రోమీయులు 8:1-39

  • పవిత్రశక్తి ద్వారా జీవం, విడుదల (1-11)

  • దేని ద్వారా దత్తత తీసుకోబడతామో ఆ పవిత్రశక్తే సాక్ష్యమిస్తుంది (12-17)

  • దేవుని పిల్లలు ఆస్వాదించే స్వాతంత్ర్యం కోసం సృష్టి ఎదురుచూస్తోంది (18-25)

  • ‘పవిత్రశక్తి మన తరఫున వేడుకుంటుంది’ (26, 27)

  • దేవుడు ముందే నిర్ణయించడం (28-30)

  • దేవుని ప్రేమ ద్వారా విజయం ​సాధించడం (31-39)

8  కాబట్టి, క్రీస్తుయేసుతో ఐక్యంగా ఉన్నవాళ్లు దోషులుగా తీర్పుతీర్చబడరు.  క్రీస్తుయేసు ద్వారా జీవాన్నిచ్చే పవిత్రశక్తి నియమం పాపమరణాల నియమం నుండి మిమ్మల్ని విడుదల చేసింది.+  మనుషుల అపరిపూర్ణత వల్ల ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించడం కుదరలేదు, కాబట్టి అది మనుషుల్ని పూర్తిగా కాపాడలేకపోయింది.+ అయితే ధర్మశాస్త్రం చేయలేనిదాన్ని దేవుడు చేశాడు. ఎలాగంటే, పాపాన్ని తీసేయడానికి ఆయన తన సొంత కుమారుణ్ణి పాపులైన మనుషుల రూపంలో+ పంపించాడు,+ అలా శరీరంలో ఉన్న పాపానికి శిక్ష విధించాడు.  శరీర ప్రకారం కాకుండా పవిత్రశక్తికి అనుగుణంగా నడుచుకోవడం+ ద్వారా మనం ధర్మశాస్త్రం కోరే నీతియుక్తమైన వాటిని నెరవేర్చాలని+ దేవుడు అలా చేశాడు.  శరీర కోరికల ప్రకారం నడుచుకునేవాళ్లు శరీర సంబంధమైన విషయాల మీద మనసుపెడతారు,+ కానీ పవిత్రశక్తికి అనుగుణంగా నడుచుకునేవాళ్లు పవిత్రశక్తికి సంబంధించిన విషయాల మీద మనసుపెడతారు.+  శరీర కోరికల మీద మనసుపెడితే మరణాన్ని పొందుతాం,+ కానీ పవిత్రశక్తికి సంబంధించిన విషయాల మీద మనసుపెడితే జీవాన్ని, శాంతిని పొందుతాం;+  శరీర కోరికల మీద మనసుపెడితే దేవునికి శత్రువులమౌతాం;+ ఎందుకంటే శరీరం దేవుని నియమానికి లోబడదు, లోబడలేదు కూడా.  కాబట్టి శరీర కోరికల ప్రకారం నడుచుకునేవాళ్లు దేవుణ్ణి సంతోషపెట్టలేరు.  దేవుని పవిత్రశక్తి నిజంగా మీలో నివసిస్తుంటే, మీరు శరీర కోరికల ప్రకారం నడుచుకోరు, బదులుగా పవిత్రశక్తికి అనుగుణంగా నడుచుకుంటారు.+ కానీ, ఎవరికైనా క్రీస్తు మనసు* లేకపోతే అతను క్రీస్తుకు చెందినవాడు కాదు. 10  ఒకవేళ మీరు క్రీస్తుతో ఐక్యంగా ఉంటే,+ పాపం వల్ల మీ శరీరం చనిపోయినా, మీరు నీతిమంతులుగా తీర్పు తీర్చబడుతున్నారు కాబట్టి పవిత్రశక్తి జీవాన్ని ఇస్తుంది. 11  అయితే మృతుల్లో నుండి యేసును బ్రతికించిన దేవుని+ పవిత్రశక్తి మీలో నివసిస్తుంటే, క్రీస్తుయేసును మృతుల్లో నుండి బ్రతికించిన దేవుడే మీలో నివసిస్తున్న తన పవిత్రశక్తి ద్వారా, నశించిపోయే మీ శరీరాల్ని బ్రతికిస్తాడు.