లేవీయకాండం 6:1-30
6 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు:
2 “ఎవరైనా తన పొరుగువాడు తనకు అప్పగించిన లేదా తన దగ్గర ఉంచిన దాని విషయంలో మోసం చేసి+ గానీ, తన పొరుగువాణ్ణి దోచుకొని గానీ, దగా చేసి గానీ పాపానికి ఒడిగట్టి యెహోవా పట్ల నమ్మకద్రోహానికి పాల్పడితే,+
3 లేదా వేరేవాళ్ల వస్తువు తనకు దొరికినప్పుడు అబద్ధమాడి గానీ, తాను చేసిన అలాంటి ఏ పాపం గురించైనా బూటకపు ప్రమాణం చేసి గానీ పాపానికి ఒడిగట్టి+ దేవుని పట్ల నమ్మకద్రోహానికి పాల్పడితే, అతను ఇలా చేయాలి:
4 అతను పాపం చేసి అపరాధి అయితే, తాను దొంగిలించిన దాన్ని, బలవంతంగా లాక్కున్న దాన్ని, దగా చేసి తీసుకున్న దాన్ని, తనకు అప్పగించబడిన దాన్ని లేదా తనకు దొరికిన దాన్ని అతను తిరిగిచ్చేయాలి.
5 లేదా అతను దేని గురించైతే బూటకపు ప్రమాణం చేశాడో దాన్ని తిరిగిచ్చేయాలి, దానికి పూర్తి పరిహారం చెల్లించాలి.+ అంతేకాదు దాని విలువలో ఐదోవంతును కూడా దానికి కలపాలి. తన అపరాధం రుజువైన రోజున అతను దాని యజమానికి దాన్ని ఇచ్చేయాలి.
6 అతను అపరాధ పరిహారార్థ బలి కోసం నిర్ణయించబడిన విలువ ప్రకారం మందలో నుండి ఏ లోపంలేని పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా దగ్గరికి తీసుకురావాలి.+
7 యాజకుడు యెహోవా ముందు అతని కోసం ప్రాయశ్చిత్తం చేస్తాడు. అప్పుడు అతను ఏమి చేసి అపరాధి అయ్యాడో, దాని విషయంలో క్షమాపణ పొందుతాడు.”+
8 యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు:
9 “అహరోనుకు, అతని కుమారులకు ఇలా ఆజ్ఞాపించు: ‘దహనబలి గురించిన నియమం ఏంటంటే,+ దహనబలి జంతువు తెల్లారేవరకు రాత్రంతా బలిపీఠంపై ఉన్న అగ్ని మీద అలాగే ఉండాలి, బలిపీఠం మీద అగ్ని మండుతూనే ఉండాలి.
10 యాజకుడు తన ప్రత్యేకమైన నారవస్త్రాన్ని వేసుకొని,+ తన మర్మాంగాల్ని కప్పుకోవడానికి నార లాగుల్ని* తొడుక్కుంటాడు.+ తర్వాత అతను బలిపీఠం మీద అగ్ని దహించేసిన దహనబలి జంతువు బూడిదను* తీసి,+ బలిపీఠం పక్కన పోస్తాడు.
11 తర్వాత అతను తన వస్త్రాల్ని తీసేసి,+ వేరే వస్త్రాలు వేసుకొని ఆ బూడిదను పాలెం బయట ఒక శుభ్రమైన చోటికి తీసుకెళ్తాడు.+
12 బలిపీఠం మీద అగ్ని మండుతూనే ఉండాలి. అది ఆరిపోకూడదు. యాజకుడు ప్రతీ ఉదయం దానిమీద కట్టెల్ని కాల్చి+ వాటిమీద దహనబలి ముక్కల్ని పేర్చాలి; అతను దానిమీద సమాధాన బలుల కొవ్వును కాల్చి, పొగ పైకిలేచేలా చేస్తాడు.+
13 బలిపీఠం మీద అగ్ని మండుతూనే ఉండాలి. అది ఆరిపోకూడదు.
14 “ ‘ధాన్యార్పణ గురించిన నియమం ఏంటంటే,+ అహరోను కుమారులైన మీరు బలిపీఠం ఎదుట యెహోవా ముందుకు దాన్ని తీసుకురావాలి.
15 వాళ్లలో ఒకరు ధాన్యార్పణలో నుండి పిడికెడు మెత్తని పిండిని, కొంచెం నూనెను, ధాన్యార్పణ మీదున్న సాంబ్రాణి అంతటినీ తీసుకొని యెహోవాకు జ్ఞాపకార్థ* భాగంగా దాన్ని బలిపీఠం మీద పొగ పైకిలేచేలా కాల్చాలి; అది ఆయనకు ఇంపైన* సువాసన.
