యెహోషువ 7:1-26

  • ఇశ్రాయేలీయులు హాయిలో ఓడిపోవడం (1-5)

  • యెహోషువ ప్రార్థన (6-9)

  • ఇశ్రాయేలీయులు ఓడిపోవడానికి కారణమైన పాపం (10-15)

  • ఆకాను తప్పు బయటపడడం, రాళ్లతో చంపబడడం (16-26)

7  అయితే నాశనం చేయబడాల్సినవాటి విషయంలో ఇశ్రాయేలీయులు నమ్మకంగా ప్రవర్తించలేదు. యూదా గోత్రానికి చెందిన జెరహు మునిమనవడూ జబ్ది మనవడూ కర్మీ కుమారుడూ అయిన ఆకాను+ నాశనం చేయబడాల్సినవాటిలో కొన్నిటిని తీసుకున్నాడు.+ దాంతో యెహోవా కోపం ఇశ్రాయేలీయుల మీద రగులుకుంది.+  ఆ తర్వాత యెహోషువ యెరికో నుండి హాయి నగరానికి+ మనుషుల్ని పంపించాడు. అది బేతావెను దగ్గర్లో, బేతేలుకు+ తూర్పున ఉంది. యెహోషువ వాళ్లతో, “మీరు వెళ్లి ఆ దేశాన్ని వేగుచూసి రండి” అని చెప్పాడు. దాంతో ఆ మనుషులు వెళ్లి హాయిని వేగుచూశారు.  వాళ్లు తిరిగొచ్చి అతనితో ఇలా అన్నారు: “ప్రజలందరూ వెళ్లాల్సిన అవసరంలేదు. హాయిని ఓడించడానికి రెండు మూడు వేలమంది సరిపోతారు. ప్రజలందర్నీ పంపించి వాళ్లు అలసిపోయేలా చేయొద్దు. అక్కడ కేవలం కొద్దిమందే ఉన్నారు.”  కాబట్టి దాదాపు 3,000 మంది అక్కడికి వెళ్లారు. కానీ వాళ్లు హాయి ప్రజల ఎదుట నుండి పారిపోవాల్సి వచ్చింది.+  హాయివాళ్లు 36 మంది ఇశ్రాయేలీయుల్ని చంపారు, వాళ్లు ఇశ్రాయేలీయుల్ని ఆ నగర ద్వారం బయట నుండి షేబారీము* వరకు తరిమారు. గుట్ట కింది వరకు వాళ్లను చంపుకుంటూ వెళ్లారు. దాంతో ప్రజల ధైర్యం నీరుగారిపోయింది.*  అప్పుడు యెహోషువ తన బట్టలు చింపుకొని యెహోవా మందసం ముందు సాయంత్రం వరకు సాష్టాంగపడ్డాడు; అతనూ ఇశ్రాయేలు పెద్దలూ అలాగే చేశారు. వాళ్లు తలలమీద దుమ్ము పోసుకుంటూ ఉన్నారు.  యెహోషువ ఇలా అన్నాడు: “అయ్యో, సర్వోన్నత ప్రభువైన యెహోవా, నువ్వు ఈ ప్రజల్ని అమోరీయులకు అప్పగించి నాశనం చేయడానికే యొర్దాను ఇవతలి వరకూ తీసుకొచ్చావా? మేము యొర్దాను అవతలి వైపే* ఉండిపోయుంటే ఎంత బాగుండేది!  యెహోవా, నన్ను క్షమించు, ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నుండి పారిపోయారు,* ఇప్పుడు నేను ఏమి చెప్పగలను?  కనానీయులు, ఆ దేశ నివాసులందరూ ఇది వింటే, వాళ్లు మమ్మల్ని చుట్టుముట్టి భూమ్మీద మా పేరే లేకుండా తుడిచేస్తారు, అప్పుడు నీ గొప్ప పేరును నువ్వు ఎలా కాపాడుకుంటావు?”