యెహోషువ 9:1-27

  • తెలివైన గిబియోనీయులు శాంతి కోసం చేసిన ప్రయత్నం (1-15)

  • గిబియోనీయుల మోసం బయటపడడం (16-21)

  • గిబియోనీయుల్ని కట్టెలు ఏరేవాళ్లుగా, నీళ్లు తోడేవాళ్లుగా నియమించడం (22-27)

9  యొర్దానుకు పడమటి+ వైపున్న పర్వత ప్రాంతంలో, షెఫేలాలో, మహా సముద్ర* తీరమంతటా+ అలాగే లెబానోనుకు ఎదురుగా ఉన్న ప్రాంతంలోని రాజులందరూ అంటే హిత్తీయుల, అమోరీయుల, కనానీయుల, పెరిజ్జీయుల, హివ్వీయుల, యెబూసీయుల రాజులు+ ఆ వార్త విన్నప్పుడు  వాళ్లు యెహోషువతో, ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి ఒక్కటయ్యారు.  యెహోషువ యెరికోకు,+ హాయికి చేసినదాన్ని+ గిబియోనీయులు+ కూడా విన్నారు.  కాబట్టి వాళ్లు తెలివిగా* ప్రవర్తించారు; వాళ్లు పాత సంచుల్లో ఆహారాన్ని, అలాగే చిరిగిపోయి బాగుచేయబడిన పాత ద్రాక్షతిత్తుల్ని తమ గాడిదలమీద వేసుకున్నారు;  అంతేకాదు వాళ్లు అతుకువేసిన పాత చెప్పులు తొడుక్కొని, పాత బట్టలు వేసుకున్నారు. ఎండిపోయి, ముక్కలుముక్కలైన రొట్టెలు వాళ్ల దగ్గర ఉన్నాయి.  వాళ్లు గిల్గాలులోని పాలెంలో+ ఉన్న యెహోషువ దగ్గరికి వచ్చి అతనితో, ఇశ్రాయేలీయులతో, “మేము దూరదేశం నుండి వచ్చాం. దయచేసి ఇప్పుడు మాతో ఒక ఒప్పందం చేయండి” అని అన్నారు.  అయితే ఇశ్రాయేలీయులు ఆ హివ్వీయులతో,+ “మీరు మాకు దగ్గర్లోనే నివసిస్తున్నారేమో. మేము మీతో ఎలా ఒప్పందం చేసుకోగలం?”+ అన్నారు.  అప్పుడు వాళ్లు యెహోషువతో, “మేము నీ సేవకులం”* అన్నారు. యెహోషువ వాళ్లను, “మీరెవరు? ఎక్కడి నుండి వచ్చారు?” అని అడిగాడు.  దానికి వాళ్లు అతనితో ఇలా అన్నారు: “నీ సేవకులమైన మేము నీ దేవుడైన యెహోవా పేరుమీద ఉన్న గౌరవంతో ఎంతో దూరదేశం+ నుండి వచ్చాం. ఎందుకంటే మేము ఆయన కీర్తి గురించి, ఐగుప్తులో ఆయన చేసిన వాటన్నిటి గురించి విన్నాం;+ 10  యొర్దాను అవతల* ఉన్న అమోరీయుల ఇద్దరు రాజులకు అంటే హెష్బోను రాజైన సీహోనుకు,+ అష్తారోతులో ఉండే బాషాను రాజైన ఓగుకు+ ఆయన చేసినదంతా మేము విన్నాం. 11  అందుకే మా పెద్దలు, మా దేశ ప్రజలు మాకు ఇలా చెప్పారు: ‘ప్రయాణానికి కావాల్సిన ఆహారం తీసుకొని, వెళ్లి వాళ్లను కలిసి, “మేము మీ సేవకులుగా ఉంటాం;+ దయచేసి మాతో ఇప్పుడు ఒక ఒప్పందం చేయండి”+ అని వాళ్లతో చెప్పండి.’ 12  ఇక్కడ మీ దగ్గరికి రావడానికి మేము మా ఇళ్ల దగ్గర నుండి బయల్దేరినప్పుడు మేము తెచ్చుకున్న ఈ రొట్టెలు వేడిగా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు ఇవి ఎండిపోయి, ముక్కలైపోయాయి.+ 13  మేము ఈ ద్రాక్షతిత్తుల్ని నింపినప్పుడు ఇవి కొత్తవి, ఇప్పుడు ఇవి చిరిగిపోయాయి.+ చాలా దూరం ప్రయాణం చేయడం వల్ల మా బట్టలు, చెప్పులు పాతవైపోయాయి.” 14  అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియోనీయులు తెచ్చుకున్న ఆహారంలో కొంత తీసుకొని పరిశీలించారు, అయితే వాళ్లు యెహోవా దగ్గర విచారణ చేయలేదు.