లేవీయకాండం 18:1-30

  • ధర్మశాస్త్రం నిషేధించిన లైంగిక సంబంధాలు (1-30)

    • కనానీయుల్ని అనుకరించకూడదు (3)

    • రక్తసంబంధీకుల మధ్య లైంగిక సంబంధాలు (6-18)

    • రుతుస్రావ సమయంలో (19)

    • స్వలింగ సంపర్కం (22)

    • జంతువుతో సంపర్కం (23)

    • ‘పవిత్రులుగా ఉండండి, లేదంటే దేశం మిమ్మల్ని కక్కేస్తుంది’ (24-30)

18  యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు:  “నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘నేను మీ దేవుడైన యెహోవాను.+  మీరు ఇంతకుముందు నివసించిన ఐగుప్తు దేశంలోని ప్రజల్లా గానీ, నేను మిమ్మల్ని తీసుకెళ్లబోతున్న కనాను దేశంలోని ప్రజల్లా గానీ మీరు ప్రవర్తించకూడదు.+ మీరు వాళ్ల ఆచారాల్ని పాటించకూడదు.  మీరు నా న్యాయనిర్ణయాల్ని, నా శాసనాల్ని పాటించాలి, వాటి ప్రకారం జీవించాలి.+ నేను మీ దేవుడైన యెహోవాను.  మీరు నా శాసనాల్ని, నా న్యాయనిర్ణయాల్ని పాటించాలి; అలా పాటించేవాళ్లు వాటివల్ల జీవిస్తారు.+ నేను యెహోవాను.  “ ‘మీలో ఎవ్వరూ తన రక్తసంబంధులతో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి* వాళ్ల దగ్గరికి వెళ్లకూడదు.+ నేను యెహోవాను.  నువ్వు నీ తండ్రితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు; నీ తల్లితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ తల్లి, ఆమెతో నువ్వు లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.  “ ‘నీ తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.+ అలాచేస్తే నీ తండ్రిని అవమానించినట్టే.*  “ ‘నీ సహోదరితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ తండ్రి కూతురైనా, నీ తల్లి కూతురైనా, ఆమె నీ ఇంట్లో పుట్టిందైనా, కాకపోయినా ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.+ 10  “ ‘నీ కుమారుని కూతురితో గానీ, నీ కూతురి కూతురుతో గానీ లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. అలాచేస్తే, నిన్ను నువ్వు అవమానించుకున్నట్టే.* 11  “ ‘నీ తండ్రి భార్య కూతురితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు, ఎందుకంటే ఆమె నీ తండ్రి సంతానం, నీ సహోదరి. 12  “ ‘నీ తండ్రి సహోదరితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. ఆమె నీ తండ్రికి రక్తసంబంధి.+ 13  “ ‘నీ తల్లి సహోదరితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు, ఎందుకంటే ఆమె నీ తల్లికి రక్తసంబంధి. 14  “ ‘నువ్వు నీ తండ్రి సహోదరుడి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకొని నీ తండ్రి సహోదరుణ్ణి అవమానించకూడదు.* ఆమె నీ పిన్ని.*+ 15  “ ‘నీ కోడలితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.+ ఆమె నీ కుమారుని భార్య, నువ్వు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. 16  “ ‘నీ సహోదరుడి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.+ అలాచేస్తే, నువ్వు నీ సహోదరుణ్ణి అవమానించినట్టే.