+ 12  కాబట్టి సహోదరులారా, శరీర కోరికల ప్రకారం జీవించేలా శరీరానికి లోబడాల్సిన అవసరం మనకు లేదు;+ 13  ఎందుకంటే మీరు శరీర కోరికల ప్రకారం జీవిస్తే, ఖచ్చితంగా చనిపోతారు;+ కానీ పవిత్రశక్తి సహాయంతో పాపపు అలవాట్లను చంపేస్తే, మీరు బ్రతుకుతారు.+ 14  దేవుని పవిత్రశక్తి చేత నిర్దేశించబడే వాళ్లందరూ నిజానికి దేవుని పిల్లలే.*+ 15  దేవుని పవిత్రశక్తి మనల్ని మళ్లీ బానిసల్ని చేయదు, మనలో మళ్లీ భయాన్ని పుట్టించదు; కానీ, దాని ద్వారా మనం దేవుని పిల్లలుగా దత్తత తీసుకోబడతాం, దేవుణ్ణి “నాన్నా,* తండ్రీ!” అని పిలిచేలా+ పురికొల్పబడతాం. 16  మనం దేవుని పిల్లలమని+ పవిత్రశక్తే మన మనసుకు*+ సాక్ష్యమిస్తుంది. 17  మనం దేవుని పిల్లలమైతే, ఆయన వారసులం; క్రీస్తుకైతే తోటి వారసులం.+ మనం క్రీస్తుతో కలిసి బాధలు అనుభవిస్తే+ ఆయనతోపాటు మహిమపర్చబడతాం+ కూడా. 18  మన విషయంలో బయల్పర్చబడే మహిమతో పోలిస్తే, ఇప్పుడు మనం అనుభవిస్తున్న బాధలు అసలేమాత్రం లెక్కలోకి రావు.+ 19  దేవుని పిల్లల మహిమ* బయల్పర్చబడే సమయం కోసం సృష్టి అంతా ఆత్రంగా ఎదురుచూస్తోంది.+ 20  ఎందుకంటే సృష్టి వ్యర్థమైన జీవితానికి లోబర్చబడింది.+ సృష్టి సొంత ఇష్టం వల్ల అలా లోబర్చబడలేదు కానీ, నిరీక్షణ ఆధారంగా దేవుడే దాన్ని వ్యర్థమైన జీవితానికి లోబర్చాడు. 21  సృష్టి పాపమరణాల బానిసత్వం నుండి విడుదలై,+ దేవుని పిల్లల మహిమగల స్వాతంత్ర్యాన్ని పొందుతుంది అన్నదే ఆ నిరీక్షణ. 22  ఇప్పటివరకు సృష్టి అంతా ఏకస్వరంతో మూల్గుతూ వేదన పడుతోందని మనకు తెలుసు. 23  అంతేకాదు ప్రథమఫలాల్ని, అంటే పవిత్రశక్తిని పొందిన మనం కూడా మనలో మనం మూల్గుతున్నాం;+ విమోచన క్రయధనం* ఆధారంగా మన శరీరాల నుండి విడుదల పొంది దేవుని పిల్లలుగా దత్తత తీసుకోబడడం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాం.+ 24  దేవుడు మనల్ని కాపాడినప్పుడు మనం ఈ నిరీక్షణను పొందాం; అయితే ఒక వ్యక్తి తాను నిరీక్షించేదాన్ని పొందితే, అతను ఇక దాని కోసం నిరీక్షించాల్సిన అవసరం ఉంటుందా? 25  కానీ మనం నిరీక్షించేదాన్ని+ ఇంకా పొందకపోతే, దానికోసం ఆశతో ఓపిగ్గా ఎదురుచూస్తూ ఉంటాం.+ 26  అలాగే, మనం బలహీనంగా ఉన్నప్పుడు దేవుని పవిత్రశక్తి మనకు సహాయం చేస్తుంది;+ కొన్నిసార్లు ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు దేనికోసం ప్రార్థించాలో మనకు తెలీదు. అలాంటప్పుడు పవిత్రశక్తే, లోలోపల మూల్గుతున్న* మన తరఫున వేడుకుంటుంది. 