యోబు 22:1-30
22 అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు+ ఇలా అన్నాడు:
2 “మనిషి వల్ల దేవునికి వచ్చే లాభం ఏంటి?
లోతైన అవగాహన ఉన్న వ్యక్తి వల్ల ఆయనకు వచ్చే ప్రయోజనం ఏంటి?+
3 నువ్వు నీతిమంతునిగా ఉండడాన్ని బట్టి సర్వశక్తిమంతుడు సంతోషిస్తాడా?*నువ్వు యథార్థంగా నడుచుకోవడం వల్ల ఆయనకు ఏమైనా వస్తుందా?+
4 నీ భక్తిని బట్టి ఆయన నిన్ను శిక్షిస్తాడా,నిన్ను న్యాయస్థానానికి తీసుకెళ్తాడా?
5 నీ దుష్టత్వం మితిమీరిపోవడం వల్ల,నీ తప్పులకు అంతు లేకపోవడం వల్లే అలా చేస్తాడు.+
6 నువ్వు ఏ కారణం లేకుండానే నీ సహోదరుల దగ్గర హామీ తీసుకుంటావు,పేదవాళ్ల బట్టల్ని లాగేసుకుని వాళ్లను దిగంబరుల్ని చేస్తావు.+
7 నువ్వు అలసిన వాళ్లకు నీళ్లు ఇవ్వవు,ఆకలితో ఉన్న వాళ్లకు ఆహారం ఇవ్వవు.+
8 బలవంతునిదే భూమి,+ఘనత పొందినవాడే దానిలో నివసిస్తాడు.
9 నువ్వు విధవరాళ్లను వట్టిచేతులతో పంపేశావు,తండ్రిలేని పిల్లల* చేతుల్ని నలగ్గొట్టావు.
10 అందుకే నీ చుట్టూ ఉరులు* ఉన్నాయి,+ఆకస్మిక భయాలు నిన్ను పట్టుకుంటున్నాయి;
11 అందుకే, నువ్వు చూడలేనంతగా చీకటి అలుముకుంది,వరద నిన్ను ముంచెత్తుతోంది.
12 దేవుడు ఆకాశమంత ఎత్తులో లేడా?
నక్షత్రాలు ఎంత ఎత్తులో ఉన్నాయో చూడు.
13 నువ్వేమో ఇలా అంటున్నావు: ‘దేవునికి ఏం తెలుసు?
ఆయన కటిక చీకటిలో తీర్పు తీర్చగలడా?
14 ఆయన ఆకాశంలో* తిరుగుతున్నప్పుడుఆయనకు ఏమీ కనిపించకుండా మేఘాలు అడ్డుగా ఉన్నాయి.’
15 దుష్టులు నడిచిన పురాతన మార్గంలో నువ్వు నడుస్తావా?
16 తమ సమయం రాకముందే వాళ్లు తీసుకెళ్లబడ్డారు,*వాళ్ల పునాది వరదకు* కొట్టుకుపోయింది.+
17 వాళ్లు సత్యదేవునితో, ‘మమ్మల్ని ఇలా వదిలేయి!’ అన్నారు.
‘సర్వశక్తిమంతుడు మమ్మల్ని ఏం చేస్తాడు?’ అని వాళ్లు అనుకున్నారు.
18 అయినా, వాళ్ల ఇళ్లను మంచివాటితో నింపింది ఆయనే.
(అలాంటి చెడ్డ ఆలోచన నాకు చాలా దూరం.)
19 నీతిమంతులు వాళ్ల పతనాన్ని చూసి సంతోషిస్తారు,నిర్దోషులు వాళ్లను ఎగతాళి చేస్తూ ఇలా అంటారు:
20 ‘మన విరోధులు నాశనమయ్యారు,అగ్ని వాళ్ల జాడలన్నిటినీ దహించేస్తుంది.’
21 ఆయన్ని తెలుసుకో, అప్పుడు నువ్వు నెమ్మదితో ఉంటావు;నీకు మంచి జరుగుతుంది.
22 ఆయన నోటి ఉపదేశాన్ని* అంగీకరించు,ఆయన మాటల్ని నీ హృదయంలో ఉంచుకో.+
23 నువ్వు సర్వశక్తిమంతుని దగ్గరికి తిరిగొస్తే మళ్లీ పూర్వస్థితికి వస్తావు;+నువ్వు నీ డేరాలో నుండి చెడును తీసేస్తే,
24 నీ బంగారాన్ని మట్టిలోకి,ఓఫీరు బంగారాన్ని+ బండరాతి లోయల్లోకి* విసిరేస్తే,
25 సర్వశక్తిమంతుడే నీకు బంగారం అవుతాడు,ఆయనే నీకు శ్రేష్ఠమైన వెండిగా ఉంటాడు.
26 నువ్వు సర్వశక్తిమంతుణ్ణి బట్టి సంతోషిస్తావు,దేవుని వైపు నీ ముఖాన్ని ఎత్తుతావు.
27 నువ్వు ప్రార్థిస్తే ఆయన వింటాడు;నీ మొక్కుబళ్లను నువ్వు చెల్లిస్తావు.
28 నువ్వు చేయాలనుకున్నదల్లా సఫలమౌతుంది,నీ దారి మీద వెలుగు ప్రకాశిస్తుంది.
29 నువ్వు గర్వంగా మాట్లాడితే అవమానాలపాలు అవుతావు,అయితే వినయస్థుల్ని ఆయన రక్షిస్తాడు.
30 ఆయన నిర్దోషుల్ని కాపాడతాడు;కాబట్టి నీ చేతులు శుభ్రంగా ఉంటే, నువ్వు ఖచ్చితంగా కాపాడబడతావు.”
అధస్సూచీలు
^ లేదా “పట్టించుకుంటాడా?”
^ లేదా “అనాథల.”
^ అక్ష., “పక్షి వలలు.”
^ అక్ష., “ఆకాశ మండలంపై.”
^ లేదా “వాళ్ల ఆయుష్షు తగ్గించబడింది.”
^ అక్ష., “నదికి.”
^ లేదా “ధర్మశాస్త్రాన్ని.”
^ లేదా “వాగుల్లోకి.”