యోనా 4:1-11

  • యోనాకు కోపం వచ్చి, చనిపోవాలని కోరుకోవడం (1-3)

  • యెహోవా యోనాకు కరుణను నేర్పించడం (4-11)

    • “నువ్వు అంతగా కోప్పడడం న్యాయమేనా?” (4)

    • సొర చెట్టుతో వస్తు పాఠం (6-10)

4  కానీ అది యోనాకు అస్సలు నచ్చలేదు, అతనికి విపరీతమైన కోపం వచ్చింది.  కాబట్టి అతను యెహోవాకు ఇలా ప్రార్థించాడు: “యెహోవా, ఇలా జరుగుతుందని నా దేశంలో ఉన్నప్పుడే నాకు తెలుసు కదా. అందుకే నేను ముందే తర్షీషుకు పారిపోవాలని చూశాను;+ ఎందుకంటే నువ్వు కనికరం,* కరుణ గల దేవుడివని, ఓర్పును,* ఎంతో విశ్వసనీయ ప్రేమను చూపిస్తావని,+ మనసు మార్చుకుని విపత్తును తీసుకురావని నాకు తెలుసు.  యెహోవా, దయచేసి నా ప్రాణం తీసేయి. నేను బ్రతకడం కన్నా చావడం మేలు.”+  అప్పుడు యెహోవా ఇలా అడిగాడు: “నువ్వు అంతగా కోప్పడడం న్యాయమేనా?”  తర్వాత యోనా నగరం బయటికి వెళ్లి, నగరానికి తూర్పు వైపున కూర్చున్నాడు. అక్కడ తన కోసం ఒక పందిరి వేసుకుని, ఆ నగరానికి ఏమి జరుగుతుందో చూద్దామని ఆ పందిరి నీడలో కూర్చున్నాడు.+  అప్పుడు యెహోవా దేవుడు ఒక సొర చెట్టును* యోనాకు పైగా పెరిగేలా చేశాడు. అతని తలకు నీడనిచ్చి, అతని చికాకును తగ్గించడానికి అలా చేశాడు. యోనా ఆ సొర చెట్టును చూసి ఎంతో సంతోషించాడు.  అయితే మర్నాడు ఉదయం సత్యదేవుడు ఒక పురుగును పంపించాడు, అది సొర చెట్టును తొలచడంతో ఆ చెట్టు వాడిపోయింది.  ఎండ మొదలైనప్పుడు, దేవుడు తూర్పు నుండి వడగాలి కూడా వీచేలా చేశాడు. యోనా తలకు ఎండ బాగా తగిలి సొమ్మసిల్లిపోయాడు. చనిపోవాలని అతను అదేపనిగా కోరుకున్నాడు, “నేను బ్రతకడం కన్నా చావడం మేలు” అని అతను అనుకుంటూ ఉన్నాడు.+  దేవుడు యోనాను ఇలా అడిగాడు: “సొర చెట్టు విషయంలో నువ్వు అంతగా కోప్పడడం న్యాయమేనా?”+ దానికి అతను, “నేను కోప్పడడం న్యాయమే. నాకు చచ్చిపోవాలన్నంత కోపం వస్తోంది” అన్నాడు. 10  అయితే యెహోవా ఇలా అన్నాడు: “నువ్వు కష్టపడకుండా, పెంచకుండా, ఒక్క రాత్రిలో పెరిగి ఒక్క రాత్రిలో చచ్చిపోయిన సొర చెట్టు విషయంలోనే నువ్వు ఇంత బాధపడుతున్నావే. 11  మరి కనీసం మంచిచెడులు తెలియని* 1,20,000 కన్నా ఎక్కువమంది ప్రజలు, అలాగే వాళ్ల విస్తారమైన పశువులు ఉన్న నీనెవె మహా నగరం+ విషయంలో నేను బాధపడవద్దా?”+

అధస్సూచీలు

లేదా “దయ.”
లేదా “కోప్పడే విషయంలో నిదానిస్తావని.”
లేదా “ఆముదం చెట్టు” అయ్యుంటుంది.
లేదా “తమ కుడిచేతికి, ఎడమచేతికి తేడా తెలియని.”