లేవీయకాండం 24:1-23
24 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు:
2 “దీపాలు ఎప్పుడూ వెలుగుతూ ఉండేలా వాటికోసం స్వచ్ఛమైన, దంచితీసిన ఒలీవ నూనెను నీ దగ్గరికి తీసుకురమ్మని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు.+
3 ప్రత్యక్ష గుడారంలో సాక్ష్యపు మందసం తెర బయట, ఆ దీపాలు సాయంత్రం నుండి ఉదయం వరకు యెహోవా ముందు ఎప్పుడూ మండుతూ ఉండేలా అహరోను చూసుకోవాలి. ఇది మీరు తరతరాలపాటు పాటించాల్సిన శాశ్వత శాసనం.
4 అతను, స్వచ్ఛమైన బంగారంతో చేసిన దీపస్తంభం+ మీద యెహోవా ముందు ఎప్పుడూ దీపాల్ని చక్కబెట్టాలి.
5 “నువ్వు మెత్తని పిండి తీసుకొని, దానితో 12 భక్ష్యాలు* చేయాలి. ఒక్కో భక్ష్యాన్ని ఈఫాలో రెండు పదోవంతుల* పిండితో చేయాలి.
6 స్వచ్ఛమైన బంగారంతో చేసిన బల్ల మీద యెహోవా ముందు+ వాటిని రెండు వరుసల్లో పెట్టాలి, ఒక్కో వరుసలో ఆరు ఉండాలి.+
7 నువ్వు ప్రతీ వరుస మీద స్వచ్ఛమైన సాంబ్రాణిని పెట్టాలి; అది రొట్టె కోసం జ్ఞాపకార్థ* భాగంగా పనిచేస్తుంది,+ అది యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణ.
8 అతను క్రమం తప్పకుండా ప్రతీ విశ్రాంతి రోజున వాటిని యెహోవా ముందు ఏర్పాటు చేయాలి.+ ఇది ఇశ్రాయేలీయులకు, నాకు మధ్య ఉన్న శాశ్వత ఒప్పందం.
9 అవి అహరోనుకు, అతని కుమారులకు చెందుతాయి,+ వాళ్లు వాటిని ఒక పవిత్రమైన చోట తింటారు;+ ఎందుకంటే అవి యాజకునికి అతి పవిత్రమైనవి, అవి యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణల్లో నుండి తీసుకున్నవి. ఇది శాశ్వత శాసనం.”
10 ఇశ్రాయేలీయుల మధ్య, ఒక ఐగుప్తీయునికీ+ ఇశ్రాయేలు స్త్రీకీ పుట్టినవాడు ఒకడు ఉన్నాడు. అతనూ, పాలెంలో ఉన్న ఇంకో ఇశ్రాయేలీయుడూ పోట్లాడుకున్నారు.
11 అప్పుడు ఆ ఇశ్రాయేలు స్త్రీ కుమారుడు ఆ పేరును* దూషిస్తూ, దాన్ని శపించడం మొదలుపెట్టాడు.+ దాంతో వాళ్లు అతన్ని మోషే దగ్గరికి తీసుకొచ్చారు.+ అతని తల్లి పేరు షెలోమీతు, ఆమె దాను గోత్రానికి చెందిన దిబ్రీ కూతురు.
12 యెహోవా నిర్ణయం ఏమిటో తమకు స్పష్టమయ్యే వరకు వాళ్లు అతన్ని కాపలాలో ఉంచారు.+
13 అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు:
14 “అలా శపించినవాణ్ణి పాలెం బయటికి తీసుకురండి. అతను శపించడాన్ని విన్న వాళ్లంతా అతని తలమీద చేతులు ఉంచాలి. ఆ తర్వాత ఇశ్రాయేలు సమాజమంతా అతన్ని రాళ్లతో కొట్టి చంపాలి.+
15 నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పాలి: ‘ఎవరైనా తన దేవుణ్ణి శపిస్తే, అతను తన పాపానికి శిక్ష పొందుతాడు.
16 కాబట్టి యెహోవా పేరును దూషించినవాణ్ణి ఖచ్చితంగా చంపేయాలి.+ ఇశ్రాయేలు సమాజమంతా అతన్ని రాళ్లతో కొట్టి చంపాలి. ఇశ్రాయేలీయుడైనా, పరదేశైనా ఆ పేరును దూషిస్తే, అతన్ని చంపేయాలి.
17 “ ‘ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి ప్రాణం తీస్తే,* అతన్ని ఖచ్చితంగా చంపేయాలి.+
18 ఎవరైనా ఒక సాధుజంతువును కొట్టి చంపితే,* అతను నష్టపరిహారంగా ప్రాణానికి ప్రాణం చెల్లించాలి.
19 ఎవరైనా సాటిమనిషిని గాయపరిస్తే, అతను చేసినట్టే అతనికీ చేయాలి.+
20 ఎముకకు ఎముక, కంటికి కన్ను, పంటికి పన్ను, అలా అతను ఎలాంటి గాయం చేస్తే అలాంటి గాయమే అతనికి చేయాలి.+
21 ఒక జంతువును కొట్టి చంపే వ్యక్తి దానికి నష్టపరిహారం చెల్లించాలి;+ కానీ మనిషిని కొట్టి చంపే వ్యక్తిని చంపేయాలి.+
22 “ ‘పరదేశికైనా, ఇశ్రాయేలీయునికైనా ఒకే న్యాయనిర్ణయం వర్తిస్తుంది,+ ఎందుకంటే నేను మీ దేవుడైన యెహోవాను.’ ”
23 తర్వాత మోషే ఇశ్రాయేలీయులతో మాట్లాడాడు. వాళ్లు దేవుని పేరును శపించినవాణ్ణి పాలెం బయటికి తీసుకొచ్చి, రాళ్లతో కొట్టి చంపారు.+ అలా, ఇశ్రాయేలీయులు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే చేశారు.
అధస్సూచీలు
^ వడ ఆకారంలో ఉన్న రొట్టెలు.
^ అప్పట్లో ఈఫాలో రెండు పదోవంతులు 4.4 లీటర్లతో (2.6 కిలోలతో) సమానం. అనుబంధం B14 చూడండి.
^ లేదా “ప్రాతినిధ్య.”
^ 15, 16 వచనాలు సూచిస్తున్నట్టు, ఇది యెహోవా పేరు.
^ లేదా “చచ్చిపోయేలా కొడితే.”
^ లేదా “చచ్చిపోయేలా కొడితే.”