యెహోషువ 6:1-27

  • యెరికో ప్రాకారం కూలడం (1-21)

  • రాహాబును, ఆమె కుటుంబాన్ని ప్రాణాలతో ఉండనిచ్చారు (22-27)

6  ఇశ్రాయేలీయుల కారణంగా యెరికో నగర ద్వారాన్ని గట్టిగా మూసేశారు; ఎవరూ బయటికి వెళ్లడం లేదు, లోపలికి రావడం లేదు.+  అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు: “చూడు, నేను యెరికోను, దాని రాజును, దాని బలమైన యోధుల్ని నీ చేతికి అప్పగించాను.+  యోధులైన మీరంతా నగరం చుట్టూ ఒకసారి తిరగాలి. అలా మీరు ఆరురోజుల పాటు తిరగాలి.  ఏడుగురు యాజకులు ఏడు బూరల్ని* పట్టుకొని మందసం ముందు వెళ్లే ఏర్పాటు చేయి. అయితే ఏడో రోజున, మీరు నగరం చుట్టూ ఏడుసార్లు తిరగాలి. అప్పుడు యాజకులు బూరలు ఊదాలి.+  బూరలు ఊదినప్పుడు, మీరు ఆ శబ్దం* వినగానే, ప్రజలందరూ పెద్దగా యుద్ధకేక వేయాలి. అప్పుడు ఆ నగర ప్రాకారం కుప్పకూలుతుంది,+ ప్రజల్లో ప్రతీ ఒక్కరు నేరుగా నగరంలోకి వెళ్లాలి.”  కాబట్టి నూను కుమారుడైన యెహోషువ యాజకుల్ని పిలిచి ఇలా చెప్పాడు: “ఒప్పంద మందసాన్ని ఎత్తండి, ఏడుగురు యాజకులు ఏడు బూరలు పట్టుకొని యెహోవా మందసం ముందు నడవాలి.”+  తర్వాత అతను ప్రజలతో, “మీరు ముందుకు వెళ్తూ ఉండండి, నగరం చుట్టూ తిరగండి; ఆయుధాలు ధరించినవాళ్లు+ యెహోవా మందసం ముందు నడవాలి” అని చెప్పాడు.  యెహోషువ ప్రజలకు చెప్పినట్టే, యెహోవా ఎదుట ఏడు బూరలు పట్టుకొని ఉన్న ఏడుగురు యాజకులు ముందుకు నడుస్తూ బూరలు ఊదుతున్నారు, యెహోవా ఒప్పంద మందసం వాళ్ల వెనక వెళ్తూ ఉంది.  ఆయుధాలు ధరించినవాళ్లు బూరలు ఊదుతున్న యాజకులకు ముందుగా నడిచారు. యాజకులు బూరలు ఊదుతూ ఉంటే, వెనకున్న సైన్యం మందసం వెనకే నడిచింది. 10  తర్వాత యెహోషువ ప్రజలకు ఇలా ఆజ్ఞాపించాడు: “మీరు కేకలు వేయొద్దు, మీ స్వరం వినిపించకూడదు. మీ నోటి నుండి ఒక్కమాట కూడా రాకూడదు. ఎప్పుడైతే నేను, ‘కేకలు వేయండి!’ అంటానో అప్పుడే మీరు కేకలు వేయాలి.” 11  అతను యెహోవా మందసం నగరం చుట్టూ ఒకసారి తిరిగే ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత వాళ్లు పాలెంలోకి తిరిగొచ్చి, రాత్రి అక్కడే బసచేశారు. 12  తర్వాతి రోజు యెహోషువ ఉదయాన్నే లేచాడు. యాజకులు యెహోవా మందసాన్ని ఎత్తారు.+ 13  ఏడు బూరలు పట్టుకున్న ఏడుగురు యాజకులు యెహోవా మందసం ముందు నడుస్తూ బూరలు ఊదుతూ ఉన్నారు. ఆయుధాలు ధరించినవాళ్లు వాళ్లకు ముందుగా వెళ్తున్నారు. యాజకులు బూరలు ఊదుతూ ఉంటే, వెనకున్న సైన్యం యెహోవా మందసం వెనకే నడిచింది. 14  వాళ్లు రెండో రోజు నగరం చుట్టూ ఒకసారి తిరిగి, తర్వాత పాలెంలోకి తిరిగొచ్చారు. వాళ్లు ఆరు రోజులు అలాగే చేశారు.+ 15  ఏడో రోజున వాళ్లు పెందలాడే లేచి, తెల్లవారగానే నగరం చుట్టూ అదేవిధంగా ఏడుసార్లు తిరిగారు. ఆ రోజు మాత్రమే వాళ్లు నగరం చుట్టూ ఏడుసార్లు తిరిగారు.