రోమీయులు 13:1-14
13 ప్రతీ ఒక్కరు పై అధికారాలకు లోబడివుండాలి,+ ఎందుకంటే అధికారాలన్నీ దేవుని అనుమతితోనే ఉనికిలో ఉన్నాయి;+ ఇప్పుడున్న అధికారాల్ని దేవుడే వాటివాటి స్థానాల్లో ఉంచాడు.+
2 కాబట్టి, అధికారాన్ని ఎదిరించే వ్యక్తి దేవుని ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాడు; ఆ ఏర్పాటును వ్యతిరేకించేవాళ్లు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుంటారు.
3 మంచిపనులు చేసేవాళ్లు కాదుగానీ చెడ్డపనులు చేసేవాళ్లే ఆ పరిపాలకులకు భయపడతారు.+ మీరు అధికారుల పట్ల భయంతో జీవించకూడదని అనుకుంటున్నారా? అలాగైతే మంచిపనులు చేస్తూ ఉండండి,+ అప్పుడు వాళ్లు మిమ్మల్ని మెచ్చుకుంటారు;
4 ఎందుకంటే వాళ్లు మీ మంచి కోసమే దేవుని సేవకులుగా పనిచేస్తున్నారు. కానీ ఒకవేళ మీరు చెడ్డపనులు చేస్తుంటే మాత్రం భయపడండి. ఎందుకంటే వాళ్ల చేతుల్లో ఖడ్గం* ఉన్నది ఊరికే కాదు. వాళ్లు, చెడ్డపనులు చేస్తూ ఉండేవాళ్ల మీద ఆగ్రహం చూపించే* దేవుని సేవకులు.
5 కాబట్టి మీరు లోబడివుండడానికి బలమైన కారణమే ఉంది. కేవలం ఆగ్రహాన్ని* బట్టి మాత్రమే కాదుగానీ మీ మనస్సాక్షిని బట్టి కూడా మీరు లోబడివుండాలి.+
6 అందుకే కదా మీరు పన్నులు కూడా కడుతున్నారు; ఎందుకంటే వాళ్లు ఎప్పుడూ ప్రజలకు సేవ చేసే దేవుని సేవకులు.
7 కాబట్టి ప్రతీ ఒక్కరికి ఏమి ఇవ్వాలో అది ఇచ్చేయండి: ఎవరికి పన్ను కట్టాలో వాళ్లకు పన్ను కట్టండి,+ ఎవరికి కప్పం చెల్లించాలో వాళ్లకు కప్పం చెల్లించండి, ఎవరికి భయపడాలో వాళ్లకు భయపడండి,+ ఎవర్ని ఘనపర్చాలో వాళ్లను ఘనపర్చండి.+
8 ఒకరినొకరు ప్రేమించుకునే విషయంలో తప్ప ఎవ్వరికీ ఏమీ రుణపడి ఉండకండి;+ సాటిమనిషిని ప్రేమించే వ్యక్తి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టే.+
9 ఎందుకంటే, “వ్యభిచారం చేయకూడదు,+ హత్య చేయకూడదు,+ దొంగతనం చేయకూడదు,+ ఇతరులకు చెందినవాటిని ఆశించకూడదు”+ అనే ఆజ్ఞలతో సహా ధర్మశాస్త్రంలో ఉన్న ఏ ఆజ్ఞ అయినా, “నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు నీ సాటిమనిషిని* ప్రేమించాలి”+ అనే ఒక్క ఆజ్ఞలో నిక్షిప్తమై ఉంది.
10 ప్రేమ సాటిమనిషికి హాని తలపెట్టదు;+ కాబట్టి ప్రేమ చూపిస్తే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్టే.+
11 మీరు వీటిని పాటించాలి, ఎందుకంటే మనం ఏ కాలంలో జీవిస్తున్నామో మీకు తెలుసు, మీరు నిద్ర మేల్కోవాల్సిన సమయం వచ్చేసింది.+ మనం విశ్వాసులమైనప్పటి కంటే ఇప్పుడు మన రక్షణ మరింత దగ్గరగా ఉంది.
12 రాత్రి చాలావరకు గడిచిపోయింది; పగలు దగ్గరపడింది. కాబట్టి చీకటి పనుల్ని వదిలేసి వెలుగు ఆయుధాల్ని ధరించుకుందాం.+
13 పగటిపూట నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాం.+ విచ్చలవిడి విందులు,* తాగుబోతుతనం, అక్రమ సంబంధాలు, లెక్కలేనితనం,*+ గొడవలు, అసూయ అనేవాటికి దూరంగా ఉందాం.
14 అయితే ప్రభువైన యేసుక్రీస్తును అనుకరించండి,*+ శరీర కోరికలు తీర్చుకోవడం మీద మనసుపెట్టకండి.
అధస్సూచీలు
^ లేదా “శిక్షించే అధికారం.”
^ లేదా “శిక్షించే.”
^ లేదా “శిక్షను.”
^ లేదా “పొరుగువాణ్ణి.”
^ లేదా “అల్లరి విందులు.”
^ అక్ష., “ధరించండి.”