లూకా సువార్త 17:1-37
17 తర్వాత ఆయన తన శిష్యులకు ఇలా చెప్పాడు: “ఒక వ్యక్తిని పాపంలో పడేసేవి ఎప్పుడూ ఉంటాయి. కానీ ఎవరైతే ఒక మనిషిని పాపంలో పడేస్తారో అతనికి శ్రమ!
2 ఈ చిన్నవాళ్లలో ఒకరు పాపం చేయడానికి కారణమవ్వడం కన్నా, మెడకు పెద్ద తిరుగలి రాయి కట్టబడి సముద్రంలో పడేయబడడమే ఒక వ్యక్తికి మంచిది.+
3 జాగ్రత్త! నీ సహోదరుడు పాపం చేస్తే అతన్ని గద్దించు;+ పశ్చాత్తాపపడితే క్షమించు.+
4 అతను రోజుకు ఏడుసార్లు నీ విషయంలో పాపం చేసినా, ఏడుసార్లు నీ దగ్గరికి వచ్చి, ‘నన్ను క్షమించు’ అని అడిగితే, నువ్వు అతన్ని క్షమించాలి.”+
5 అప్పుడు అపొస్తలులు, “ఇంకా బలమైన విశ్వాసం కలిగివుండేలా మాకు సాయం చేయి” అని ప్రభువును అడిగారు.+
6 అప్పుడు ప్రభువు ఇలా అన్నాడు: “మీకు ఆవగింజంత విశ్వాసం ఉండి, ఈ కంబళి* చెట్టుతో, ‘ఇక్కడి నుండి లేచి సముద్రంలో పడు!’ అని చెప్తే, అది లేచి సముద్రంలో పడుతుంది.+
7 “మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉన్నాడనుకోండి. ఆ దాసుడు పొలం దున్ని లేదా మందను కాసి వస్తే యజమాని అతనితో, ‘వెంటనే వచ్చి ఇక్కడ భోజనానికి కూర్చో’ అని అంటాడా?
8 లేదు. బదులుగా యజమాని అతనితో, ‘నువ్వు బట్టలు మార్చుకొని, నేను తినడానికి ఏదోకటి సిద్ధం చేయి. నేను తిని తాగే వరకు పక్కనే ఉండి సేవలు చేయి. తర్వాత నువ్వు తిని తాగుదువుగానీ’ అంటాడు.
9 ఇచ్చిన పని చేసినందుకు యజమాని ఆ దాసునికి కృతజ్ఞతలు చెప్తాడా? చెప్పడు కదా.
10 అలాగే, మీరు కూడా మీకు ఇచ్చిన పనులన్నీ చేసిన తర్వాత ఇలా అనండి: ‘మేము ఎందుకూ పనికిరాని దాసులం. మేము చేయాల్సిన వాటినే చేశాం.’ ”+
11 యేసు యెరూషలేముకు వెళ్తూ సమరయ, గలిలయ పొలిమేరల మీదుగా ప్రయాణిస్తున్నాడు.
12 ఆయన ఒక గ్రామంలోకి ప్రవేశిస్తున్నప్పుడు, పదిమంది కుష్ఠురోగులు ఆయనకు ఎదురొచ్చారు. వాళ్లు కాస్త దూరంలోనే నిలబడి,+
13 “యేసూ, బోధకుడా, మమ్మల్ని కరుణించు!” అని బిగ్గరగా కేకలు వేశారు.
14 యేసు వాళ్లను చూసినప్పుడు వాళ్లతో, “వెళ్లి యాజకులకు కనిపించండి”+ అని అన్నాడు. వాళ్లు అలా వెళ్తూ ఉండగా శుద్ధులయ్యారు.+
15 వాళ్లలో ఒకతను తాను బాగయ్యానని చూసుకున్నప్పుడు, దేవుణ్ణి బిగ్గరగా మహిమపరుస్తూ వెనక్కి తిరిగొచ్చాడు.
16 అతను యేసు పాదాల దగ్గర సాష్టాంగపడి, ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు. అతనొక సమరయుడు.+
17 అప్పుడు యేసు ఇలా అడిగాడు: “పదిమందీ శుద్ధులయ్యారు కదా? మరి మిగతా తొమ్మిదిమంది ఎక్కడ?