* 17  “ ‘నువ్వు ఒక స్త్రీతో, అలాగే ఆమె కూతురితో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు.+ నువ్వు ఆమె కుమారుని కూతురితో గానీ, ఆమె కూతురి కూతురుతో గానీ లైంగిక సంబంధం పెట్టుకోకూడదు. వాళ్లు ఆమె రక్తసంబంధులు; అది నీచమైన పని.* 18  “ ‘నువ్వు నీ భార్య బ్రతికి ఉండగానే, ఆమె సహోదరితో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి ఆమెను పెళ్లి చేసుకోకూడదు. 19  “ ‘ఒక స్త్రీ రుతుస్రావ అశుద్ధత సమయంలో ఉన్నప్పుడు, ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకోవడానికి నువ్వు ఆమె దగ్గరికి వెళ్లకూడదు.+ 20  “ ‘నీ సాటిమనిషి* భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోకూడదు, అలాచేస్తే నువ్వు అపవిత్రుడివి అవుతావు.+ 21  “ ‘నీ సంతానంలో ఎవ్వర్నీ మోలెకుకు అర్పించకూడదు.*+ అలా చేసి నువ్వు నీ దేవుని పేరును మలినపర్చకూడదు.+ నేను యెహోవాను. 22  “ ‘స్త్రీతో పడుకున్నట్టు పురుషునితో పడుకోకూడదు.+ అది అసహ్యకరమైన పని. 23  “ ‘ఒక పురుషుడు జంతువుతో సంపర్కం చేయకూడదు, అలాచేస్తే అతను అపవిత్రుడౌతాడు; లేదా ఒక స్త్రీ ఒక జంతువుతో సంపర్కం చేయడానికి దాని దగ్గరికి వెళ్లకూడదు.+ అది సహజ విరుద్ధమైనది. 24  “ ‘వీటిలో దేనివల్లా మిమ్మల్ని మీరు అపవిత్రపర్చుకోకండి. ఎందుకంటే నేను ఏ జనాలనైతే మీ ముందు నుండి వెళ్లగొడుతున్నానో వాళ్లు ఈ పనులన్నీ చేసి తమను తాము అపవిత్రపర్చుకున్నారు.+ 25  దానివల్ల ఆ దేశం అపవిత్రమైపోయింది, ఆ దేశ ప్రజలు చేసిన తప్పుకు నేను వాళ్లను శిక్షిస్తాను, ఆ దేశం దాని నివాసుల్ని బయటికి కక్కేస్తుంది. 26  మీరైతే నా శాసనాల్ని, నా న్యాయనిర్ణయాల్ని పాటించాలి;+ మీరు గానీ, మీ మధ్య నివసిస్తున్న పరదేశి గానీ ఆ అసహ్యకరమైన పనుల్లో దేన్నీ చేయకూడదు. 27  ఎందుకంటే, మీకన్నా ముందు ఆ దేశంలో జీవించిన ప్రజలు ఈ అసహ్యకరమైన పనులన్నీ చేశారు,+ వాటివల్ల ఇప్పుడు ఆ దేశం అపవిత్రంగా ఉంది. 28  మీరు అలాంటి పనులతో ఆ దేశాన్ని అపవిత్రం చేయకుండా ఉంటే ఆ దేశం మీకన్నా ముందున్న ప్రజల్ని కక్కేయబోతున్నట్టు మిమ్మల్ని కక్కేయాల్సిన పరిస్థితి రాదు. 29  ఒకవేళ ఎవరైనా ఆ అసహ్యకరమైన పనుల్లో దేన్నైనా చేస్తే, అలా చేసే వాళ్లంతా తమ ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి.* 30  మీరు నా ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి, మీకన్నా ముందున్న ప్రజలు పాటించిన అసహ్యకరమైన ఆచారాల్లో దేన్నీ మీరు పాటించకూడదు. అప్పుడు మీరు వాటివల్ల అపవిత్రులు కాకుండా ఉంటారు. నేను మీ దేవుడైన యెహోవాను.’ ”

అధస్సూచీలు

అక్ష., “మానాన్ని వెల్లడిచేయడానికి.” ఇక్కడ, అలాగే దీని తర్వాత వచ్చే చోట్లలో ఇదే అర్థం.
అక్ష., “అది నీ తండ్రి మానమే.”
అక్ష., “వాళ్లు నీ మానమే.”
అక్ష., “మానాన్ని వెల్లడిచేయకూడదు.”
లేదా “పెద్దమ్మ.”
అక్ష., “అది నీ సహోదరుడి మానమే.”
లేదా “అవమానకరమైన ప్రవర్తన; కామాతురత.”
లేదా “పొరుగువాడి; తోటివాడి.”
లేదా “సమర్పించకూడదు; బలి ఇవ్వకూడదు.”
లేదా “చంపబడాలి.”