రూతు 4:1-22

  • బోయజు తిరిగి కొనే వ్యక్తిగా వ్యవహరించడం (1-12)

  • బోయజు, రూతులకు ఓబేదు పుట్టడం (13-17)

  • దావీదు వంశావళి (18-22)

4  బోయజు నగర ద్వారం+ దగ్గరికి వెళ్లి అక్కడ కూర్చున్నాడు. ఇదిగో! బోయజు చెప్పిన దగ్గరి బంధువు*+ అటుగా వెళ్తున్నాడు. అప్పుడు బోయజు అతనితో, “ఓయీ, ఇలా వచ్చి కూర్చో” అన్నాడు. అతను వచ్చి కూర్చున్నాడు.  తర్వాత బోయజు నగరంలోని పదిమంది పెద్దల్ని+ పిలిపించి వాళ్లతో, “ఇక్కడ కూర్చోండి” అన్నాడు. వాళ్లు కూర్చున్నారు.  అప్పుడు బోయజు ఆ దగ్గరి బంధువుతో*+ ఇలా అన్నాడు: “మోయాబు ప్రాంతం నుండి తిరిగొచ్చిన నయోమి,+ మన సహోదరుడు ఎలీమెలెకుకు+ చెందిన భూమిని అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది.  కాబట్టి నేను ఆ విషయం నీకు చెప్పాలనుకున్నాను. ఈ నగరవాసుల ముందు, నా ప్రజల పెద్దల ముందు+ దాన్ని కొను. నువ్వు దాన్ని కొంటే కొను, ఒకవేళ నువ్వు కొనకపోతే ఆ సంగతి నాతో చెప్పు. ఎందుకంటే, నీ తర్వాత దాన్ని కొనే హక్కు ఉన్నది నాకే.” అప్పుడతను, “దాన్ని కొనడం నాకు ఇష్టమే” అన్నాడు.+  తర్వాత బోయజు అతనితో, “నువ్వు నయోమి నుండి ఆ భూమిని కొన్న రోజున, భర్త చనిపోయిన మోయాబీయురాలైన రూతు నుండి కూడా దాన్ని కొనాలి. అలా నువ్వు చనిపోయిన వ్యక్తి పేరును నిలిపి అతని వారసత్వపు ఆస్తిని కాపాడాలి” అన్నాడు.+  అప్పుడు ఆ దగ్గరి బంధువు* ఇలా అన్నాడు: “నేను దాన్ని కొనలేను. ఎందుకంటే, నేను నా సొంత వారసత్వపు ఆస్తిని పాడుచేసుకుంటానేమో. నా హక్కును తీసుకొని నువ్వే దాన్ని కొను, నేను దాన్ని కొనలేను.”  తిరిగి కొనే హక్కుకు, దాన్ని బదిలీ చేయడానికి సంబంధించిన ప్రతీ వ్యవహారాన్ని చెల్లుబాటు చేసేందుకు పూర్వం ఇశ్రాయేలులో ఉన్న సంప్రదాయం ఏంటంటే, ఒక వ్యక్తి తన చెప్పు తీసి+ అవతలి వ్యక్తికి ఇవ్వాలి. ఇశ్రాయేలులో ఒక ఒప్పందాన్ని ఖరారు చేయడానికి* ఈ పద్ధతి పాటించేవాళ్లు.  కాబట్టి ఆ దగ్గరి బంధువు* బోయజుతో, “దాన్ని నువ్వే కొను” అని చెప్పి, తన చెప్పు తీసిచ్చాడు.  తర్వాత బోయజు అక్కడున్న పెద్దలతో, ప్రజలందరితో ఇలా అన్నాడు: “ఈ రోజు ఎలీమెలెకుకు, కిల్యోనుకు, మహ్లోనుకు చెందినదంతా నేను నయోమి నుండి కొంటున్నాను అనడానికి మీరే సాక్షులు.