లేవీయకాండం 7:1-38

  • అర్పణల గురించి నిర్దేశాలు (1-21)

    • అపరాధ పరిహారార్థ బలి (1-10)

    • సమాధానబలి (11-21)

  • కొవ్వును, రక్తాన్ని తినకూడదు (22-27)

  • యాజకుల భాగం (28-36)

  • అర్పణల గురించి ముగింపు మాట (37, 38)

7  “ ‘అపరాధ పరిహారార్థ బలి గురించిన నియమం ఇదే:+ ఆ బలి అతి పవిత్రమైనది.  వాళ్లు దహనబలి జంతువుల్ని వధించే చోటే అపరాధ పరిహారార్థ బలి జంతువును కూడా వధిస్తారు. దాని రక్తాన్ని+ బలిపీఠానికి అన్నివైపులా చిలకరించాలి.+  అతను ఏమేమి అర్పిస్తాడంటే: దాని కొవ్వంతా,+ దాని కొవ్విన తోక, పేగుల దగ్గరున్న కొవ్వు,  రెండు మూత్రపిండాలు, వాటిమీద తుంట్ల దగ్గరున్న కొవ్వు. అంతేకాదు మూత్రపిండాలతోపాటు కాలేయం మీదున్న కొవ్వును కూడా అతను వేరుచేస్తాడు.+  యాజకుడు వాటిని యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణగా బలిపీఠం మీద పొగ పైకిలేచేలా కాలుస్తాడు.+ ఇది అపరాధ పరిహారార్థ బలి.  యాజకుడైన ప్రతీ పురుషుడు దాన్ని తింటాడు,+ దాన్ని ఒక పవిత్రమైన చోట తినాలి. అది అతి పవిత్రమైనది.+  పాపపరిహారార్థ బలి గురించిన నియమం అపరాధ పరిహారార్థ బలికి కూడా వర్తిస్తుంది; దానితో ప్రాయశ్చిత్తం చేసే యాజకునికి అది చెందుతుంది.+  “ ‘యాజకుడు ఎవరి కోసమైనా దహనబలి అర్పిస్తున్నప్పుడు, దహనబలి అర్పించడానికి తన దగ్గరికి తీసుకొచ్చిన ఆ జంతువు చర్మం+ ఆ యాజకునికే చెందుతుంది.  “ ‘పొయ్యిలో గానీ మూకుడులో గానీ పెనం మీద గానీ కాల్చిన ప్రతీ ధాన్యార్పణ,+ దాన్ని అర్పించే యాజకునికి చెందుతుంది. అది అతనిది అవుతుంది.+ 10  కానీ నూనె కలిపిన ధాన్యార్పణ,+ పొడిగా ఉన్న ధాన్యార్పణ+ అహరోను కుమారులందరికీ చెందుతుంది; వాళ్లందరూ దాన్ని సమానంగా పంచుకోవాలి. 11  “ ‘ఒక వ్యక్తి యెహోవాకు అర్పించే సమాధానబలి గురించిన నియమం ఇదే:+ 12  ఒకవేళ అతను తన కృతజ్ఞతను తెలపడానికి దాన్ని అర్పిస్తుంటే,+ అతను తన కృతజ్ఞతార్పణతో పాటు పులవని పిండితో చేసి నూనె కలిపిన భక్ష్యాల్ని,* పులవని పిండితో చేసి నూనె పూసిన అప్పడాల్ని, బాగా నూనె పట్టించిన మెత్తని పిండితో చేసిన భక్ష్యాల్ని* తీసుకొస్తాడు. 13  అతను తన అర్పణను పులిసిన పిండితో చేసిన భక్ష్యాలతో* పాటు, కృతజ్ఞతార్పణగా ఇస్తున్న సమాధాన బలులతో పాటు అర్పిస్తాడు. 14  అతను తన అర్పణలోని ప్రతీదాని నుండి ఒకటి తీసి యెహోవాకు పవిత్రమైన భాగంగా అర్పించాలి; అది సమాధాన బలుల రక్తాన్ని చిలకరించే యాజకునికి చెందుతుంది.+ 15  కృతజ్ఞతార్పణగా ఇచ్చిన సమాధానబలి మాంసాన్ని ఆ బలి అర్పించిన రోజే అతను తినాలి. తెల్లారేవరకు దానిలో ఏమీ మిగుల్చుకోకూడదు.+ 16  “ ‘ఒకవేళ అతను అర్పించే బలి మొక్కుబడి+ గానీ స్వేచ్ఛార్పణ+ గానీ అయితే, ఆ బలి అర్పించిన రోజు దాన్ని తినాలి, ఏమైనా మిగిలితే తర్వాతి రోజు కూడా తినవచ్చు. 17  కానీ ఆ బలి మాంసంలో ఏమైనా మూడో రోజు వరకు మిగిలితే దాన్ని అగ్నితో కాల్చేయాలి.+ 18  సమాధానబలి మాంసంలో మిగిలినదాన్ని ఎవరైనా మూడో రోజున తింటే, దాన్ని అర్పించిన వ్యక్తి దేవుని ఆమోదం పొందడు. ఆ బలి వల్ల అతనికి ఏ ప్రయోజనమూ ఉండదు; అది అసహ్యకరమైనది, అలా మిగిలినదాన్ని తినే వ్యక్తి తాను చేసిన తప్పుకు శిక్ష పొందుతాడు.+ 19  ఏదైనా అపవిత్రమైన దాన్ని తాకిన మాంసాన్ని తినకూడదు. దాన్ని అగ్నితో కాల్చేయాలి. పవిత్రంగా ఉన్న ప్రతీ ఒక్కరు పవిత్రమైన మాంసాన్ని తినవచ్చు. 20  “ ‘కానీ యెహోవాకు చెందిన సమాధానబలి మాంసాన్ని అపవిత్రంగా ఉన్న వ్యక్తి తింటే అతను తన ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి.