లేవీయకాండం 15:1-33

  • అపవిత్రమైన స్రావాలు (1-33)

15  యెహోవా మోషే, అహరోనులతో ఇంకా ఇలా అన్నాడు:  “మీరు ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పండి: ‘ఒక పురుషునికి శరీరంలో* స్రావం ఉంటే, అది అతన్ని అపవిత్రుణ్ణి చేస్తుంది.+  దానివల్ల అతను అపవిత్రుడౌతాడు. ఆ స్రావం అతని శరీరం నుండి అలాగే కారుతూ ఉన్నా, కారకపోయినా అతను అపవిత్రుడే.  “ ‘స్రావం ఉన్న అతను పడుకున్న ఏ మంచమైనా అపవిత్రమౌతుంది, అతను కూర్చున్నది ఏదైనా అపవిత్రమౌతుంది.  అతని మంచాన్ని ముట్టుకున్న వ్యక్తి తన వస్త్రాలు ఉతుక్కొని, నీళ్లతో స్నానం చేయాలి; ఆ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు.+  స్రావం ఉన్న అతను కూర్చున్న దానిమీద ఎవరైనా కూర్చుంటే ఆ వ్యక్తి తన వస్త్రాలు ఉతుక్కొని, నీళ్లతో స్నానం చేయాలి; ఆ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు.  స్రావం ఉన్న అతన్ని ముట్టుకునే ఏ వ్యక్తయినా తన వస్త్రాలు ఉతుక్కొని, నీళ్లతో స్నానం చేయాలి; ఆ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు.  స్రావం ఉన్న అతను, పవిత్రంగా ఉన్న వ్యక్తి మీద ఉమ్మివేస్తే ఆ వ్యక్తి తన వస్త్రాలు ఉతుక్కొని, నీళ్లతో స్నానం చేయాలి; ఆ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు.  స్రావం ఉన్న అతను కూర్చున్న ఏ జీను* అయినా అపవిత్రమౌతుంది. 10  అతను కూర్చున్న దేన్నైనా ముట్టుకునే వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు. ఆ వస్తువుల్ని ముట్టుకున్న ఏ వ్యక్తయినా తన వస్త్రాలు ఉతుక్కొని, నీళ్లతో స్నానం చేయాలి; ఆ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు. 11  స్రావం ఉన్న అతను+ నీళ్లతో చేతులు కడుక్కోకుండా ఎవరినైనా ముట్టుకుంటే, ఆ వ్యక్తి తన వస్త్రాలు ఉతుక్కొని, నీళ్లతో స్నానం చేయాలి; ఆ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు. 12  స్రావం ఉన్న అతను ముట్టుకున్న ఏ మట్టిపాత్రనైనా పగలగొట్టాలి, అతను ముట్టుకున్న ఏ చెక్క పాత్రనైనా నీళ్లతో కడగాలి.+ 13  “ ‘స్రావం ఆగిపోయి, అతను దాన్నుండి పవిత్రుడైతే, తన శుద్ధీకరణ కోసం అతను ఏడురోజులు లెక్కించాలి. తర్వాత అతను తన వస్త్రాలు ఉతుక్కొని, పారే నీళ్లతో స్నానం చేయాలి; అప్పుడు అతను పవిత్రుడౌతాడు.+ 14  ఎనిమిదో రోజున అతను రెండు గువ్వల్ని గానీ రెండు పావురం పిల్లల్ని గానీ తీసుకొని+ ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర యెహోవా ముందుకు వచ్చి, వాటిని యాజకునికి ఇవ్వాలి. 15  అప్పుడు యాజకుడు వాటిలో ఒకదాన్ని పాపపరిహారార్థ బలిగా, ఇంకొక దాన్ని దహనబలిగా అర్పిస్తాడు. అతని స్రావం విషయంలో యాజకుడు యెహోవా ముందు అతని కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు. 16  “ ‘ఒకవేళ ఒక వ్యక్తికి వీర్యస్ఖలనం అయితే, అతను నీళ్లతో బాగా స్నానం చేయాలి; అతను సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు.+ 17  వీర్యం పడిన ఏ వస్త్రాన్నైనా, తోలు వస్తువునైనా అతను నీళ్లతో ఉతకాలి; అది సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటుంది. 