16 అందులో మిగిలిన దాన్ని అహరోను, అతని కుమారులు తింటారు.+ వాళ్లు దానితో పులవని రొట్టెలు చేసుకొని, ప్రత్యక్ష గుడారపు ప్రాంగణంలో ఒక పవిత్రమైన చోట తింటారు.+
17 వాటిని తయారుచేసేటప్పుడు పులిసిందేదీ కలపకూడదు.+ నాకు అగ్నితో అర్పించే అర్పణల్లో నుండి వాళ్ల భాగంగా నేను దాన్ని వాళ్లకు ఇచ్చాను.+ పాపపరిహారార్థ బలిలా, అపరాధ పరిహారార్థ బలిలా అది అతి పవిత్రమైనది.+
18 అహరోను వంశంలోని ప్రతీ పురుషుడు దాన్ని తింటాడు.+ అది మీ తరతరాలపాటు, యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణల్లో నుండి వాళ్లకు ఇవ్వబడే శాశ్వతమైన భాగం.+ వాటికి* తగిలే ప్రతీది పవిత్రం అవుతుంది.’ ”
19 యెహోవా మోషేతో మళ్లీ ఇలా అన్నాడు:
20 “అహరోను అభిషేకించబడే రోజున అతను, అతని కుమారులు యెహోవాకు ఎప్పుడూ దీన్ని అర్పించాలి: ఈఫాలో పదోవంతు* మెత్తని పిండిని ధాన్యార్పణగా అర్పించాలి;+ దానిలో సగం ఉదయం, సగం సాయంత్రం అర్పించాలి.
21 దానిలో నూనె కలిపి, పెనం మీద కాల్చాలి.+ బాగా నూనె కలిపి, ముక్కలుముక్కలు చేసి ధాన్యార్పణగా దాన్ని అర్పించాలి, అది యెహోవాకు ఇంపైన* సువాసన.
22 అతని వంశస్థుల్లో అతని తర్వాత ప్రధానయాజకునిగా అభిషేకించబడే వ్యక్తి+ దాన్ని అర్పిస్తాడు. ఇది శాశ్వత శాసనం: యెహోవాకు అర్పణగా, పొగ పైకిలేచేలా దాన్ని పూర్తిగా కాల్చాలి.
23 యాజకుని తరఫున అర్పించే ప్రతీ ధాన్యార్పణను పూర్తిగా కాల్చాలి, దాన్ని తినకూడదు.”
24 యెహోవా మోషేతో మళ్లీ ఇలా అన్నాడు:
25 “అహరోనుకు, అతని కుమారులకు ఇలా చెప్పు: ‘పాపపరిహారార్థ బలి గురించిన నియమం ఏంటంటే,+ దహనబలి జంతువును వధించే చోటే+ పాపపరిహారార్థ బలి జంతువును కూడా యెహోవా ముందు వధించాలి. అది అతి పవిత్రమైనది.
26 పాపానికి ప్రాయశ్చిత్తంగా దాన్ని అర్పించే యాజకుడే దాన్ని తింటాడు.+ ప్రత్యక్ష గుడారపు ప్రాంగణంలో ఒక పవిత్రమైన చోట దాన్ని తినాలి.+
27 “ ‘దాని మాంసానికి తగిలే ప్రతీది పవిత్రం అవుతుంది. దాని రక్తంలో కొంచెం ఎవరి వస్త్రం మీదైనా పడితే, రక్తం పడిన ఆ వస్త్రాన్ని ఒక పవిత్రమైన చోట ఉతకాలి.
28 ఆ మాంసాన్ని ఉడకబెట్టిన మట్టి కుండను పగలగొట్టాలి. కానీ దాన్ని ఒకవేళ రాగి గిన్నెలో ఉడకబెట్టి ఉంటే, ఆ గిన్నెను బాగా తోమి నీళ్లతో కడగాలి.
29 “ ‘యాజకుడైన ప్రతీ పురుషుడు దాన్ని తింటాడు.+ అది అతి పవిత్రమైనది.
30 అయితే, పవిత్ర స్థలంలో ప్రాయశ్చిత్తం చేయడానికి పాపపరిహారార్థ బలి రక్తంలో కొంత ప్రత్యక్ష గుడారంలోకి తీసుకొచ్చి ఉంటే, ఆ అర్పణను తినకూడదు.+ దాన్ని అగ్నితో కాల్చేయాలి.
అధస్సూచీలు
^ లేదా “కొవ్వు బూడిదను,” అంటే, బలి ఇచ్చే జంతువుల కొవ్వులో నానిన బూడిదను.
^ లేదా “లోదుస్తుల్ని.”
^ లేదా “శాంతపర్చే.”
^ లేదా “ప్రాతినిధ్య.”
^ లేదా “ఆ అర్పణలకు.”
^ అప్పట్లో ఈఫాలో పదోవంతు 2.2 లీటర్లతో (1.3 కిలోలతో) సమానం. అనుబంధం B14 చూడండి.
^ లేదా “శాంతపర్చే.”