*+ 21  అపవిత్రమైన దేన్నైనా, అంటే అపవిత్రమైన వ్యక్తిని+ గానీ, అపవిత్రమైన జంతువును+ గానీ, అపవిత్రమైన అసహ్యకరమైన ఇంకేదైనా+ గానీ ముట్టుకున్న వ్యక్తి యెహోవాకు చెందిన సమాధానబలి మాంసాన్ని తింటే, అతను తన ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి.’ ”* 22  యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 23  “నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘మీరు ఎద్దు కొవ్వును గానీ, గొర్రె కొవ్వును గానీ, మేక కొవ్వును గానీ ఏమాత్రం తినకూడదు.+ 24  చచ్చిన జంతువు కొవ్వును, ఇంకో జంతువు చేత చీల్చబడిన జంతువు కొవ్వును మీరు వేరే పనులకు ఉపయోగించవచ్చు కానీ ఎన్నడూ దాన్ని తినకూడదు.+ 25  ఎందుకంటే, యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణగా తాను తీసుకొచ్చిన జంతువు కొవ్వును తినే ప్రతీ వ్యక్తి తన ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి.* 26  “ ‘మీ నివాసాలన్నిట్లో మీరు దేని రక్తాన్నీ తినకూడదు.+ అది పక్షుల రక్తమైనా, జంతువుల రక్తమైనా మీరు దాన్ని తినకూడదు. 27  ఎవరైనా దేని రక్తాన్నైనా తింటే, అతను తన ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి.’ ”*+ 28  యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు: 29  “నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘యెహోవాకు సమాధానబలి తీసుకొచ్చే వ్యక్తి తన సమాధానబలిలో ఒక భాగాన్ని యెహోవాకు అర్పణగా తీసుకురావాలి. 30  అతను స్వయంగా తన చేతులతో ఆ జంతువు కొవ్వును, దాని ఛాతి భాగాన్ని యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణగా తీసుకొస్తాడు. అతను దాన్ని అల్లాడించే అర్పణగా యెహోవా ఎదుట ముందుకు, వెనుకకు కదిలిస్తాడు.+ 31  యాజకుడు ఆ కొవ్వును బలిపీఠం మీద పొగ పైకిలేచేలా కాలుస్తాడు;+ అయితే దాని ఛాతి భాగం మాత్రం అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది. 32  “ ‘మీరు మీ సమాధానబలి జంతువుల కుడి కాలును పవిత్రమైన భాగంగా యాజకునికి ఇస్తారు. 33  అహరోను కుమారుల్లో ఎవరైతే సమాధాన బలుల రక్తాన్ని, వాటి కొవ్వును అర్పిస్తారో, అతను ఆ కుడి కాలును తన భాగంగా తీసుకుంటాడు.+ 34  ఎందుకంటే, ఇశ్రాయేలీయులు తమ సమాధాన బలుల్లో అల్లాడించే అర్పణగా ఇచ్చే ఛాతి భాగాన్ని, పవిత్రమైన భాగంగా ఇచ్చే కాలును నేను తీసుకొని యాజకుడైన అహరోనుకు, అతని కుమారులకు ఇస్తాను. ఇది ఇశ్రాయేలీయులు ఎప్పటికీ పాటించాల్సిన శాసనం.+ 35  “ ‘యెహోవాకు యాజకులుగా సేవచేయడానికి తీసుకురాబడిన రోజున, యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణల్లో నుండి యాజకులైన అహరోను కోసం, అతని కుమారుల కోసం+ పక్కకు పెట్టాల్సిన భాగం అది. 36  వాళ్లు అభిషేకించబడిన రోజున, ఇశ్రాయేలీయులు తీసుకొచ్చే బలుల్లో నుండి ఆ భాగాన్ని వాళ్లకు ఇవ్వాలని యెహోవా ఆజ్ఞాపించాడు. ఇది ఇశ్రాయేలీయులు తరతరాలు పాటించాల్సిన శాశ్వత శాసనం.’ ” 37  దహనబలి,+ ధాన్యార్పణ,+ పాపపరిహారార్థ బలి,+ అపరాధ పరిహారార్థ బలి,+ ప్రతిష్ఠాపన బలి,+ సమాధానబలి+ గురించిన నియమాలు ఇవి. 38  సీనాయి పర్వతం మీద యెహోవా ఆ నియమాల్ని మోషేకు ఇచ్చాడు. యెహోవాకు అర్పణల్ని అర్పించమని సీనాయి ఎడారిలో* ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన రోజున వాటిని ఇచ్చాడు.

అధస్సూచీలు

వడ ఆకారంలో ఉన్న రొట్టెలు.
వడ ఆకారంలో ఉన్న రొట్టెలు.
వడ ఆకారంలో ఉన్న రొట్టెలు.
లేదా “చంపబడాలి.”
లేదా “చంపబడాలి.”
లేదా “చంపబడాలి.”
లేదా “చంపబడాలి.”
పదకోశం చూడండి.