27  అయితే మన హృదయాల్ని పరిశోధించే దేవుడు+ ఆ పవిత్రశక్తి చేస్తున్న విన్నపాల్ని అర్థంచేసుకుంటాడు. ఎందుకంటే, అది దేవుని ఇష్టానికి అనుగుణంగా పవిత్రుల తరఫున వేడుకుంటోంది. 28  తనను ప్రేమించేవాళ్ల మంచి కోసం, అంటే తన సంకల్పం ప్రకారం తాను పిలిచినవాళ్ల మంచి కోసం దేవుడు తన పనులన్నీ ఒకదానితో ఒకటి సహకరించుకునేలా* చేస్తాడని మనకు తెలుసు;+ 29  ఎందుకంటే, తాను మొట్టమొదట ఆమోదించినవాళ్లు తన కుమారుడి ప్రతిబింబంలా ఉండాలని+ ఆయన ముందే నిర్ణయించాడు; అలా చాలామంది సహోదరుల్లో+ ఆ కుమారుడే మొట్టమొదట పుట్టినవాడు అవ్వాలన్నది+ దేవుని ఉద్దేశం. 30  అంతేకాదు, తాను ముందుగా నిర్ణయించినవాళ్లనే+ ఆయన పిలిచాడు;+ అలా పిలిచినవాళ్లనే నీతిమంతులుగా తీర్పుతీర్చాడు.+ చివరిగా, అలా నీతిమంతులుగా తీర్పుతీర్చినవాళ్లనే ఆయన మహిమపర్చాడు+ కూడా. 31  మరైతే ఈ విషయాల గురించి ఏమనాలి? దేవుడు మన వైపు ఉండగా, ఎవరు మనకు ఎదురు నిలవగలరు?+ 32  ఆయన మనందరి కోసం తన సొంత కుమారుణ్ణి మరణానికి అప్పగించడానికి కూడా సిద్ధపడ్డాడు;+ అలాంటిది, ఆయనతోపాటు మిగతావన్నీ మనకు దయతో ఇవ్వడా? 33  అంతేకాదు, దేవుడు ఎంచుకున్నవాళ్ల మీద ఎవరు నేరం మోపగలరు?+ వాళ్లను నీతిమంతులుగా తీర్పుతీర్చేది దేవుడే.+ 34  ఎవరు మనకు శిక్ష విధించగలరు? ఎందుకంటే క్రీస్తుయేసు చనిపోయాడు, బ్రతికించబడ్డాడు, దేవుని కుడిపక్కన ఉండి+ మనకోసం వేడుకుంటున్నాడు.+ 35  క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరుచేయగలరు?+ శ్రమలైనా, కష్టాలైనా, హింసలైనా, ఆకలైనా, దిగంబరత్వమైనా, ప్రమాదాలైనా, ఖడ్గమైనా మనల్ని వేరుచేయగలవా?+ 36  లేఖనాల్లో రాసివున్నట్టే, “నీ కోసం మేము రోజంతా మరణాన్ని ఎదుర్కొంటున్నాం; వధించబోయే గొర్రెల్లా ఎంచబడ్డాం.”+ 37  అయితే, మనల్ని ప్రేమించిన క్రీస్తు ద్వారా మనం వాటన్నిట్లో పూర్తి విజయం సాధిస్తున్నాం.+ 38  మరణమైనా, జీవమైనా, దేవదూతలైనా, ప్రభుత్వాలైనా, ఇప్పుడున్నవైనా, రాబోయేవైనా, శక్తులైనా,+ 39  ఎత్తైనా, లోతైనా, సృష్టించబడిన ఇంకేదైనా మన ప్రభువైన క్రీస్తుయేసు ద్వారా దేవుడు చూపించే ప్రేమ నుండి మనల్ని వేరుచేయలేవని నాకు నమ్మకం కుదిరింది.

అధస్సూచీలు

పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
అక్ష., “కుమారులే.”
ఇక్కడ “అబ్బా” అనే హీబ్రూ లేదా అరామిక్‌ పదం ఉంది. ఇది పిల్లలు తమ తండ్రిని పిలిచేటప్పుడు ఉపయోగించే పదం.
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
అక్ష., “దేవుని కుమారులు.”
పదకోశం చూడండి.
లేదా “మాటలతో చెప్పడానికి వీలుకాని మూల్గులతో.”
లేదా “క్రమపద్ధతిలో ముందుకు సాగేలా.”