+ 10  అందుకు, యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు: “లే! నువ్వు ఎందుకు ఇలా సాష్టాంగపడుతున్నావు? 11  ఇశ్రాయేలీయులు పాపం చేశారు. నేను పాటించమని వాళ్లకు ఆజ్ఞాపించిన నా ఒప్పందాన్ని+ వాళ్లు మీరారు. నాశనం చేయబడాల్సినవాటిలో నుండి+ వాళ్లు కొన్నిటిని తీసుకున్నారు, వాళ్లు వాటిని దొంగతనం చేసి,+ రహస్యంగా తమ వస్తువులతోపాటు ఉంచుకున్నారు.+ 12  అందుకే, ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ముందు నిలవలేరు. వాళ్లు శత్రువులకు వెన్నుచూపి వాళ్ల దగ్గర నుండి పారిపోతారు, ఎందుకంటే వాళ్లు నాశనం చేయబడాల్సినవాళ్లు అయ్యారు. నాశనం చేయబడాల్సినవాళ్లను మీ మధ్య నుండి నిర్మూలించకపోతే నేను మీకు తోడుగా ఉండను.+ 13  నువ్వు లేచి ప్రజల్ని పవిత్రపర్చు!+ వాళ్లకు ఇలా చెప్పు: ‘రేపటి కోసం మిమ్మల్ని మీరు పవిత్రపర్చుకోండి, ఎందుకంటే ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నాడు: “ఇశ్రాయేలీయులారా, నాశనం చేయబడాల్సినవాళ్లు మీ మధ్య ఉన్నారు. నాశనం చేయబడాల్సినవాళ్లను మీ మధ్య నుండి నిర్మూలించకపోతే మీరు మీ శత్రువుల ముందు నిలవలేరు. 14  మీరు ఉదయాన్నే మీ మీ గోత్రాల ప్రకారం రావాలి. అందులో యెహోవా ఎంపికచేసే+ గోత్రం ముందుకు రావాలి. ఆ గోత్రంలోనివాళ్లు వంశాల ప్రకారం రావాలి, అందులో యెహోవా ఎంపికచేసే వంశం ముందుకు రావాలి. ఆ వంశంలోనివాళ్లు కుటుంబాల ప్రకారం రావాలి. అందులో యెహోవా ఎంపికచేసే కుటుంబం నుండి ఒక్కొక్క మనిషి ముందుకు రావాలి. 15  నాశనం చేయబడాల్సినవాటితో పట్టుబడే వ్యక్తి అగ్నితో కాల్చబడతాడు.+ అతనూ, అతనికి చెందినవన్నీ అగ్నితో కాల్చబడతాయి. ఎందుకంటే అతను యెహోవా ఒప్పందాన్ని+ మీరాడు, ఇశ్రాయేలులో అవమానకరమైన పని చేశాడు.” ’ ” 16  కాబట్టి యెహోషువ ఆ తర్వాతి రోజు ఉదయాన్నే లేచి ఇశ్రాయేలీయుల్ని గోత్రాల ప్రకారం రప్పించాడు. అప్పుడు యూదా గోత్రం ఎంపిక చేయబడింది. 17  యూదా వంశాల్ని ముందుకు రప్పించినప్పుడు, జెరహీయుల వంశం+ ఎంపిక చేయబడింది. ఆ తర్వాత జెరహీయుల వంశంలోని ఒక్కొక్క వ్యక్తిని ముందుకు రప్పించినప్పుడు జబ్ది కుటుంబం ఎంపిక చేయబడింది. 18  చివరిగా జబ్ది కుటుంబంలోని ఒక్కొక్క మనిషిని ముందుకు రప్పించినప్పుడు, యూదా గోత్రానికి చెందిన జెరహు మునిమనవడూ జబ్ది మనవడూ కర్మీ కుమారుడూ అయిన ఆకాను ఎంపిక చేయబడ్డాడు.