+ 10  అంతేకాదు మహ్లోను భార్యను అంటే మోయాబీయురాలైన రూతును భార్యగా చేసుకుంటున్నాను. అలా, చనిపోయిన వ్యక్తి పేరును నిలిపి అతని వారసత్వాన్ని కాపాడతాను.+ దానివల్ల, చనిపోయిన వ్యక్తి పేరు అతని సహోదరుల మధ్య నుండి, అతని ఊరివాళ్ల మధ్య* నుండి చెరిగిపోకుండా ఉంటుంది. ఈ రోజు మీరే దీనికి సాక్షులు.”+ 11  అప్పుడు నగర ద్వారం దగ్గర ఉన్న ప్రజలందరు, పెద్దలు ఇలా అన్నారు: “మేము సాక్షులం! నీ ఇంట్లోకి అడుగుపెడుతున్న భార్యను యెహోవా దీవించాలి. ఆమె ఇశ్రాయేలీయులకు తల్లులైన రాహేలు, లేయాల్లా అవ్వాలి.+ నువ్వు ఎఫ్రాతాలో+ వర్ధిల్లాలి, బేత్లెహేములో+ నీకు మంచిపేరు రావాలి. 12  ఈ యువతి ద్వారా యెహోవా నీకు ఇచ్చే సంతానం+ వల్ల నీ ఇల్లు యూదా, తామారుల కుమారుడైన పెరెసు+ ఇంటిలా అవ్వాలి.” 13  బోయజు రూతును పెళ్లి చేసుకుని, ఆమెతో కలిశాడు. యెహోవా ఆమెను దీవించడం వల్ల ఆమె గర్భం దాల్చి కుమారుణ్ణి కన్నది. 14  అప్పుడు స్త్రీలు నయోమితో ఇలా అన్నారు: “నేడు మీకు ఒక దగ్గరి బంధువు* ఉండేలా చూసిన యెహోవా స్తుతించబడాలి! ఆయన పేరు ఇశ్రాయేలులో చాటించబడాలి. 15  ఇతను* నీ ప్రాణానికి ఊరటనిచ్చాడు, వృద్ధాప్యంలో నిన్ను చూసుకుంటాడు. ఎందుకంటే నిన్ను ప్రేమించే నీ కోడలికి, నీకు ఏడుగురు కుమారులకన్నా ఎక్కువైన నీ కోడలికి ఇతను పుట్టాడు.” 16  నయోమి ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకుని హత్తుకుంది, ఆ బిడ్డ ఆలనాపాలనా చూసుకుంది.* 17  అప్పుడు ఇరుగుపొరుగున ఉన్న స్త్రీలు ఆ బాబుకు పేరు పెట్టారు. వాళ్లు, “నయోమికి ఒక కుమారుడు పుట్టాడు” అంటూ, ఆ బాబుకు ఓబేదు+ అని పేరు పెట్టారు. అతను దావీదు తండ్రైన యెష్షయికి+ తండ్రి. 18  పెరెసు వంశావళి+ ఇది: పెరెసు ఎస్రోనును+ కన్నాడు, 19  ఎస్రోను రామును కన్నాడు, రాము అమ్మీనాదాబును కన్నాడు,+ 20  అమ్మీనాదాబు+ నయస్సోనును కన్నాడు, నయస్సోను శల్మానును కన్నాడు, 21  శల్మాను బోయజును కన్నాడు, బోయజు ఓబేదును కన్నాడు, 22  ఓబేదు యెష్షయిని+ కన్నాడు, యెష్షయి దావీదును+ కన్నాడు.

అధస్సూచీలు

లేదా “తిరిగి కొనగల వ్యక్తి.”
లేదా “తిరిగి కొనగల వ్యక్తితో.”
లేదా “తిరిగి కొనగల వ్యక్తి.”
లేదా “ధృవీకరించడానికి.”
లేదా “తిరిగి కొనగల వ్యక్తి.”
అక్ష., “సొంత నగర ద్వారం.”
లేదా “తిరిగి కొనగల వ్యక్తి.”
అంటే, నయోమి మనవడు.
లేదా “అతనికి దాది అయింది.”