యోవేలు 1:1-20
1 పెతూయేలు కుమారుడైన యోవేలు* దగ్గరికి వచ్చిన యెహోవా వాక్యం:
2 “పెద్దలారా, ఇది వినండి,దేశ* నివాసులారా, మీరంతా శ్రద్ధగా ఆలకించండి.
మీ రోజుల్లో గానీ, మీ పూర్వీకుల రోజుల్లో గానీఇలాంటిది ఏదైనా జరిగిందా?+
3 మీరు దీని గురించి మీ కుమారులకు చెప్పండి,వాళ్లు వాళ్ల కుమారులకు చెప్పాలి,వాళ్లు ఆ తర్వాతి తరానికి చెప్పాలి.
4 నాశనకరమైన మిడతలు వదిలేసినదాన్ని మిడతల దండు తినేసింది;+మిడతల దండు వదిలేసినదాన్ని రెక్కల్లేని మిడతలు తినేశాయి;రెక్కల్లేని మిడతలు వదిలేసినదాన్ని తిండిబోతు మిడతలు తినేశాయి.+
5 తాగుబోతులారా,+ మేల్కోండి! ఏడ్వండి!
ద్రాక్షారసం తాగేవాళ్లారా, మీరంతా గట్టిగా ఏడ్వండి.ఎందుకంటే మీ నోటి దగ్గర నుండి తియ్యని ద్రాక్షారసం తీసేయబడింది.+
6 పెద్ద మిడతల దండు ఒక జనంలా నా దేశం మీదికి వచ్చింది.+
వాటి పళ్లు సింహం పళ్లలా,+ వాటి దవడలు సింహం దవడల్లా ఉన్నాయి.
7 అవి నా ద్రాక్షచెట్టును నాశనం చేశాయి, నా అంజూర చెట్టును మోడుగా మార్చాయి,వాటి బెరడును ఒలిచి వాటిని విసిరిపారేశాయి,దాంతో చెట్ల రెమ్మలు తెల్లబారాయి.
8 గోనెపట్ట కట్టుకొని తన యౌవనకాల పెళ్లి కుమారుడి* కోసంఏడుస్తున్న కన్యలా* గట్టిగా ఏడ్వండి.
9 యెహోవా మందిరంలో ధాన్యార్పణ,+ పానీయార్పణ+ ఆగిపోయాయి;యెహోవాకు పరిచారం చేసే యాజకులు దుఃఖిస్తున్నారు.
10 పొలం నాశనం చేయబడింది, నేల విలపిస్తోంది;+ఎందుకంటే ధాన్యం నాశనమైంది, కొత్త ద్రాక్షారసం ఇక లేదు, నూనె అయిపోయింది.+
11 రైతులు గోధుమల గురించి, బార్లీ గురించి దిగులుపడుతున్నారు,ద్రాక్షతోట రైతులు ఏడుస్తున్నారు;ఎందుకంటే పొలంలోని పంట నాశనమైంది.
12 ద్రాక్ష చెట్టు ఎండిపోయింది,అంజూర చెట్టు వాడిపోయింది.
దానిమ్మ చెట్లు, ఖర్జూర చెట్లు, ఆపిల్ చెట్లు,పొలంలోని చెట్లన్నీ ఎండిపోయాయి;+ప్రజల సంతోషం అవమానంగా మారింది.
13 యాజకులారా, గోనెపట్ట కట్టుకుని దుఃఖించండి;*బలిపీఠం దగ్గర పనిచేసే పరిచారకులారా,+ ఏడ్వండి.
నా దేవుని పరిచారకులారా, రండి, రాత్రంతా గోనెపట్ట కట్టుకొని ఉండండి;ఎందుకంటే, మీ దేవుని మందిరంలో ధాన్యార్పణ,+ పానీయార్పణ+ ఆగిపోయాయి.
14 ఉపవాసాన్ని ప్రకటించండి; ప్రత్యేక సమావేశానికి పిలుపునివ్వండి.+
దేశ నివాసులందరితో పాటు పెద్దల్ని
మీ దేవుడైన యెహోవా మందిరం దగ్గర సమావేశపర్చండి,+సహాయం కోసం యెహోవాకు మొరపెట్టండి.
15 అయ్యో, ఆ రోజు వస్తోంది!
యెహోవా రోజు దగ్గర్లో ఉంది,+అది సర్వశక్తుని దగ్గర నుండి నాశనంలా వస్తుంది!
16 మన కళ్లముందు నుండి ఆహారం,మన దేవుని మందిరం నుండి ఆనందం, సంతోషం తీసేయబడ్డాయి.
17 పారల కింద విత్తనాలు* ముడుచుకుపోయాయి.
గోదాములు ఖాళీగా ఉన్నాయి.
ధాన్యం ఎండిపోవడంతో ధాన్యం కొట్లను పడగొట్టారు.
18 చివరికి పశువులు కూడా మూల్గుతున్నాయి!
పచ్చికబయళ్లు లేక పశువుల మందలు అయోమయంగా తిరుగుతున్నాయి!
గొర్రెల మందలు కూడా శిక్షను భరిస్తున్నాయి.
19 యెహోవా, నీకే నేను మొరపెట్టుకుంటున్నాను;+ఎందుకంటే, ఎడారిలోని* పచ్చికబయళ్లను అగ్ని దహించేసింది.మంట పొలంలోని చెట్లన్నిటినీ కాల్చేసింది.
20 నీటి ప్రవాహాలు ఎండిపోవడం వల్ల,ఎడారిలోని పచ్చికబయళ్లను అగ్ని కాల్చేయడం వల్లఅడవి జంతువులు కూడా నీ వైపు చూస్తున్నాయి.”
అధస్సూచీలు
^ “యెహోవాయే దేవుడు” అని అర్థం.
^ లేదా “భూమి.”
^ లేదా “భర్త.”
^ లేదా “యువతిలా.”
^ లేదా “గుండెలు బాదుకోండి.”
^ లేదా “ఎండు అంజూర పండ్లు” అయ్యుంటుంది.