యోహాను సువార్త 17:1-26

  • అపొస్తలులతో యేసు చివరి ప్రార్థన (1-26)

    • దేవుణ్ణి తెలుసుకోవడం శాశ్వత జీవితం (3)

    • క్రైస్తవులు లోకసంబంధులు కారు (14-16)

    • “నీ వాక్యమే సత్యం” (17)

    • ‘నీ పేరును నేను తెలియజేశాను’ (26)

17  యేసు ఈ మాటలు చెప్పాక, ఆకాశం వైపు చూసి ఇలా అన్నాడు: “తండ్రీ, సమయం వచ్చేసింది. నీ కుమారుడు నిన్ను మహిమపర్చేలా నీ కుమారుణ్ణి మహిమపర్చు.  ఎందుకంటే, నువ్వు మనుషులందరి మీద ఆయనకు అధికారం ఇచ్చావు.+ దానివల్ల, నువ్వు తనకు అప్పగించిన వాళ్లందరికీ ఆయన శాశ్వత జీవితాన్ని ఇవ్వగలుగుతాడు.+  ఒకేఒక్క సత్యదేవుడివైన నిన్నూ,+ నువ్వు పంపించిన యేసుక్రీస్తునూ+ తెలుసుకోవడమే శాశ్వత జీవితం.  చేయడానికి నువ్వు నాకు ఇచ్చిన పనిని పూర్తిచేసి+ భూమ్మీద నిన్ను మహిమపర్చాను.+  కాబట్టి తండ్రీ, లోకం ఉనికిలోకి రాకముందు నీ దగ్గర నాకు ఎలాంటి మహిమ ఉండేదో అదే మహిమతో ఇప్పుడు నన్ను నీ దగ్గర మహిమపర్చు.+  “లోకంలో నుండి నువ్వు నాకు ఇచ్చిన మనుషులకు నీ పేరు వెల్లడిచేశాను.*+ వాళ్లు నీవాళ్లు, వాళ్లను నువ్వు నాకు ఇచ్చావు; వాళ్లు నీ వాక్యాన్ని పాటించారు.  నువ్వు నాకు ఇచ్చినవన్నీ నీ నుండే వచ్చాయని వాళ్లిప్పుడు తెలుసుకున్నారు;  ఎందుకంటే నువ్వు నాకు చెప్పిన మాటల్ని నేను వాళ్లకు చెప్పినప్పుడు+ వాళ్లు వాటిని అంగీకరించి, నేను నీ ప్రతినిధిగా వచ్చానని నిజంగా తెలుసుకున్నారు. అంతేకాదు, నువ్వు నన్ను పంపావని వాళ్లు నమ్ముతున్నారు.  నేను వాళ్ల గురించి ప్రార్థిస్తున్నాను. నేను లోకం గురించి ప్రార్థించట్లేదు కానీ నువ్వు నాకు ఇచ్చినవాళ్ల గురించే ప్రార్థిస్తున్నాను, ఎందుకంటే వాళ్లు నీ వాళ్లు; 10  నావన్నీ నీవి, నీవన్నీ నావి. నేను వాళ్ల మధ్య మహిమపర్చబడ్డాను. 11  “నేను ఇక లోకంలో ఉండను, కానీ వాళ్లు లోకంలో ఉన్నారు.+ నేను నీ దగ్గరికి వస్తున్నాను. పవిత్రుడివైన తండ్రీ, నువ్వు నాకు ఇచ్చిన నీ సొంత పేరును బట్టి వాళ్లను కాపాడు.+ అప్పుడు, మనం ఐక్యంగా ఉన్నట్టే వాళ్లు కూడా ఐక్యంగా ఉంటారు. 12  నేను వాళ్లతో ఉన్నప్పుడు, నువ్వు నాకు ఇచ్చిన నీ సొంత పేరును బట్టి వాళ్లను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చాను.+ నేను వాళ్లను కాపాడాను. లేఖనం నెరవేరేలా,+ నాశనపుత్రుడు తప్ప+ వాళ్లలో ఏ ఒక్కరూ నాశనం కాలేదు.