యోవేలు 3:1-21
3 “ఇదిగో! ఆ రోజుల్లో, ఆ సమయంలోనేను యూదా, యెరూషలేము ప్రజల్ని చెరలో నుండి వెనక్కి తీసుకొచ్చినప్పుడు,+
2 సమస్త దేశాల ప్రజల్ని కూడా పోగుచేస్తాను,వాళ్లను యెహోషాపాతు* లోయలోకి తీసుకొస్తాను.
నా ప్రజల తరఫున, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయుల తరఫునవాళ్లకు అక్కడ తీర్పు తీరుస్తాను,+ఎందుకంటే, వాళ్లు నా ప్రజల్ని దేశదేశాలకు చెదరగొట్టారు,నా దేశాన్ని పంచుకున్నారు.+
3 నా ప్రజల కోసం వాళ్లు చీట్లు* వేసుకుంటారు;+వేశ్యను తెచ్చుకోవడానికి పిల్లవాణ్ణి,ద్రాక్షారసం కోసం అమ్మాయిని అమ్మేస్తారు.
4 తూరూ, సీదోనూ, సమస్త ఫిలిష్తియ ప్రాంతాల్లారా, నాతో మీకేంటి?మీరు ఏ విషయంలోనైనా నా మీద పగ తీర్చుకుంటున్నారా?
అలాగైతే, మీరు చేసినదాన్ని నేను చాలా త్వరగా మీ తలల మీదికి రప్పిస్తాను.+
5 ఎందుకంటే మీరు నా వెండిని, బంగారాన్ని పట్టుకెళ్లారు,+నా శ్రేష్ఠమైన సంపదల్ని మీ గుళ్లలో పెట్టుకున్నారు;
6 యూదా, యెరూషలేము ప్రజల్ని గ్రీకువాళ్లకు అమ్మేశారు,+అలా మీరు వాళ్ల ప్రాంతం నుండి వాళ్లను దూరంగా పంపించేశారు;
7 మీరు ఎక్కడైతే వాళ్లను అమ్మేశారో అక్కడి నుండి నేను వాళ్లను తీసుకొస్తాను,+మీరు చేసినదాన్ని మీ తలల మీదికి రప్పిస్తాను.
8 మీ కుమారుల్ని, కూతుళ్లను యూదా ప్రజలకు అమ్మేస్తాను,+వాళ్లు దూరంలో ఉన్న షెబావాళ్లకు వాళ్లను అమ్మేస్తారు;యెహోవాయే స్వయంగా ఈ మాట చెప్పాడు.
9 ఇతర దేశాల ప్రజల మధ్య ఇలా చాటించండి:+
‘యుద్ధానికి సిద్ధంకండి! బలవంతుల్ని పురికొల్పండి!
సైనికులంతా ముందుకుసాగి దాడిచేయాలి!+
10 మీ నాగటి నక్కుల్ని కత్తులుగా, మచ్చుకత్తుల్ని* ఈటెలుగా* సాగగొట్టండి.
బలహీనుడు, “నేను బలవంతుణ్ణి” అని అనాలి.
11 చుట్టుపక్కల దేశాల్లారా, మీరంతా ఒకరికొకరు సహాయం చేసుకోండి, సమకూడండి!’ ”+
యెహోవా, ఆ స్థలానికి నీ బలవంతుల్ని* తీసుకురా.
12 “దేశాలు లేచి యెహోషాపాతు లోయలోకి రావాలి;ఎందుకంటే, చుట్టుపక్కల దేశాలన్నిటికీ తీర్పు తీర్చడానికి నేను అక్కడ కూర్చుంటాను.+
13 పైరు పండింది, కొడవలితో కోయండి.
ద్రాక్షతొట్టి నిండిపోయింది, వచ్చి తొక్కండి.+
ద్రాక్షతొట్లు పొంగిపొర్లుతున్నాయి, ఎందుకంటే దేశాల చెడుతనం చాలా ఎక్కువగా ఉంది.
14 తీర్పు లోయలో ప్రజలు గుంపులుగుంపులుగా ఉన్నారు,ఎందుకంటే తీర్పు లోయలో యెహోవా రోజు దగ్గరపడింది.+
15 సూర్యుడు, చంద్రుడు చీకటైపోతాయి,నక్షత్రాలు కాంతిని కోల్పోతాయి.
16 యెహోవా సీయోనులో నుండి గర్జిస్తాడు,యెరూషలేములో నుండి పెద్ద స్వరంతో మాట్లాడతాడు.
ఆకాశం, భూమి దద్దరిల్లుతాయి;కానీ యెహోవా తన ప్రజలకు ఆశ్రయంగా ఉంటాడు,+ఇశ్రాయేలు ప్రజలకు కోటగా ఉంటాడు.
17 నేను నా పవిత్ర పర్వతమైన సీయోనులో నివసిస్తున్న మీ దేవుడైన యెహోవానని అప్పుడు మీరు తెలుసుకుంటారు.
యెరూషలేము పవిత్ర స్థలమౌతుంది,+అపరిచితులు* ఇంకెప్పుడూ దాని గుండా వెళ్లరు.+
18 ఆ రోజు పర్వతాల మీద నుండి తియ్యని ద్రాక్షారసం కారుతుంది,+కొండల నుండి పాలు ప్రవహిస్తాయి,యూదా వాగులన్నిట్లో నీళ్లు పారతాయి.
యెహోవా మందిరం నుండి ఒక ఊట ఉబికి పారుతుంది,+అది తుమ్మచెట్ల లోయకు* నీళ్లిస్తుంది.
19 అయితే ఐగుప్తు* నిర్మానుష్యమౌతుంది,ఎదోము నిర్జనమైన ఎడారిగా మారుతుంది,+ఎందుకంటే వాళ్లు యూదా ప్రజలపై దౌర్జన్యం చేశారు,ఆ దేశంలో అమాయకుల రక్తం చిందించారు.+
20 యూదాలో మాత్రం ఎప్పటికీ నివాసులు ఉంటారు,యెరూషలేములో తరతరాలపాటు ప్రజలు నివసిస్తారు.+
21 వాళ్ల మీద అంతకుముందు ఉన్న రక్తాపరాధాన్ని నేను తీసేస్తాను;+సీయోనులో యెహోవా నివసిస్తాడు.”+
అధస్సూచీలు
^ “యెహోవా న్యాయమూర్తి” అని అర్థం.
^ అంటే, మొక్కల్ని కత్తిరించే కత్తెరలు.
^ లేదా “బల్లెములుగా.”
^ లేదా “నీ యోధుల్ని.”
^ లేదా “పరదేశులు.”
^ లేదా “వాగుకు.”
^ లేదా “ఈజిప్టు.”