లూకా సువార్త 20:1-47

  • యేసుకున్న అధికారాన్ని ప్రశ్నించడం (1-8)

  • హంతకులైన కౌలుదారుల ఉదాహరణ (9-19)

  • దేవుడు, కైసరు (20-26)

  • పునరుత్థానం గురించిన ప్రశ్న (27-40)

  • క్రీస్తు దావీదు కుమారుడా? (41-44)

  • శాస్త్రుల గురించి హెచ్చరిక (45-47)

20  యేసు ఒకరోజు ఆలయంలో ప్రజలకు బోధిస్తూ, మంచివార్త ప్రకటిస్తూ ఉండగా ముఖ్య యాజకులు, శాస్త్రులు, పెద్దలు వచ్చి  “నువ్వు ఏ అధికారంతో ఇవి చేస్తున్నావు? ఈ అధికారం నీకు ఎవరిచ్చారు? మాకు చెప్పు” అని ఆయన్ని అడిగారు.+  యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “నేను కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి.  బాప్తిస్మమిచ్చే అధికారం యోహానుకు ఎవరు ఇచ్చారు? దేవుడా,* మనుషులా?”  అప్పుడు వాళ్లలో వాళ్లు ఇలా ఆలోచించుకున్నారు: “మనం ‘దేవుడు ఇచ్చాడు’ అని చెప్తే, ‘మరి మీరు అతన్ని ఎందుకు నమ్మలేదు?’ అంటాడు.  ఒకవేళ మనం ‘మనుషులు ఇచ్చారు’ అని చెప్తే, ప్రజలందరూ మనల్ని రాళ్లతో కొడతారు. ఎందుకంటే వాళ్లందరూ యోహాను ఒక ప్రవక్త అని నమ్ముతున్నారు.”+  కాబట్టి వాళ్లు, ఆ అధికారం ఎవరిచ్చారో తమకు తెలీదని యేసుతో చెప్పారు.  దానికి యేసు వాళ్లతో, “ఏ అధికారంతో ఇవి చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను” అన్నాడు.  తర్వాత యేసు ప్రజలకు ఈ ఉదాహరణ* చెప్పాడు: “ఒకతను ద్రాక్షతోట నాటించి,+ దాన్ని కౌలుకిచ్చి, వేరే దేశానికి వెళ్లిపోయి అక్కడ చాలాకాలం ఉన్నాడు.+ 10  సమయం వచ్చినప్పుడు అతను, ద్రాక్ష పంటలో తనకు రావాల్సిన భాగాన్ని తీసుకురావడానికి తన దాసుణ్ణి ఆ రైతుల దగ్గరికి పంపించాడు. కానీ వాళ్లు అతన్ని కొట్టి, వట్టి చేతులతో పంపించేశారు.+ 11  తర్వాత అతను ఇంకో దాసుణ్ణి పంపించాడు. వాళ్లు అతన్ని కూడా కొట్టి, అవమానించి, వట్టి చేతులతో పంపించేశారు. 12  మళ్లీ అతను ఇంకో దాసుణ్ణి పంపించాడు. వాళ్లు అతన్ని కూడా గాయపర్చి, బయటికి వెళ్లగొట్టారు. 13  దాంతో ఆ ద్రాక్షతోట యజమాని, ‘ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఎంతో ప్రేమించే నా కుమారుణ్ణి పంపిస్తాను.+ వాళ్లు అతన్ని గౌరవిస్తారేమో’ అని అనుకున్నాడు. 14  అతన్ని చూడగానే ఆ రైతులు, ‘ఇతను వారసుడు. ఇతన్ని చంపేద్దాం రండి, అప్పుడు ఆస్తి మనదైపోతుంది’ అని ఒకరితో ఒకరు అనుకున్నారు. 15  కాబట్టి వాళ్లు అతన్ని ద్రాక్షతోట బయటికి తోసేసి చంపేశారు.+ అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని వాళ్లను ఏంచేస్తాడు? 