+ 13  కానీ ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నాను. నా సంతోషాన్ని వాళ్లు పూర్తిగా అనుభవించేలా, నేను ఇంకా లోకంలో ఉన్నప్పుడే ఈ విషయాలు మాట్లాడుతున్నాను. 14  నేను వాళ్లకు నీ వాక్యాన్ని ఇచ్చాను, అయితే లోకం వాళ్లను ద్వేషించింది; ఎందుకంటే నేను లోకసంబంధిని* కానట్టే వాళ్లు కూడా లోకసంబంధులు కారు.+ 15  “వాళ్లను లోకంలో నుండి తీసుకెళ్లిపొమ్మని నేను ప్రార్థించట్లేదు కానీ, దుష్టుని నుండి వాళ్లను కాపాడమని నీకు ప్రార్థిస్తున్నాను.+ 16  నేను లోకసంబంధిని కానట్టే+ వాళ్లు కూడా లోకసంబంధులు కారు.+ 17  సత్యంతో వాళ్లను పవిత్రపర్చు,*+ నీ వాక్యమే సత్యం.+ 18  నువ్వు నన్ను లోకంలోకి పంపించినట్టే, నేను కూడా వాళ్లను లోకంలోకి పంపించాను. 19  వాళ్లు సత్యం వల్ల పవిత్రులు అవ్వాలని వాళ్ల కోసం నన్ను నేను పవిత్రంగా ఉంచుకుంటున్నాను. 20  “నేను వాళ్ల కోసం మాత్రమే ప్రార్థించట్లేదు గానీ, వాళ్ల బోధ విని నా మీద విశ్వాసం ఉంచే వాళ్లందరి కోసం కూడా ప్రార్థిస్తున్నాను. 21  వాళ్లందరూ ఐక్యంగా ఉండాలని;+ తండ్రీ, నువ్వు నాతో ఐక్యంగా ఉన్నట్టు,+ నేను నీతో ఐక్యంగా ఉన్నట్టు వాళ్లు కూడా మనతో ఐక్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. అప్పుడు, నువ్వు నన్ను పంపించావని లోకం నమ్ముతుంది. 22  మనం ఐక్యంగా ఉన్నట్టు వాళ్లు కూడా ఐక్యంగా ఉండేలా,+ నువ్వు నాకు ఇచ్చిన మహిమను నేను వాళ్లకు ఇచ్చాను. 23  వాళ్లు సంపూర్ణంగా ఐక్యంగా ఉండేలా నేను వాళ్లతో ఐక్యంగా ఉన్నాను, నువ్వు నాతో ఐక్యంగా ఉన్నావు. అలా, నువ్వు నన్ను పంపించావనీ నన్ను ప్రేమించినట్టే వాళ్లను కూడా ప్రేమించావనీ లోకానికి తెలుస్తుంది. 24  తండ్రీ, నువ్వు నాకు ఇచ్చిన వీళ్లు, నేను ఉండే చోట నాతోపాటు ఉండాలని కోరుకుంటున్నాను.+ అప్పుడు, నువ్వు నాకు ఇచ్చిన మహిమను వీళ్లు చూడగలుగుతారు. ఎందుకంటే ప్రపంచం పుట్టకముందే* నువ్వు నన్ను ప్రేమించావు. 25  నీతిమంతుడివైన తండ్రీ, నిజానికి లోకం నిన్ను తెలుసుకోకపోయినా,+ నాకు నువ్వు తెలుసు,+ నువ్వు నన్ను పంపించావని వీళ్లు తెలుసుకున్నారు. 26  నువ్వు నామీద చూపించిన ప్రేమను వీళ్లు ఇతరుల మీద చూపించేలా, నేను వీళ్లతో ఐక్యంగా ఉండేలా+ నీ పేరును వీళ్లకు తెలియజేశాను, ఇంకా తెలియజేస్తాను.”+

అధస్సూచీలు

లేదా “తెలియజేశాను.”
లేదా “లోకానికి చెందినవాణ్ణి.”
లేదా “ప్రత్యేకపర్చు.”
అక్ష., “(విత్తనం) పడకముందే,” అంటే ఆదాముహవ్వలకు పిల్లలు పుట్టకముందే.