+ 15  అప్పుడు యెహోషువ వాళ్లతో సంధి చేసుకొని+ వాళ్లను బ్రతకనిచ్చేలా ఒప్పందం చేశాడు. సమాజ ప్రధానులు ఆ మాటకు కట్టుబడివుంటామని ప్రమాణం చేశారు.+ 16  వాళ్లు గిబియోనీయులతో ఒప్పందం చేసిన మూడు రోజుల తర్వాత, ఆ గిబియోనీయులు దగ్గర్లోనే, తమ చుట్టుపక్కల ప్రాంతంలోనే ఉంటున్నారని వాళ్లకు తెలిసింది. 17  అప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయాణించి మూడో రోజున గిబియోనీయుల నగరాలకు వచ్చారు; గిబియోను,+ కెఫీరా, బెయేరోతు, కిర్యత్యారీము+ అనేవి వాళ్ల నగరాలు. 18  కానీ ఇశ్రాయేలీయులు వాళ్లమీద దాడి చేయలేదు. ఎందుకంటే సమాజ ప్రధానులు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున ఒట్టేసి వాళ్లకు ప్రమాణం చేశారు.+ కాబట్టి సమాజమంతా ఆ ప్రధానుల మీద సణగడం మొదలుపెట్టారు. 19  అప్పుడు ఆ ప్రధానులు సమాజమంతటితో ఇలా అన్నారు: “మేము ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరున ఒట్టేసి వాళ్లకు ప్రమాణం చేశాం; అందుకే మనం వాళ్లకు హాని చేయకూడదు. 20  మనం ఇలా చేద్దాం: మేము వాళ్లకు ఒట్టేసి ప్రమాణం చేశాం కాబట్టి దేవుని కోపం మనమీదికి రాకుండా ఉండేలా మనం వాళ్లను బ్రతకనిద్దాం.”+ 21  ప్రధానులు ఇంకా ఇలా అన్నారు: “వాళ్లను బ్రతకనిద్దాం. అయితే వాళ్లు సమాజమంతటి కోసం కట్టెలు ఏరేవాళ్లుగా, నీళ్లు తోడేవాళ్లుగా ఉంటారు.” ప్రధానులు గిబియోనీయులకు ఆ విధంగానే మాట ఇచ్చారు. 22  అప్పుడు యెహోషువ గిబియోనీయుల్ని పిలిచి ఇలా అన్నాడు: “మీరు నిజానికి మాకు దగ్గర్లోనే నివసిస్తూ, ‘మీకు చాలా దూర ప్రాంతంలో ఉంటున్నాం’ అని చెప్పి మమ్మల్ని ఎందుకు మోసం చేశారు?+ 23  ఇప్పటినుండి మీరు శపించబడినవాళ్లు.+ మీరు ఎప్పుడూ దాసుని స్థానంలోనే ఉంటారు. మీరు నా దేవుని మందిరం కోసం కట్టెలు ఏరేవాళ్లుగా, నీళ్లు తోడేవాళ్లుగా ఉంటారు.” 24  అప్పుడు వాళ్లు యెహోషువతో ఇలా అన్నారు: “మీకు ఈ దేశాన్నంతటినీ ఇవ్వమని, దానిలో ఉన్న నివాసులందర్నీ మీ ఎదుట నుండి నాశనం చేయమని మీ దేవుడైన యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించాడన్న విషయం+ నీ సేవకులైన మాకు తెలిసింది. అందుకే మీరు మమ్మల్ని చంపేస్తారనే భయంతో+ మేము ఇలా చేశాం.+ 25  ఇప్పుడు మేము నీ చేతుల్లో ఉన్నాం. నీ దృష్టికి ఏది మంచిదనిపిస్తే, ఏది సరైనదనిపిస్తే అది చేయి.” 26  అప్పుడు యెహోషువ అలాగే చేశాడు; అతను వాళ్లను ఇశ్రాయేలీయుల చేతుల్లో నుండి రక్షించాడు, వాళ్లు గిబియోనీయుల్ని చంపలేదు. 27  అయితే సమాజం కోసం, యెహోవా ఎంపిక చేసే స్థలంలో+ ఉండే ఆయన బలిపీఠం కోసం కట్టెలు ఏరేవాళ్లుగా, నీళ్లు తోడేవాళ్లుగా ఆ రోజు యెహోషువ వాళ్లను నియమించాడు.+ ఈ రోజు వరకు వాళ్లు అదే పని చేస్తున్నారు.+

అధస్సూచీలు

అంటే, మధ్యధరా సముద్రం.
లేదా “యుక్తిగా.”
లేదా “దాసులం.”
అంటే, తూర్పు వైపున.