రూతు 3:1-18

  • నయోమి రూతుకు నిర్దేశాలివ్వడం (1-4)

  • కళ్లం దగ్గర రూతు, బోయజు (5-15)

  • రూతు నయోమి దగ్గరికి తిరిగెళ్లడం (16-18)

3  అప్పుడామె అత్త నయోమి ఆమెతో ఇలా అంది: “అమ్మా,* నువ్వొక ఇంటిదానివి అయ్యేలా* నీ కోసం భర్తను* వెతకాల్సిన బాధ్యత నాకు లేదా?+  ఇదిగో, బోయజు మన బంధువు.+ నువ్వు పనిచేసింది అతని పనమ్మాయిలతోనే. ఈ రాత్రి అతను కళ్లం* దగ్గర బార్లీ గింజల్ని తూర్పారబట్టిస్తున్నాడు.  కాబట్టి స్నానం చేసి, కాస్త పరిమళ తైలం పూసుకో; మంచి బట్టలు వేసుకుని కళ్లం దగ్గరికి వెళ్లు. అతను తిని, తాగే వరకు నువ్వు అక్కడున్న సంగతి అతనికి తెలియనివ్వకు.  అతను పడుకునేటప్పుడు, అతను ఎక్కడ పడుకుంటున్నాడో గమనించు; తర్వాత వెళ్లి అతని పాదాల మీదున్న దుప్పటి తీసి, అక్కడే పడుకో. అప్పుడు, నువ్వేం చేయాలో అతను నీకు చెప్తాడు.”  అందుకామె, “నువ్వు చెప్పిందంతా చేస్తాను” అంది.  కాబట్టి ఆమె కళ్లం దగ్గరికి వెళ్లి, తన అత్త చెప్పిందంతా చేసింది.  బోయజు తిని, తాగి సంతోషంగా ఉన్నాడు. తర్వాత అతను ధాన్యం కుప్ప పక్కన పడుకోవడానికి వెళ్లాడు. అప్పుడామె నిశ్శబ్దంగా వచ్చి, అతని పాదాల మీదున్న దుప్పటి తీసి పడుకుంది.  అర్ధరాత్రి సమయంలో అతను చలికి వణికిపోతూ ముందుకు వంగాడు, అప్పుడు తన పాదాల దగ్గర ఒక అమ్మాయి పడుకొని ఉండడం చూసి,  “ఎవరు నువ్వు?” అని అడిగాడు. అందుకామె, “నేను రూతును, నీ సేవకురాలిని. నీ వస్త్రాన్ని నీ సేవకురాలి మీద కప్పు, ఎందుకంటే నువ్వు మమ్మల్ని తిరిగి కొనగల వ్యక్తివి”+ అని అంది. 10  అప్పుడతను ఇలా అన్నాడు: “అమ్మా,* యెహోవా నిన్ను దీవించాలి. నువ్వు ముందుకన్నా+ ఈ సందర్భంలో ఎక్కువ విశ్వసనీయ ప్రేమను చూపించావు. ఎందుకంటే, పేదవాళ్లేగానీ ధనికులేగానీ యువకుల దగ్గరికి నువ్వు వెళ్లలేదు. 11  అమ్మా,* భయపడకు. నువ్వు అడిగిందంతా చేస్తాను,+ నువ్వు చాలా మంచిదానివని ఈ నగరంలో ఉన్న ప్రతీ ఒక్కరికి తెలుసు. 12  నేను మిమ్మల్ని తిరిగి కొనగల వ్యక్తిననే+ మాట నిజమే, కానీ మిమ్మల్ని తిరిగి కొనగల వ్యక్తి ఇంకొకతను ఉన్నాడు, అతను నాకన్నా దగ్గరి బంధువు.+ 13  ఈ రాత్రి ఇక్కడే ఉండు, ఒకవేళ రేపు పొద్దున అతను మిమ్మల్ని తిరిగి కొంటే మంచిది, అతన్నే కొననీ.+ కానీ ఒకవేళ అతనికి మిమ్మల్ని తిరిగి కొనడం ఇష్టం లేకపోతే, యెహోవా జీవం తోడు నేనే మిమ్మల్ని తిరిగి కొంటాను. తెల్లారేవరకు ఇక్కడే పడుకో.” 14  కాబట్టి ఆమె తెల్లారేవరకు అతని పాదాల దగ్గరే పడుకుని, ఒకరినొకరు గుర్తుపట్టేంత వెలుతురు రాకముందే నిద్రలేచింది. అప్పుడతను ఆమెతో, “ఒక స్త్రీ కళ్లం దగ్గరికి వచ్చిందనే విషయం ఎవరికీ తెలియనివ్వకు” అన్నాడు. 15  అంతేకాదు, “నువ్వు వేసుకున్న పైవస్త్రం తీసుకొచ్చి, దాన్ని తెరిచి పట్టుకో” అన్నాడు. ఆమె దాన్ని తెరిచి పట్టుకుంది, అప్పుడతను ఆరు కొలతల* బార్లీ గింజలు అందులో పోసి, ఆమె మీద పెట్టాడు. తర్వాత అతను నగరంలోకి వెళ్లాడు. 16  ఆమె తన అత్త దగ్గరికి వెళ్లిపోయింది. అప్పుడు నయోమి ఆమెను, “అమ్మా,* వెళ్లిన పని ఏమైంది?”* అని అడిగింది. అప్పుడామె బోయజు తనకు చేసిందంతా నయోమికి చెప్పింది. 17  ఆమె ఇంకా ఇలా అంది: “అతను నాకు ఈ ఆరు కొలతల బార్లీ గింజలు ఇచ్చి, ‘మీ అత్త దగ్గరికి వట్టి చేతులతో వెళ్లకు’ అన్నాడు.” 18  అప్పుడు నయోమి ఆమెతో, “అమ్మా,* ఏమి జరుగుతుందో నీకు తెలిసే వరకు ఇక్కడ కూర్చో, ఎందుకంటే ఇవాళ ఈ విషయాన్ని తేల్చే వరకు అతను విశ్రాంతి తీసుకోడు” అంది.

అధస్సూచీలు

అక్ష., “నా కూతురా.”
లేదా “సురక్షితంగా ఉండేలా.”
అక్ష., “విశ్రాంతి స్థలాన్ని.”
పదకోశం చూడండి.
అక్ష., “నా కూతురా.”
అక్ష., “నా కూతురా.”
బహుశా సీయ కొలతలు కావచ్చు. దాదాపు 44 లీటర్లు (26 కిలోలు). అనుబంధం B14 చూడండి.
అక్ష., “నా కూతురా.”
అక్ష., “నువ్వు ఎవరు?”
అక్ష., “నా కూతురా.”