+ 19  అప్పుడు యెహోషువ ఆకానుతో ఇలా అన్నాడు: “నా కుమారుడా, దయచేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఘనపర్చి, ఆయన ముందు నీ తప్పు ఒప్పుకో. నువ్వేమి చేశావో దయచేసి నాకు చెప్పు. నా దగ్గర ఏమీ దాచొద్దు.” 20  అప్పుడు ఆకాను యెహోషువకు ఇలా చెప్పాడు: “అవును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసింది నేనే. నేను ఏమి చేశానంటే, 21  కొల్లగొట్టిన వాటిలో షీనారుకు+ చెందిన ఒక అందమైన* వస్త్రాన్ని, 200 షెకెల్‌ల* వెండిని, 50 షెకెల్‌ల బరువున్న ఒక బంగారు కడ్డీని చూసినప్పుడు నేను వాటిని ఆశించాను; అందుకే వాటిని తీసుకున్నాను. అవి ఇప్పుడు నా డేరా లోపల నేలలో దాచబడివున్నాయి; వెండిబంగారాలు వస్త్రం కింద ఉన్నాయి.” 22  వెంటనే యెహోషువ మనుషుల్ని పంపించాడు, వాళ్లు డేరా దగ్గరికి పరుగెత్తుకొని వెళ్లారు. అక్కడ అతని డేరాలో ఆ వస్త్రం దాచబడివుంది, వెండిబంగారాలు దాని కింద ఉన్నాయి. 23  వాళ్లు డేరా నుండి వాటిని బయటికి తీసి, యెహోషువ దగ్గరికి, ఇశ్రాయేలీయులందరి దగ్గరికి తీసుకొచ్చి, యెహోవా ముందు ఉంచారు. 24  ఆ తర్వాత యెహోషువ, అతనితోపాటు ఇశ్రాయేలీయులంతా జెరహు కుమారుడైన ఆకానును,+ వెండిని, అందమైన* వస్త్రాన్ని, బంగారు కడ్డీని,+ అలాగే అతని కుమారుల్ని, కూతుళ్లను, అతని ఎద్దుల్ని, గాడిదల్ని, మందల్ని, అతని డేరాను, అతనికి చెందినవాటన్నిటినీ ఆకోరు లోయకు+ తీసుకొచ్చారు. 25  అప్పుడు యెహోషువ ఇలా అన్నాడు: “నువ్వు మా మీదికి ఎందుకు విపత్తు* తీసుకొచ్చావు?+ ఈ రోజు యెహోవా నీ మీదికి విపత్తు తీసుకొస్తాడు.” తర్వాత ఇశ్రాయేలీయులంతా అతని మీద రాళ్లు రువ్వారు.+ ఆ తర్వాత వాళ్లను అగ్నితో కాల్చేశారు.+ అలా ఇశ్రాయేలీయులు వాళ్లందర్నీ రాళ్లతో కొట్టి చంపారు. 26  తర్వాత వాళ్లు అతని మీద ఒక పెద్ద రాళ్లకుప్ప వేశారు. అది ఈ రోజు వరకు అక్కడే ఉంది. అప్పుడు యెహోవా తీవ్రమైన కోపం చల్లారింది.+ అందుకే నేటివరకు ఆ స్థలానికి ఆకోరు* లోయ అనే పేరు ఉంది.

అధస్సూచీలు

“రాతిగుట్టలు” అని అర్థం.
లేదా “గుండెలు నీరుగారిపోయాయి.”
అంటే, తూర్పు వైపు.
లేదా “శత్రువులకు వెన్ను చూపించారు.”
లేదా “అధికారిక.”
అప్పట్లో ఒక షెకెల్‌ 11.4 గ్రాములతో సమానం. అనుబంధం B14 చూడండి.
లేదా “అధికారిక.”
లేదా “కష్టం.”
“విపత్తు; కష్టం” అని అర్థం.