18  “ ‘పురుషుడు స్త్రీతో కలిసినప్పుడు వీర్యస్ఖలనం అయితే, వాళ్లు నీళ్లతో స్నానం చేయాలి; సాయంత్రం వరకు వాళ్లు అపవిత్రులుగా ఉంటారు.+ 19  “ ‘ఒక స్త్రీకి రక్తస్రావమైతే, ఆ రుతుస్రావం వల్ల ఆమె ఏడురోజుల పాటు అపవిత్రురాలిగా ఉంటుంది.+ ఆమెను ముట్టుకునే వాళ్లెవరైనా సాయంత్రం వరకు అపవిత్రులుగా ఉంటారు.+ 20  రుతుస్రావ అశుద్ధత సమయంలో ఆమె పడుకున్నది ఏదైనా అపవిత్రమౌతుంది, ఆమె కూర్చున్నది ఏదైనా అపవిత్రమౌతుంది.+ 21  ఆమె మంచాన్ని ముట్టుకునే ఏ వ్యక్తయినా తన వస్త్రాల్ని ఉతుక్కొని, నీళ్లతో స్నానం చేయాలి; అతను సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు. 22  ఆమె కూర్చున్న ఏ వస్తువునైనా ముట్టుకునే వ్యక్తి తన వస్త్రాల్ని ఉతుక్కొని, నీళ్లతో స్నానం చేయాలి; అతను సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు. 23  ఆమె మంచం మీద గానీ వేరే వస్తువు మీద గానీ కూర్చుంటే, దాన్ని ముట్టుకునే వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు.+ 24  ఒకవేళ ఒక వ్యక్తి ఆమెతో పడుకుంటే, ఆమె రుతుస్రావ అశుద్ధత అతనికి అంటుకుంటే,+ అతను ఏడురోజుల పాటు అపవిత్రుడిగా ఉంటాడు, అతను పడుకునే ఏ మంచమైనా అపవిత్రమౌతుంది. 25  “ ‘ఒక స్త్రీకి రుతుస్రావ సమయమప్పుడు కాకుండా+ వేరే సమయంలో ఎక్కువ రోజుల పాటు రక్తస్రావం అవుతూ ఉంటే,+ లేదా రుతుక్రమం రోజుల కన్నా ఎక్కువ రోజుల పాటు రక్తస్రావం అవుతూ ఉంటే, అలా రక్తస్రావం అయినన్ని రోజులు ఆమె రుతుస్రావ అశుద్ధత సమయమప్పటిలాగే అపవిత్రురాలిగా ఉంటుంది. 26  అలా రక్తస్రావం జరుగుతున్న రోజుల్లో ఆమె పడుకున్న మంచం ఏదైనా రుతుస్రావ అశుద్ధత సమయమప్పటి మంచంలాగే అపవిత్రమౌతుంది;+ ఆమె కూర్చున్నది ఏదైనా, రుతుస్రావ అశుద్ధత సమయమప్పటిలాగే అపవిత్రమౌతుంది. 27  వాటిని ముట్టుకునే ఏ వ్యక్తయినా అపవిత్రుడౌతాడు. అతను తన వస్త్రాల్ని ఉతుక్కొని, నీళ్లతో స్నానం చేయాలి; అతను సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు.+ 28  “ ‘అయితే ఆ రక్తస్రావం ఆగిపోయినప్పుడు, ఆమె అప్పటినుండి ఏడురోజులు లెక్కిస్తుంది; ఆ తర్వాత ఆమె పవిత్రురాలౌతుంది.+ 29  ఎనిమిదో రోజున, ఆమె రెండు గువ్వల్ని గానీ రెండు పావురం పిల్లల్ని గానీ తీసుకొని,+ ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర యాజకునికి ఇవ్వాలి.+ 30  అప్పుడు యాజకుడు వాటిలో ఒకదాన్ని పాపపరిహారార్థ బలిగా, ఇంకొకదాన్ని దహనబలిగా అర్పిస్తాడు. ఆమె రక్తస్రావ అపవిత్రత విషయంలో యాజకుడు యెహోవా ముందు ఆమె కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు.+ 31  “ ‘ఈ విధంగా మీరు ఇశ్రాయేలీయుల్ని వాళ్ల అపవిత్రత నుండి దూరంగా ఉంచాలి. దానివల్ల వాళ్లు తమ మధ్య ఉన్న నా గుడారాన్ని తమ అపవిత్రతతో మలినపర్చి+ చనిపోకుండా ఉంటారు. 32  “ ‘స్రావం ఉన్నవాళ్ల గురించిన నియమాలు ఇవి. స్రావం ఉన్న పురుషుడు; వీర్యస్ఖలనం వల్ల అపవిత్రుడైన పురుషుడు;+ 33  రుతుస్రావ సమయంలో అశుద్ధంగా ఉన్న స్త్రీ;+ తన శరీరం నుండి స్రావం అవుతున్న పురుషుడు లేదా స్త్రీ;+ అపవిత్రురాలిగా ఉన్న స్త్రీతో పడుకున్న పురుషుడు ఈ నియమాల్ని పాటించాలి.’ ”

అధస్సూచీలు

లేదా “జననాంగం నుండి.”
ఇది జంతువు మీద కూర్చోవడానికి దాని వీపు మీద వేసేది.