యోబు 26:1-14

  • యోబు జవాబు (1-14)

    • “శక్తిలేని వాడికి నువ్వు ఎంత బాగా సహాయం చేశావు!” (1-4)

    • ‘దేవుడు భూమిని ఏ ఆధారం లేకుండా ​వేలాడదీశాడు’ (7)

    • ‘దేవుని మార్గాల అంచులు మాత్రమే’ (14)

26  అప్పుడు యోబు ఇలా అన్నాడు:   “శక్తిలేని వాడికి నువ్వు ఎంత బాగా సహాయం చేశావు! బలంలేని చేతిని ఎంత చక్కగా బలపర్చావు!+   తెలివిలేని వాడికి ఎంత గొప్ప సలహా ఇచ్చావు!+ నీ ఆచరణాత్మక తెలివిని* ఎంత ఉదారంగా వెల్లడిచేశావు!   నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు?అలా మాట్లాడేలా ఎవరు నిన్ను ప్రేరేపించారు?*   చనిపోయి శక్తిహీనంగా ఉన్నవాళ్లు వణికిపోతున్నారు;వాళ్లు జలాల కన్నా, వాటిలోని ప్రాణుల కన్నా కింద ఉన్నారు.   సమాధి* కూడా దేవునికి* స్పష్టంగా కనిపిస్తుంది,+నాశనస్థలంలోని* ప్రతీదాన్ని ఆయన చూడగలడు.   ఆయన ఉత్తరం వైపున్న ఆకాశాన్ని* శూన్యం మీద పరుస్తున్నాడు,+భూమిని ఏ ఆధారం లేకుండా వేలాడదీస్తున్నాడు.   మేఘాలు వాటి బరువు వల్ల పగిలిపోకుండా ఉండేలా,నీళ్లను తన మేఘాల్లో మూటకడుతున్నాడు;+   తన సింహాసనం కనబడకుండా ఉండేలా,తన మేఘంతో దాన్ని కప్పుతున్నాడు.+ 10  ఆయన ఆకాశానికి, సముద్రానికి మధ్య సరిహద్దు రేఖ* గీశాడు;+వెలుగుకు, చీకటికి మధ్య సరిహద్దు పెట్టాడు. 11  ఆయన గద్దించినప్పుడు ఆకాశ స్తంభాలు కంపిస్తాయి, వణికిపోతాయి. 12  ఆయన తన శక్తితో సముద్రంలో అలజడి రేపుతాడు,+తన అవగాహనతో భారీ సముద్రప్రాణిని* ముక్కలుముక్కలు చేస్తాడు.+ 13  ఆయన ఊపిరి* ఆకాశాన్ని తేటపరుస్తుంది;ఆయన చెయ్యి పాకే సర్పాన్ని పొడుస్తుంది. 14  ఇవి ఆయన మార్గాల అంచులు మాత్రమే.+ఆయన గురించి మనం విన్నది కేవలం గుసగుస శబ్దమే! అలాంటిది, ఆయన మహా గర్జనను ఎవరు అర్థం చేసుకోగలరు?”+

అధస్సూచీలు

లేదా “ఇంగిత జ్ఞానాన్ని.”
అక్ష., “ఎవరి ఊపిరి నీలో నుండి బయల్దేరింది?”
లేదా “షియోల్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.
అక్ష., “ఆయనకు.”
లేదా “అబద్దోనులోని.”
అక్ష., “ఉత్తరాన్ని.”
అక్ష., “వృత్తం.”
అక్ష., “రాహాబును.”
లేదా “గాలి.”