16  అతను వచ్చి ఆ రైతుల్ని చంపి, ద్రాక్షతోటను వేరేవాళ్లకు ఇస్తాడు.” అది విన్నప్పుడు వాళ్లు, “అలా ఎప్పటికీ జరగకూడదు!” అన్నారు. 17  కానీ యేసు వాళ్లవైపు సూటిగా చూస్తూ ఇలా అడిగాడు: “మరైతే, ‘కట్టేవాళ్లు వద్దనుకున్న రాయి ముఖ్యమైన మూలరాయి* అయింది’+ అని రాయబడిన మాటలకు అర్థమేమిటి? 18  ఆ రాయిమీద పడే ప్రతీ ఒక్కరు ముక్కలుముక్కలు అయిపోతారు.+ ఆ రాయి ఎవరి మీద పడుతుందో వాళ్లను అది నలగ్గొడుతుంది.” 19  యేసు తమను మనసులో పెట్టుకునే ఆ ఉదాహరణ చెప్పాడని శాస్త్రులు, ముఖ్య యాజకులు గ్రహించి ఆ సమయంలోనే ఆయన్ని పట్టుకోవాలని చూశారు; కానీ ప్రజలకు భయపడ్డారు.+ 20  వాళ్లు యేసును జాగ్రత్తగా కనిపెట్టిన తర్వాత, రహస్యంగా కొందరికి డబ్బిచ్చి, నీతిమంతుల్లా నటిస్తూ ఆయన మాటల్లో తప్పు పట్టుకోమని పంపించారు.+ అలా ఆయన్ని ప్రభుత్వానికి, అధిపతికి అప్పగించాలనేది వాళ్ల ఉద్దేశం. 21  వాళ్లు ఆయన్ని ప్రశ్నిస్తూ ఇలా అన్నారు: “బోధకుడా, నువ్వు సరిగ్గా మాట్లాడతావని, సరిగ్గా బోధిస్తావని, ఏమాత్రం పక్షపాతం చూపించవని, దేవుని మార్గం గురించిన సత్యాన్ని బోధిస్తావని మాకు తెలుసు. 22  కైసరుకు పన్నులు కట్టడం న్యాయమా, కాదా?”* 23  వాళ్ల కపట బుద్ధిని పసిగట్టి ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: 24  “నాకు ఒక దేనారం* చూపించండి. దాని మీదున్న బొమ్మ, పేరు ఎవరివి?” వాళ్లు, “కైసరువి” అన్నారు. 25  అప్పుడాయన, “అయితే, తప్పకుండా కైసరువి కైసరుకు చెల్లించండి,+ కానీ దేవునివి దేవునికి చెల్లించండి” అని వాళ్లతో అన్నాడు.+ 26  కాబట్టి వాళ్లు ప్రజల ముందు ఆయన్ని మాటల్లో తప్పు పట్టుకోలేకపోయారు. ఆయనిచ్చిన జవాబుకు ఆశ్చర్యపోయి వాళ్లు ఇంకేమీ మాట్లాడలేకపోయారు. 27  అయితే పునరుత్థానం లేదని చెప్పే* సద్దూకయ్యుల్లో+ కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి ఇలా అడిగారు:+ 28  “బోధకుడా, ‘ఒక వ్యక్తి పిల్లలు లేకుండా చనిపోతే, అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని అతని కోసం పిల్లల్ని కనాలి’ అని మోషే రాశాడు.+ 29  ఒక కుటుంబంలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవాళ్లు. మొదటివాడు ఒకామెను పెళ్లి చేసుకొని, పిల్లలు లేకుండానే చనిపోయాడు. 30  కాబట్టి రెండోవాడు, 31  ఆ తర్వాత మూడోవాడు ఆమెను పెళ్లి చేసుకున్నారు. అలా ఆ ఏడుగురూ ఆమెను పెళ్లి చేసుకున్నారు; కానీ పిల్లలు లేకుండానే చనిపోయారు. 32  చివరికి ఆమె కూడా చనిపోయింది. 