రోమీయులు 3:1-31
3 అలాగైతే యూదునిగా ఉండడం వల్ల లాభం ఏమిటి? సున్నతి చేయించుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి?
2 ఏ రకంగా చూసినా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే, దేవుని పవిత్ర సందేశాలు వాళ్లకు ఇవ్వబడ్డాయి.+
3 మరైతే కొందరు యూదులకు విశ్వాసం లేనంత మాత్రాన, ప్రజలు ఇక దేవుని మీద నమ్మకం పెట్టుకోలేరని దానర్థమా?
4 కానేకాదు! ప్రతీ మనిషి అబద్ధాలకోరు అని రుజువైనా,+ దేవుడు మాత్రం సత్యవంతుడిగానే ఉంటాడు.+ ఎందుకంటే లేఖనాల్లో ఇలా రాసివుంది: “నీ మాటలు నువ్వు నీతిమంతుడివని చూపిస్తాయి, విచారణలో నువ్వే గెలుస్తావు.”+
5 మన అవినీతి దేవుని నీతిని గొప్పచేస్తుందని అంటుంటారు, కానీ అది ఈ ప్రశ్నను లేవదీస్తుంది: దేవుడు తన ఆగ్రహం వ్యక్తం చేసినప్పుడు అన్యాయస్థుడౌతాడా? (కొందరి ఆలోచన అది.)
6 అది అసంభవం! ఒకవేళ ఆయన అన్యాయస్థుడైతే, లోకానికి ఎలా తీర్పుతీరుస్తాడు?+
7 నా అబద్ధం వల్ల దేవుని సత్యం ఇంకా కొట్టొచ్చినట్టు కనిపించి ఆయనకు మహిమ వస్తే, నేను పాపిగా ఎందుకు తీర్పు తీర్చబడుతున్నాను?
8 మేము, “మంచి జరగడానికి చెడ్డపనులు చేద్దాం పదండి” అని అంటున్నామని కొందరు అబద్ధారోపణ చేస్తున్నారు. మేము నిజంగానే అలా అనొచ్చు కదా, మరి ఎందుకు అనట్లేదు? అలాంటివాళ్ల మీదికి వచ్చే తీర్పు న్యాయానికి అనుగుణంగా ఉంటుంది.+
9 మరైతే మన ఆలోచన ఏమిటి? యూదులమైన మనం ఇతరుల కంటే మెరుగైన స్థానంలో ఉన్నామా? లేనేలేము! ఎందుకంటే యూదులు, గ్రీకువాళ్లు అందరూ పాపం కింద ఉన్నారని మేము ఇంతకుముందే స్పష్టం చేశాం;+
10 లేఖనాల్లో ఇలా రాసివుంది: “నీతిమంతుడు అనేవాడే లేడు, కనీసం ఒక్కడు కూడా లేడు;+
11 కాస్తయినా అవగాహన* ఉన్నవాడు ఒక్కడూ లేడు; దేవుని కోసం వెతికేవాడు ఒక్కడూ లేడు.
12 అందరూ దారితప్పారు, అందరూ పనికిమాలినవాళ్లు అయ్యారు; దయ చూపించేవాడే లేడు, కనీసం ఒక్కడు కూడా లేడు.”+
13 “వాళ్ల గొంతు తెరిచివున్న సమాధి; వాళ్లు తమ నాలుకలతో మోసం చేశారు.”+ “వాళ్ల పెదాల వెనక పాము విషం ఉంది.”+
14 “వాళ్ల నోటి నిండా శాపనార్థాలే, కఠినమైన మాటలే.”+
15 “వాళ్ల పాదాలు రక్తం చిందించడానికి వేగంగా పరుగెత్తుతాయి.”+
16 “వాళ్ల దారుల్లో నాశనం, దుఃఖం ఉన్నాయి;
17 శాంతి మార్గం వాళ్లకు తెలీదు.”+
18 “వాళ్లకు దేవుడంటే భయమే లేదు.”+
19 ధర్మశాస్త్రం చెప్పే విషయాలన్నీ దాని కింద ఉన్నవాళ్లను ఉద్దేశించి చెప్పేవేనని మనకు తెలుసు. దానివల్ల ప్రతీ ఒక్కరి నోరు మూతపడుతుంది, లోకమంతా దేవుని ముందు దోషి అవుతుంది.+
20 కాబట్టి ధర్మశాస్త్రాన్ని పాటించడం వల్ల ఏ ఒక్కరూ దేవుని ఎదుట నీతిమంతులని తీర్పు పొందరు.+ ఎందుకంటే ధర్మశాస్త్రం వల్ల, పాపం అంటే ఏమిటో స్పష్టంగా తెలుస్తుంది.+
21 అయితే ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని పాటించకుండానే దేవుని దృష్టిలో నీతియుక్తమైన స్థానం పొందవచ్చనే విషయం వెల్లడిచేయబడింది.*+ ఇదే విషయం ధర్మశాస్త్రంలో, అలాగే ప్రవక్తల పుస్తకాల్లో కూడా రాసివుంది.+
22 అవును, విశ్వాసంగల వాళ్లందరూ యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని దృష్టిలో నీతియుక్తమైన స్థానం పొందవచ్చు. దేవుని దృష్టిలో అందరూ ఒక్కటే.