+ 16  ఏడోసారి, యాజకులు బూరలు ఊదినప్పుడు, యెహోషువ ప్రజలకు ఇలా చెప్పాడు: “కేకలు వేయండి,+ యెహోవా ఈ నగరాన్ని మీకు అప్పగించాడు! 17  ఈ నగరం, దీనిలో ఉన్న ప్రతీది పూర్తిగా నాశనం చేయబడాలి;+ అదంతా యెహోవాది. రాహాబు అనే వేశ్య,+ ఆమెతోపాటు ఆమె ఇంట్లో ఉన్నవాళ్లు మాత్రమే బ్రతికి ఉండవచ్చు. ఎందుకంటే ఆమె మనం పంపించిన గూఢచారుల్ని* దాచిపెట్టింది.+ 18  అయితే నాశనం చేయబడాల్సినవాటికి మీరు దూరంగా ఉండాలి.+ లేకపోతే మీరు వాటిని ఆశించి వాటిలో కొన్నిటిని తీసుకుంటారేమో.+ అలాచేస్తే మీరు ఇశ్రాయేలు పాలెం మీదికి విపత్తు* తీసుకొచ్చి దాన్ని నాశనం చేసినవాళ్లౌతారు.+ 19  అయితే వెండిబంగారమంతా అలాగే రాగి, ఇనుప వస్తువులన్నీ యెహోవాకు ప్రతిష్ఠితం.+ అవి యెహోవా ఖజానాలోకి వెళ్లాలి.”+ 20  ఆ తర్వాత బూరలు ఊదినప్పుడు ప్రజలు కేకలు వేశారు.+ ప్రజలు బూరల శబ్దం విని పెద్దగా యుద్ధకేక వేయగానే ప్రాకారం కుప్పకూలింది.+ ఆ తర్వాత ప్రజల్లో ప్రతీ ఒక్కరు నేరుగా నగరంలోకి వెళ్లి దాన్ని స్వాధీనం చేసుకున్నారు. 21  వాళ్లు నగరంలో ఉన్న సమస్తాన్ని అంటే స్త్రీలను, పురుషుల్ని, యౌవనుల్ని, ముసలివాళ్లను, ఎద్దుల్ని, గొర్రెల్ని, గాడిదల్ని కత్తితో చంపేశారు.+ 22  ఆ దేశాన్ని వేగుచూసిన ఇద్దరు మనుషులకు యెహోషువ ఇలా చెప్పాడు: “మీరు ఆ వేశ్య ఇంట్లోకి వెళ్లి, మీరు ఆమెకు ప్రమాణం చేసినట్టే ఆమెను, ఆమెకు చెందిన వాళ్లందర్నీ బయటికి తీసుకురండి.”+ 23  కాబట్టి, వేగుచూసిన ఆ గూఢచారులు లోపలికి వెళ్లి రాహాబును, ఆమె తల్లిదండ్రుల్ని, అన్నదమ్ముల్ని, ఆమెకు చెందిన వాళ్లందర్నీ బయటికి తీసుకొచ్చారు; అవును, వాళ్లు ఆమె కుటుంబాన్నంతటినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చి,+ ఇశ్రాయేలు పాలెం వెలుపల ఒక స్థలంలో ఉంచారు. 24  ఆ తర్వాత వాళ్లు ఆ నగరాన్ని, దానిలో ఉన్న ప్రతీదాన్ని అగ్నితో కాల్చేశారు. అయితే వెండిబంగారాలతో పాటు రాగి, ఇనుప వస్తువుల్ని వాళ్లు యెహోవా మందిర ఖజానాకు ఇచ్చారు.+ 25  కేవలం రాహాబు అనే వేశ్యను, ఆమె తండ్రి ఇంటివాళ్లను, ఆమెకు చెందిన వాళ్లందర్ని మాత్రం యెహోషువ ప్రాణాలతో ఉండనిచ్చాడు;+ ఈ రోజు వరకు ఆమె ఇశ్రాయేలులోనే ఉంటోంది,+ ఎందుకంటే యెరికోను వేగుచూడడానికి యెహోషువ పంపించిన గూఢచారుల్ని ఆమె దాచిపెట్టింది.+ 26  అప్పుడు యెహోషువ ఈ ప్రమాణం చేశాడు:* “ఈ యెరికో నగరాన్ని మళ్లీ నిర్మించడానికి ప్రయత్నించే వ్యక్తి యెహోవా ముందు శాపగ్రస్తుడిగా ఉంటాడు. అతను దీని పునాది వేసినప్పుడు అతని పెద్ద కుమారుడు చనిపోతాడు, దీని తలుపులు నిలబెట్టినప్పుడు అతని చిన్న కుమారుడు చనిపోతాడు.”+ 27  ఆ విధంగా యెహోవా యెహోషువకు తోడుగా ఉన్నాడు,+ అతని కీర్తి భూమంతటా వ్యాపించింది.+

అధస్సూచీలు

అక్ష., “పొట్టేళ్ల కొమ్ముల్ని.”
లేదా “సుదీర్ఘ శబ్దం.”
లేదా “సందేశకుల్ని.”
లేదా “కష్టం.”
లేదా “ప్రజలతో ఈ ప్రమాణం చేయించాడు” అయ్యుంటుంది.