యోనా 3:1-10

  • దేవునికి లోబడి యోనా నీనెవెకు వెళ్లడం (1-4)

  • యోనా సందేశం విని నీనెవెవాళ్లు పశ్చాత్తాపపడడం (5-9)

  • నీనెవెను నాశనం చేయకూడదని దేవుడు అనుకోవడం (10)

3  అప్పుడు యెహోవా వాక్యం రెండోసారి యోనా దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది:+  “లేచి మహా నగరమైన నీనెవెకు+ వెళ్లి, నేను నీకు చెప్పే సందేశాన్ని దానికి ప్రకటించు.”  కాబట్టి యోనా లేచి యెహోవా మాటకు లోబడి నీనెవెకు+ వెళ్లాడు.+ నీనెవె చాలా పెద్ద నగరం,* కాలినడకన మూడురోజులు నడిచేంత పెద్దది.  యోనా నగరంలోకి ప్రవేశించి, ఒకరోజు నడిచేంత దూరం వెళ్లి, “ఇంకో 40 రోజుల్లో నీనెవె నాశనం చేయబడుతుంది” అని ప్రకటించడం మొదలుపెట్టాడు.  అప్పుడు నీనెవె ప్రజలు దేవుని మీద విశ్వాసం ఉంచారు.+ వాళ్లు ఉపవాసాన్ని ప్రకటించి, సామాన్యుల నుండి గొప్పవాళ్ల వరకు అందరూ గోనెపట్ట కట్టుకున్నారు.  నీనెవె రాజుకు ఆ సందేశం చేరినప్పుడు అతను తన సింహాసనం మీద నుండి లేచి, రాజవస్త్రాన్ని తీసేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు.  అంతేకాదు అతను నీనెవె అంతటా ఈ ప్రకటన జారీచేశాడు: “రాజు, అతని అధికారులు ఆజ్ఞాపించేది ఏమిటంటే, ఏ మనిషి గానీ, జంతువు గానీ, పశువులు గానీ, గొర్రెలు-మేకలు గానీ అస్సలు ఏమీ తినకూడదు. ఎవ్వరూ ఆహారం తినకూడదు, నీళ్లు కూడా తాగకూడదు.  మనుషులు, జంతువులు అందరూ గోనెపట్ట కట్టుకోవాలి; వాళ్లు దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకోవాలి. తమ చెడు మార్గాల్ని విడిచిపెట్టాలి, హానికరమైన ప్రవర్తన మానేయాలి.  ఒకవేళ సత్యదేవుడు తాను చేయాలనుకుంటున్న దానిగురించి ఇంకోసారి ఆలోచించుకుని* తన కోపాగ్నిని చల్లార్చుకుంటాడేమో, అప్పుడు మనం నాశనమవకుండా ఉంటాం.” 10  వాళ్లు ఏమి చేశారో, వాళ్లు ఎలా తమ చెడు మార్గాల్ని విడిచిపెట్టారో+ సత్యదేవుడు చూసినప్పుడు ఆయన వాళ్ల మీదికి తీసుకొస్తానని చెప్పిన విపత్తు గురించి ఇంకోసారి ఆలోచించాడు.* ఆయన వాళ్ల మీదికి ఆ విపత్తును తీసుకురాలేదు.+

అధస్సూచీలు

అక్ష., “దేవుని దృష్టికి గొప్ప నగరం.”
లేదా “మనసు మార్చుకుని.”
లేదా “మనసు మార్చుకున్నాడు.”