విలాపవాక్యాలు 1:1-22

  • యెరూషలేము విధవరాలితో పోల్చబడింది

    • ఆమె ఒంటరిగా ఉంది, వదిలేయబడింది (1)

    • సీయోను ఘోరమైన పాపాలు (8, 9)

    • దేవుడు సీయోనును తిరస్కరించడం (12-15)

    • సీయోనును ఓదార్చేవాళ్లు ఎవ్వరూ లేరు (17)

א [ఆలెఫ్‌]* 1  అయ్యో, ఒకప్పుడు ప్రజలతో నిండివున్న నగరం+ ఇప్పుడు ఒంటరిగా కూర్చుందే! దేశాల మధ్య ప్రసిద్ధికెక్కిన*+ ఆమె ఇప్పుడు విధవరాలు అయ్యిందే! ఆయా సంస్థానాల మధ్య రాకుమారిగా ఉన్న ఆమె ఇప్పుడు వెట్టిచాకిరి చేస్తోందే!+ ב [బేత్‌]   రాత్రిపూట ఆమె వెక్కివెక్కి ఏడుస్తోంది, ఆమె చెంపల మీద కన్నీళ్లు కారుతున్నాయి. ఆమె ప్రియులందర్లో ఆమెను ఓదార్చేవాళ్లు ఒక్కరూ లేరు.+ ఆమె సహవాసులంతా ఆమెకు ద్రోహం చేశారు; వాళ్లు ఆమెకు విరోధులయ్యారు. ג [గీమెల్‌]   యూదా చెరలోకి వెళ్లింది;+ కష్టాల్లోకి, కఠిన బానిసత్వంలోకి వెళ్లింది.+ ఆమె దేశాల మధ్య నివసించాలి;+ ఆమెకు విశ్రాంతి లేదు. ఆమెను హింసించేవాళ్లు కష్టకాలంలో ఆమెను తరిమి పట్టుకున్నారు. ד [దాలెత్‌]   పండుగకు ఎవ్వరూ రాకపోవడం వల్ల సీయోనుకు వెళ్లే దారులు విలపిస్తున్నాయి.+ ఆమె ద్వారాలన్నీ పాడైపోయాయి;+ ఆమె యాజకులు నిట్టూరుస్తున్నారు. ఆమె కన్యలు* రోదిస్తున్నారు, ఆమె తీవ్రంగా వేదన పడుతోంది. ה [హే]   ఆమె విరోధులు ఇప్పుడు ఆమెకు యజమానులు అయ్యారు; ఆమె శత్రువులు నిశ్చింతగా ఉన్నారు.+ ఆమె చేసిన ఎన్నో అపరాధాల్ని బట్టి యెహోవా ఆమెకు దుఃఖం కలిగించాడు.+ శత్రువు ఆమె పిల్లల్ని చెరలోకి తీసుకెళ్లాడు.+ ו [వావ్‌]   సీయోను కూతురి వైభవమంతా పోయింది.+ ఆమె అధిపతులు పచ్చిక దొరకని దుప్పిలా ఉన్నారు,వెంటాడేవాడి ముందు వాళ్లు నీరసంగా పారిపోతున్నారు. ז [జాయిన్‌]   ఇల్లు లేకుండా కష్టాలు పడుతున్న రోజుల్లోయెరూషలేము ఒకప్పుడు తనకున్న అమూల్యమైన వాటన్నిటినీ+ గుర్తుచేసుకుంటోంది. ఆమె ప్రజలు శత్రువు చేతికి చిక్కినప్పుడు, ఆమెకు సహాయం చేసేవాళ్లెవ్వరూ లేనప్పుడు+శత్రువులు ఆమెను చూసి ఆమె పతనాన్ని బట్టి నవ్వారు.+ ח [హేత్‌]   యెరూషలేము ఘోరంగా పాపం చేసింది.+ అందుకే ఆమె హీన స్థితికి చేరుకుంది. ఒకప్పుడు ఆమెను గౌరవించిన వాళ్లంతా ఇప్పుడు నీచంగా చూస్తున్నారు; ఎందుకంటే వాళ్లు ఆమె మానం చూశారు.+ ఆమె మూలుగుతూ+ సిగ్గుతో ముఖం పక్కకు తిప్పుకుంటోంది. ט [తేత్‌]   ఆమె అపవిత్రత ఆమె బట్టలకు అంటుకుంది. ఆమె తన భవిష్యత్తు గురించి ఏమాత్రం ఆలోచించలేదు.+ ఆమె పతనం ఆశ్చర్యం కలిగించేలా ఉంది; ఆమెను ఓదార్చేవాళ్లు ఎవ్వరూ లేరు. యెహోవా, నా కష్టాన్ని చూడు; శత్రువు తనను తాను హెచ్చించుకున్నాడు.+ י [యోద్‌] 10  శత్రువు ఆమె సంపదలన్నిటి మీద చెయ్యి వేశాడు.+ నీ సమాజంలోకి ప్రవేశించకూడదని నువ్వు ఆజ్ఞాపించిన దేశాలుతన పవిత్రమైన స్థలంలో అడుగుపెట్టడం ఆమె చూసింది.+ כ [కఫ్‌] 11  ఆమె ప్రజలంతా నిట్టూరుస్తున్నారు; వాళ్లు ఆహారం కోసం చూస్తున్నారు.