23 అందరూ పాపం చేశారు, దేవుని మహిమను ప్రతిబింబించలేకపోతున్నారు.+
24 క్రీస్తుయేసు చెల్లించిన విమోచన క్రయధనం*+ వల్ల కలిగిన విడుదల ద్వారా వాళ్లు నీతిమంతులుగా తీర్పు తీర్చబడుతున్నారు. ఇది, దేవుడు తన అపారదయతో ఇచ్చిన ఉచిత బహుమతి.+
25 క్రీస్తుయేసు రక్తం మీద విశ్వాసం ఉంచడం ద్వారా+ మనుషులు తనతో తిరిగి శాంతియుత సంబంధం నెలకొల్పుకునేలా+ దేవుడు ఆయన్ని ఒక బలిగా* ఏర్పాటు చేశాడు. దేవుడు తన నీతిని కనబర్చడానికి అలా చేశాడు, ఎందుకంటే గతంలో ప్రజలు చేసిన పాపాల్ని దేవుడు సహనంతో క్షమిస్తూ వచ్చాడు.
26 ప్రస్తుత కాలంలో, అంటే యేసు మీద విశ్వాసం+ ఉంచే వ్యక్తిని నీతిమంతునిగా తీర్పు తీర్చేటప్పుడు కూడా తన నీతిని కనబర్చాలని+ ఆయన అలా చేశాడు.
27 కాబట్టి, ఎవరైనా గొప్పలు చెప్పుకోగలరా? లేదు, దానికి అవకాశమే లేదు. ఏ నియమం వల్ల? ఒక వ్యక్తి చేసే పనులు ప్రాముఖ్యమని చెప్పే నియమం వల్లా?+ కాదు, అతనికి విశ్వాసం ఉండాలని చెప్పే నియమం వల్లే.
28 ఎందుకంటే, ధర్మశాస్త్రం చెప్తున్న పనులు చేయడం వల్ల కాదుగానీ విశ్వాసం వల్లే ఒక వ్యక్తి నీతిమంతునిగా తీర్పు తీర్చబడతాడనే ముగింపుకు మనం వచ్చాం.+
29 ఆయన యూదులకు మాత్రమే దేవుడా?+ అన్యజనులకు దేవుడు కాడా?+ అవును, ఆయన అన్యజనులకు కూడా దేవుడే.+
30 దేవుడు ఒక్కడే+ కాబట్టి, సున్నతి చేయించుకున్నవాళ్లను విశ్వాసం ఆధారంగా, సున్నతి చేయించుకోనివాళ్లను వాళ్ల విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్పు తీరుస్తాడు.+
31 అలాగైతే, మన విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రాన్ని రద్దు చేస్తున్నామా? లేనేలేదు! బదులుగా, దాన్ని స్థిరపరుస్తున్నాం.+
అధస్సూచీలు
^ లేదా “లోతైన అవగాహన.”
^ లేదా “ధర్మశాస్త్రం లేకుండానే దేవుని నీతి వెల్లడిచేయబడింది.”
^ లేదా “ప్రాయశ్చిత్త బలిగా.”