని+ మోస్తున్న యాజకులు వాళ్లకు ముందుగా వెళ్లారు. 15  మందసాన్ని మోస్తున్న యాజకులు యొర్దాను నది దగ్గరికి చేరుకొని, తమ పాదాల్ని నీళ్లలో పెట్టగానే (కోతకాలం అంతటా యొర్దాను నది గట్లు నీళ్లతో పొంగిపొర్లుతాయి),+ 16  ఎగువ నుండి ప్రవహిస్తున్న నీళ్లు కదలకుండా నిలబడ్డాయి. అవి ఎంతో దూరాన, సారెతాను దగ్గరున్న ఆదాము అనే నగరం దగ్గర గోడలా* నిలబడ్డాయి. అదే సమయంలో దిగువన అరాబా సముద్రం వైపు, అంటే ఉప్పు సముద్రం* వైపు వెళ్తున్న నీళ్లు ఖాళీ అయ్యాయి. నీళ్లు ఆగిపోవడంతో ప్రజలు యెరికోకు ఎదురుగా నది దాటారు. 17  ఇశ్రాయేలు ప్రజలంతా పొడినేల మీద నది దాటుతుండగా,+ యెహోవా ఒప్పంద మందసాన్ని మోస్తున్న యాజకులు యొర్దాను నది మధ్యలో అలాగే నిలబడివున్నారు.+ అలా ఆ మొత్తం జనం యొర్దాను నది దాటింది.

అధస్సూచీలు

అక్ష., “ఇశ్రాయేలు కుమారులు.”
లేదా “నిబంధన.”
లేదా “పెద్దపెట్టెను.”
దాదాపు 890 మీటర్లు (2,920 అడుగులు). అనుబంధం B14 చూడండి.
లేదా “ఆనకట్టలా.”
లేదా “ఆనకట్టలా.”
అంటే, మృత సముద్రం.