యోబు 14:1-22
14 “స్త్రీకి పుట్టిన మనిషి కొంతకాలమే బ్రతుకుతాడు,+అదీ కష్టాలూ కన్నీళ్లతో.+
2 అతను పువ్వులా వికసించి, వాడిపోతాడు;*+నీడలా పారిపోయి కనుమరుగౌతాడు.+
3 అవును, నువ్వు అతని మీద దృష్టి నిలిపావు,నీతోపాటు అతన్ని* న్యాయస్థానానికి తీసుకొస్తున్నావు.+
4 అపవిత్రుడికి పవిత్రుడు పుడతాడా?+ పుట్టడు!
5 అతని ఆయుష్షు నిర్ణయించబడివుంటే,అతని నెలల సంఖ్య నీ చేతిలో ఉంది;అతను దాటి వెళ్లకుండా నువ్వు అతనికి ఒక హద్దు పెట్టావు.+
6 అతను విశ్రాంతి తీసుకునేలా, కూలివాడిలా తన పని ముగించేవరకు,అతని మీద నుండి నీ చూపు పక్కకు తిప్పుకో.+
7 చెట్టుకు కూడా ఒక ఆశ ఉంటుంది.
దాన్ని నరికేస్తే మళ్లీ చిగురిస్తుంది,దాని లేత కొమ్మలు పెరుగుతూనే ఉంటాయి.
8 భూమిలో దాని వేరు పాతబడినా,మట్టిలో దాని మొద్దు ఎండిపోయినా,
9 నీటి వాసన తగలగానే అది చిగురిస్తుంది;లేత మొక్కలా కొమ్మలు తొడుగుతుంది.
10 కానీ మనిషి చనిపోతే నిస్సహాయంగా పడివుంటాడు;ప్రాణం పోయాక అతను ఎక్కడికి వెళ్లినట్టు?+
11 సముద్రంలోని నీళ్లు ఆవిరైపోతాయి,నది ఇంకిపోయి ఎండిపోతుంది.
12 అలాగే మనిషి కూడా పడుకుని ఇక లేవడు.+
ఆకాశం లేకుండా పోయేంతవరకు అతను మేల్కోడు,ఎవరూ అతన్ని నిద్రలేపరు.+
13 నువ్వు నన్ను సమాధిలో* దాచిపెడితే,+నీ కోపం చల్లారేవరకు నన్ను చాటున ఉంచితే,ఇంత సమయమని నియమించి తర్వాత నన్ను గుర్తుచేసుకుంటే ఎంత బావుంటుంది!+
14 మనిషి చనిపోతే మళ్లీ బ్రతకగలడా?+
నాకు విడుదల కలిగేవరకు,+నా నిర్బంధ సేవ రోజులన్నీ నేను వేచి ఉంటాను.
15 నువ్వు పిలుస్తావు, నేను నీకు జవాబిస్తాను.+
నీ చేతుల పనిని చూడాలని నువ్వు ఎంతో కోరుకుంటావు.
16 ఇప్పుడైతే నువ్వు నా ప్రతీ అడుగును లెక్కపెడుతున్నావు;నా పాపాల కోసమే చూస్తున్నావు.
17 నా అపరాధాన్ని సంచిలో పెట్టి ముద్ర వేశావు,నా తప్పును జిగురుతో ముద్ర వేశావు.
18 పర్వతం పడిపోయి ముక్కలైపోయినట్టు,బండరాయి దాని స్థానం నుండి పక్కకు తొలిగినట్టు,
19 నీళ్లు రాళ్లను అరగదీసినట్టు,నీటి ప్రవాహానికి మట్టి కొట్టుకుపోయినట్టు,నువ్వు మనిషి ఆశను నాశనం చేశావు.
20 అతను నశించిపోయేవరకు నువ్వు అతని మీద పైచేయి సాధిస్తూ ఉంటావు;+అతని రూపాన్ని వికారంగా మార్చి అతన్ని పంపించేస్తావు.
21 అతని కుమారులు ఘనత పొందుతారు, కానీ ఆ విషయం అతనికి తెలీదు;వాళ్లు అవమానం పొందుతారు, అయినా అతను దాన్ని గ్రహించలేడు.+
22 బ్రతికున్నంత వరకే అతనికి బాధ తెలుస్తుంది;ప్రాణం ఉన్నంత వరకే అతను దుఃఖిస్తాడు.”