33  ఆ ఏడుగురూ ఆమెను పెళ్లి చేసుకున్నారు కదా, మరి చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతికినప్పుడు ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది?” 34  యేసు వాళ్లతో ఇలా అన్నాడు: “ఈ వ్యవస్థలోని* ప్రజలు పెళ్లి చేసుకుంటారు. 35  కానీ రానున్న వ్యవస్థలో ఉండడానికి, పునరుత్థానం అవడానికి అర్హులైనవాళ్లు పెళ్లి చేసుకోరు.+ 36  నిజానికి వాళ్లు ఇక చనిపోరు* కూడా. ఎందుకంటే వాళ్లు దేవదూతల్లా ఉంటారు. అంతేకాదు వాళ్లు పునరుత్థానం చేయబడతారు కాబట్టి దేవుని పిల్లలుగా ఉంటారు. 37  ముళ్లపొద గురించిన భాగంలో మోషే యెహోవాను* ‘అబ్రాహాముకు దేవుడు, ఇస్సాకుకు దేవుడు, యాకోబుకు దేవుడు’ అని పిలుస్తూ చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతికించబడతారని సూచించాడు.+ 38  ఆయన చనిపోయినవాళ్లకు కాదు, బ్రతికున్నవాళ్లకే దేవుడు. ఎందుకంటే వాళ్లంతా ఆయన దృష్టిలో బ్రతికే ఉన్నారు.”+ 39  అప్పుడు కొంతమంది శాస్త్రులు, “బోధకుడా, నువ్వు చక్కగా మాట్లాడావు” అన్నారు. 40  తర్వాత వాళ్లు ఆయన్ని ఒక్క ప్రశ్న అడగడానికి కూడా ధైర్యం చేయలేకపోయారు. 41  అప్పుడు యేసు వాళ్లను ఇలా అడిగాడు: “మరైతే, క్రీస్తు దావీదు కుమారుడని వాళ్లు ఎలా అంటున్నారు?+ 42  కీర్తనల పుస్తకంలో దావీదే స్వయంగా ఇలా అన్నాడు: ‘యెహోవా* నా ప్రభువుతో ఇలా చెప్పాడు: “నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేసేవరకు 43  నువ్వు నా కుడిపక్కన కూర్చో.” ’+ 44  అంటే, దావీదు క్రీస్తును ప్రభువు అని అంటున్నాడు కదా, అలాంటప్పుడు క్రీస్తు దావీదుకు కుమారుడు ఎలా అవుతాడు?” 45  తర్వాత, ప్రజలందరూ వింటుండగా యేసు తన శిష్యులకు ఇలా చెప్పాడు: 46  “శాస్త్రుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పొడవాటి అంగీలు వేసుకొని తిరగడం, సంతల్లో నమస్కారాలు పెట్టించుకోవడం వాళ్లకు ఇష్టం. వాళ్లకు సమాజమందిరాల్లో ముందువరుస* స్థానాలు, విందుల్లో ప్రత్యేక స్థానాలు ఇష్టం.+ 47  వాళ్లు విధవరాళ్ల ఇళ్లను* మింగేస్తారు, అందరికీ కనిపించాలని పెద్దపెద్ద ప్రార్థనలు చేస్తారు. వాళ్లు మరింత కఠినమైన తీర్పు పొందుతారు.”

అధస్సూచీలు

అక్ష., “పరలోకమా.”
లేదా “ఉపమానం.”
అక్ష., “మూలకు తల.”
లేదా “సరైనదా, కాదా?”
అనుబంధం B14 చూడండి.
లేదా “చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతుకుతారనే బోధను నమ్మని.”
లేదా “యుగంలోని.” పదకోశం చూడండి.
అక్ష., “చనిపోలేరు.”
అనుబంధం A5 చూడండి.
అనుబంధం A5 చూడండి.
లేదా “శ్రేష్ఠమైన.”
లేదా “ఆస్తుల్ని.”