లేవీయకాండం 9:1-24

  • అహరోను ప్రతిష్ఠాపన అర్పణల్ని ​అర్పించడం (1-24)

9  ఎనిమిదో రోజున+ మోషే అహరోనును, అతని కుమారుల్ని, ఇశ్రాయేలు పెద్దల్ని పిలిపించాడు.  అతను అహరోనుతో ఇలా అన్నాడు: “నీకోసం పాపపరిహారార్థ బలిగా ఏ లోపంలేని దూడను,+ దహనబలిగా ఏ లోపంలేని ఒక పొట్టేలును తీసుకొని యెహోవా ముందుకు రా.  అయితే నువ్వు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘పాపపరిహారార్థ బలి కోసం ఏ లోపంలేని మేకపోతును; దహనబలి కోసం ఏ లోపంలేని ఏడాది దూడను, ఏడాది పొట్టేలును;  సమాధాన బలుల+ కోసం ఒక ఎద్దును, ఒక పొట్టేలును; నూనె కలిపిన ధాన్యార్పణను+ తీసుకురండి, వాటిని యెహోవా ముందు అర్పించాలి. ఎందుకంటే ఈ రోజు యెహోవా మీకు కనిపిస్తాడు.’ ”+  కాబట్టి వాళ్లు మోషే తమకు ఆజ్ఞాపించినవాటిని ప్రత్యక్ష గుడారం ముందుకు తీసుకొచ్చారు. తర్వాత ఇశ్రాయేలీయులందరూ ముందుకొచ్చి యెహోవా ఎదుట నిలబడ్డారు.  అప్పుడు మోషే ఇలా అన్నాడు: “యెహోవా మహిమ మీకు కనిపించేలా+ మీరు ఇలా చేయాలని యెహోవా ఆజ్ఞాపించాడు.”  తర్వాత మోషే అహరోనుతో ఇలా అన్నాడు: “యెహోవా ఆజ్ఞాపించినట్టే, బలిపీఠం దగ్గరికి వెళ్లి నీ పాపపరిహారార్థ బలిని,+ నీ దహనబలిని అర్పించి నీ కోసం, నీ ఇంటివాళ్ల కోసం ప్రాయశ్చిత్తం చేయి;+ ఆ తర్వాత ప్రజల అర్పణను అర్పించి+ వాళ్లకోసం ప్రాయశ్చిత్తం చేయి.”+  అహరోను వెంటనే బలిపీఠం దగ్గరికి వెళ్లి, తన పాపాల కోసం పాపపరిహారార్థ బలిగా అర్పించాల్సిన దూడను వధించాడు.+  అప్పుడు అహరోను కుమారులు ఆ రక్తాన్ని+ అతని దగ్గరికి తీసుకొచ్చారు. అతను తన వేలిని ఆ రక్తంలో ముంచి బలిపీఠం కొమ్ములకు పూశాడు, మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగుభాగాన పోశాడు.+ 10  అతను పాపపరిహారార్థ బలి జంతువు కొవ్వును, దాని మూత్రపిండాల్ని, కాలేయం మీదున్న కొవ్వును తీసుకొని బలిపీఠం మీద పొగ పైకిలేచేలా కాల్చాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే అతను చేశాడు.+ 11  అతను దాని మాంసాన్ని, చర్మాన్ని పాలెం బయట అగ్నితో కాల్చేశాడు.+ 12  తర్వాత అతను దహనబలి జంతువును వధించాడు. అహరోను కుమారులు దాని రక్తాన్ని అతని చేతికి ఇచ్చారు. అతను ఆ రక్తాన్ని బలిపీఠానికి అన్నివైపులా చిలకరించాడు.+ 13  వాళ్లు దహనబలి జంతువు ముక్కల్ని, దాని తలను అతని చేతికి ఇచ్చారు, అతను వాటిని బలిపీఠం మీద పొగ పైకిలేచేలా కాల్చాడు. 14  తర్వాత అతను దాని పేగుల్ని, కాళ్లను* కడిగి వాటిని బలిపీఠంపై ఉన్న దహనబలి మీద పెట్టి పొగ పైకిలేచేలా కాల్చాడు. 15  తర్వాత అతను ప్రజల అర్పణను అర్పించాడు; అతను ప్రజల పాపాల కోసం పాపపరిహారార్థ బలిగా అర్పించాల్సిన మేకను వధించి, మొదటి అర్పణలాగే దీనితో పాపపరిహారార్థ బలి అర్పించాడు. 16  ఆ తర్వాత అతను దహనబలి జంతువును తీసుకొచ్చి ఎప్పుడూ అర్పించే పద్ధతిలోనే అర్పించాడు.+ 17  తర్వాత అతను ధాన్యార్పణను అర్పించాడు.+ అతను దానిలో కొంచెం పిడికిలి నిండా తీసుకొని బలిపీఠం మీద పొగ పైకిలేచేలా కాల్చాడు. ఇది ఉదయం అర్పించిన దహనబలికి అదనంగా అర్పించిన అర్పణ.+ 18  తర్వాత అతను ప్రజల కోసం సమాధానబలిగా అర్పించాల్సిన ఎద్దును, పొట్టేలును వధించాడు. అప్పుడు అహరోను కుమారులు దాని రక్తాన్ని అతని చేతికి ఇచ్చారు, అతను దాన్ని బలిపీఠానికి అన్నివైపులా చిలకరించాడు.+ 19  అయితే ఆ ఎద్దు కొవ్వును,+ పొట్టేలు కొవ్విన తోకను, పేగుల దగ్గరున్న కొవ్వును, మూత్రపిండాల్ని, కాలేయం మీదున్న కొవ్వును+ తీసుకొని 20  వాళ్లు ఆ జంతువుల ఛాతి భాగాలపై పెట్టారు. తర్వాత అతను ఆ కొవ్వును బలిపీఠం మీద పొగ పైకిలేచేలా కాల్చాడు.+ 21  అహరోను ఆ ఛాతి భాగాల్ని, కుడి కాలును తీసుకొని యెహోవా ముందు అల్లాడించే అర్పణగా ముందుకు, వెనుకకు కదిలించాడు. మోషే ఆజ్ఞాపించినట్టే అతను చేశాడు.+ 22  తర్వాత అహరోను పాపపరిహారార్థ బలిని, దహనబలిని, సమాధాన బలుల్ని అర్పించడం ముగించి, ప్రజల వైపు తన చేతులు ఎత్తి వాళ్లను దీవించి+ కిందికి దిగాడు. 23  చివరిగా మోషే, అహరోనులు ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్లారు, ఆ తర్వాత బయటికి వచ్చి ప్రజల్ని దీవించారు.+ అప్పుడు యెహోవా మహిమ ప్రజలందరికీ కనిపించింది.+ 24  యెహోవా దగ్గర నుండి అగ్ని బయల్దేరి+ బలిపీఠం మీదున్న దహనబలిని, కొవ్వును దహించడం మొదలుపెట్టింది. ప్రజలందరూ దాన్ని చూసినప్పుడు సంతోషంతో కేకలు వేయడం మొదలుపెట్టి, నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశారు.+

అధస్సూచీలు

ఇది మోకాలు కింది భాగాన్ని సూచిస్తోంది.