+ కేవలం బ్రతికుండడం కోసం ఆహారం కొనుక్కోవడానికి తమ విలువైనవాటిని ఇచ్చేశారు. యెహోవా, ఇదిగో చూడు, నేను పనికిరాని స్త్రీని* అయ్యాను. ל [లామెద్‌] 12  దారిన పోతున్న మీకందరికీ ఇదేమీ పట్టదా? ఇదిగో చూడండి! నాకు కలిగిన బాధలాంటి బాధ ఏదైనా ఉందా?తన కోపాగ్ని కుమ్మరించిన రోజున, యెహోవా నాకు కలిగించిన బాధలాంటి బాధ ఏదైనా ఉందా?+ מ [మేమ్‌] 13  ఆయన పైనుండి నా ఎముకల్లోకి అగ్నిని పంపించాడు,+ వాటిలో ప్రతీదాన్ని లోబర్చుకుంటున్నాడు. ఆయన నా పాదాల కోసం ఒక వల పరిచాడు; నేను బలవంతంగా వెనక్కి వెళ్లిపోయేలా చేశాడు. ఆయన నన్ను వదిలేయబడిన స్త్రీలా చేశాడు. నేను రోజంతా జబ్బుతో బాధపడుతున్నాను. נ [నూన్‌] 14  నా అపరాధాలు కాడిలా కట్టబడ్డాయి, ఆయన తన చేతితో వాటిని గట్టిగా కట్టాడు. ఆయన వాటిని నా మెడ మీద పెట్టాడు, నా బలం క్షీణించింది. నేను ఎదిరించలేనివాళ్ల చేతికి యెహోవా నన్ను అప్పగించాడు.+ ס [సామెఖ్‌] 15  నాలోని బలాఢ్యులందర్నీ యెహోవా పక్కకు విసిరేశాడు.+ నా యువకుల్ని నలగ్గొట్టడానికి నా మీదికి ఒక సమూహాన్ని రప్పించాడు.+ యూదా కన్యను యెహోవా ద్రాక్షతొట్టిలో వేసి తొక్కాడు.+ ע [అయిన్‌] 16  వీటన్నిటి వల్ల నేను ఏడుస్తున్నాను;+ నా కళ్లలో నుండి కన్నీళ్లు వరదలా పారుతున్నాయి. నాకు ఓదార్పును, సేదదీర్పును ఇవ్వగలిగేవాళ్లు దూరంగా ఉన్నారు. శత్రువు పైచేయి సాధించడంతో నా పిల్లలు దిక్కులేనివాళ్లు అయ్యారు. פ [పే] 17  సీయోను చేతులు చాపింది;+ ఆమెను ఓదార్చేవాళ్లు ఎవ్వరూ లేరు. యాకోబు చుట్టూ ఉన్నవాళ్లంతా అతని శత్రువుల్లా ప్రవర్తించాలని యెహోవా ఆదేశించాడు.+ యెరూషలేము వాళ్లకు అసహ్యమైనదిగా తయారైంది.+ צ [సాదె] 18  నన్ను శిక్షించినా యెహోవా నీతిమంతుడే,+ ఎందుకంటే నేనే ఆయన ఆజ్ఞలకు* ఎదురుతిరిగాను.+ దేశదేశాల ప్రజలారా, మీరంతా వినండి, నా బాధను చూడండి. నా కన్యలు,* యువకులు చెరలోకి వెళ్లారు.+ ק [ఖొఫ్‌] 19  నేను నా ప్రియుల్ని పిలిచాను, కానీ వాళ్లు నన్ను మోసం చేశారు.+ బ్రతికుండడానికి ఆహారం కోసం వెతుకుతూ వెతుకుతూనా యాజకులు, పెద్దలు నగరంలో నశించిపోయారు.+ ר [రేష్‌] 20  యెహోవా, చూడు, నేను పెద్ద కష్టంలో ఉన్నాను. నా అంతరంగం* అల్లకల్లోలంగా ఉంది. నా హృదయం వేదన పడుతోంది, నేను ఘోరంగా తిరుగుబాటు చేశాను.+ బయట ఖడ్గం చంపుతోంది;+ ఇంట్లో కూడా మరణం ఉంది. ש [షీన్‌] 21  ప్రజలు నా నిట్టూర్పులు విన్నారు; నన్ను ఓదార్చేవాళ్లు ఎవ్వరూ లేరు. శత్రువులంతా నా విపత్తు గురించి విన్నారు. నువ్వే దాన్ని రప్పించావని వాళ్లు సంతోషిస్తున్నారు.+ అయితే నువ్వు ప్రకటించిన రోజును తీసుకొస్తావు,+ అప్పుడు వాళ్లు కూడా నాలా అవుతారు.+ ת [తౌ] 22  వాళ్ల చెడుతనమంతా నీ ముందు వెల్లడవ్వాలి,నా అపరాధాలన్నిటిని బట్టి నువ్వు నాతో కఠినంగా వ్యవహరించినట్టే వాళ్లతో కూడా కఠినంగా వ్యవహరించాలి.+ నేను ఎంతగానో నిట్టూరుస్తున్నాను, నా హృదయం బలహీనపడింది.

అధస్సూచీలు

1-4 అధ్యాయాలు హీబ్రూ అక్షరక్రమంలో ఉన్న శోకగీతాలు.
లేదా “అధిక జనాభాగల.”
లేదా “యువతులు.”
ఇక్కడ యెరూషలేమును ఒక స్త్రీలా వర్ణించారు.
లేదా “యువతులు.”
అక్ష., “నోటికి.”
అక్ష., “పేగులు.”