18 అన్యజనుడైన ఇతను తప్ప దేవుణ్ణి మహిమపర్చడానికి ఇంకెవ్వరూ తిరిగి రాలేదా?”
19 తర్వాత యేసు అతనితో ఇలా అన్నాడు: “లేచి నీ దారిన వెళ్లు, నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది.”+
20 దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని పరిసయ్యులు అడిగినప్పుడు+ యేసు వాళ్లకు ఇలా చెప్పాడు: “దేవుని రాజ్యం అందరికీ కనిపించేలా రాదు.
21 అలాగే ప్రజలు, ‘ఇదిగో ఇక్కడుంది!’ ‘అదిగో అక్కడుంది!’ అని అనరు. ఎందుకంటే, ఇదిగో! దేవుని రాజ్యం మీ మధ్యే ఉంది.”+
22 తర్వాత ఆయన శిష్యులతో ఇలా అన్నాడు: “మానవ కుమారుడి రోజుల్లో ఒకరోజును చూడాలని మీరు కోరుకునే సమయం రాబోతుంది; కానీ మీరు దాన్ని చూడరు.
23 ప్రజలు మీతో, ‘అదిగో అక్కడ!’ ‘ఇదిగో ఇక్కడ!’ అని అంటారు. అప్పుడు మీరు వెళ్లకండి, వాళ్ల వెనక పరుగెత్తకండి.+
24 మెరుపు ఆకాశంలో ఒక చోట మొదలై ఆకాశంలో ఇంకో చోటి వరకు మెరుస్తుంది; మానవ కుమారుడి+ రోజుల్లో కూడా అలాగే ఉంటుంది.+
25 అయితే ముందుగా ఆయన చాలా బాధలు పడి, ఈ తరంవాళ్ల చేత తిరస్కరించబడాలి.+
26 అంతేకాదు, నోవహు రోజుల్లో జరిగినట్టే+ మానవ కుమారుడి రోజుల్లో కూడా ఉంటుంది:+
27 నోవహు ఓడలోకి వెళ్లే రోజు+ వరకు ప్రజలు తింటూ, తాగుతూ, పెళ్లిళ్లు చేసుకుంటూ ఉన్నారు. తర్వాత జలప్రళయం వచ్చి వాళ్లందర్నీ నాశనం చేసింది.+
28 అలాగే అప్పుడు పరిస్థితి లోతు రోజుల్లో ఉన్నట్టే+ ఉంటుంది: ప్రజలు తింటూ, తాగుతూ, కొంటూ, అమ్ముతూ, నాటుతూ, ఇళ్లు కట్టుకుంటూ ఉన్నారు.
29 కానీ లోతు సొదొమ నుండి బయటికి వచ్చిన రోజున ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురిసి వాళ్లందర్నీ నాశనం చేశాయి.+
30 మానవ కుమారుడు బయల్పర్చబడే రోజున పరిస్థితి అలాగే ఉంటుంది.+
31 “ఆ రోజున, డాబా మీదున్న వ్యక్తి ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకోవడానికి కిందికి దిగకూడదు. అలాగే, పొలంలో ఉన్న వ్యక్తి తన వస్తువులు తీసుకోవడానికి వెనక్కి రాకూడదు.
32 లోతు భార్యను+ గుర్తుచేసుకోండి.
33 తన ప్రాణాన్ని కాపాడుకోవాలని ప్రయత్నించే వ్యక్తి దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ దాన్ని పోగొట్టుకునే వ్యక్తి దాన్ని కాపాడుకుంటాడు.+
34 నేను మీతో చెప్తున్నాను, ఆ రాత్రి ఇద్దరు ఒక మంచంలో పడుకొని ఉంటారు; వాళ్లలో ఒకరు తీసుకెళ్లబడతారు, ఇంకొకరు వదిలేయబడతారు.+
35 ఇద్దరు స్త్రీలు ఒకే తిరుగలి విసురుతూ ఉంటారు; వాళ్లలో ఒకామె తీసుకెళ్లబడుతుంది, ఇంకొకామె వదిలేయబడుతుంది.”
36 *——
37 అప్పుడు వాళ్లు యేసును “ప్రభువా, ఇది ఎక్కడ జరుగుతుంది?” అని అడిగారు. ఆయన వాళ్లతో, “శవం ఎక్కడ ఉంటే గద్దలు అక్కడ పోగౌతాయి”+ అన్నాడు.