విలాపవాక్యాలు 2:1-22

  • యెరూషలేము మీద యెహోవా కోపం

    • ఏమాత్రం కనికరం చూపించలేదు (2)

    • యెహోవా ఆమెకు శత్రువులా ఉన్నాడు (5)

    • సీయోను గురించి కన్నీళ్లు (11-13)

    • ఒకప్పటి అందమైన నగరాన్ని దారిన వెళ్లేవాళ్లు ఎగతాళి చేయడం (15)

    • సీయోను పతనాన్ని చూసి శత్రువులు సంతోషించడం (17)

א [ఆలెఫ్‌] 2  యెహోవా తన కోపం అనే మేఘంతో సీయోను కూతురిని కప్పేశాడు! ఆయన ఇశ్రాయేలు సౌందర్యాన్ని ఆకాశం నుండి భూమ్మీదికి పడేశాడు.+ ఆయన తన ఉగ్రత రోజున తన పాదపీఠాన్ని+ గుర్తుచేసుకోలేదు. ב [బేత్‌]   యెహోవా ఏమాత్రం కనికరం లేకుండా యాకోబు నివాసాలన్నిటినీ మింగేశాడు. తన కోపాన్ని బట్టి యూదా కూతురి ప్రాకారాలుగల స్థలాలన్నిటినీ పడగొట్టాడు.+ రాజ్యాన్ని, ఆమె అధిపతుల్ని నేలకూల్చి, అపవిత్రం చేశాడు.+ ג [గీమెల్‌]   ఆయన కోపావేశంలో ఇశ్రాయేలు ప్రతీ కొమ్మును* నరికేశాడు. శత్రువు సమీపించినప్పుడు ఆయన తన కుడిచేతిని వెనక్కి తీసుకున్నాడు,+చుట్టూ ఉన్న ప్రతీదాన్ని దహించేసే అగ్నిలా ఆయన కోపం యాకోబులో మండుతూ వచ్చింది.+ ד [దాలెత్‌]   శత్రువులా ఆయన తన విల్లును వంచాడు;* విరోధిలా దాడి చేయడానికి తన కుడిచేతిని సిద్ధం చేశాడు;+మా కళ్లకు ప్రియంగా ఉన్నవాళ్లందర్నీ చంపుతూ వచ్చాడు.+ సీయోను కూతురి డేరాలో+ తన కోపాన్ని అగ్నిలా కుమ్మరించాడు.+ ה [హే]   యెహోవా మాకు శత్రువులా తయారయ్యాడు;+ఆయన ఇశ్రాయేలును మింగేశాడు. ఆమె బురుజులన్నిటినీ మింగేశాడు;ప్రాకారాలుగల ఆమె స్థలాలన్నిటినీ నాశనం చేశాడు. యూదా కూతురిలో ఏడుపు, ప్రలాపం ఎక్కువయ్యేలా చేశాడు. ו [వావ్‌]   తోటలోని గుడిసెను పడగొట్టినట్టు ఆయన తన పర్ణశాలను పడగొట్టాడు.+ తన పండుగను ఆపేశాడు.*+ యెహోవా సీయోనులో పండుగను, విశ్రాంతి రోజును* మర్చిపోయేలా చేశాడు,తన విపరీతమైన కోపాన్ని బట్టి రాజును, యాజకుణ్ణి కూడా ఆయన లెక్క చేయట్లేదు.+ ז [జాయిన్‌]   యెహోవా తన బలిపీఠాన్ని తిరస్కరించాడు;తన పవిత్రమైన స్థలాన్ని నిరాకరించాడు.+ సీయోను పటిష్ఠమైన బురుజుల గోడల్ని శత్రువు చేతికి అప్పగించాడు.+ పండుగ రోజున కేకలు వేసినట్టు వాళ్లు యెహోవా మందిరంలో కేకలు వేశారు.+ ח [హేత్‌]   యెహోవా సీయోను కూతురి ప్రాకారాల్ని నాశనం చేయాలని తీర్మానించుకున్నాడు.+ ఆయన కొలనూలుతో వాటిని కొలిచాడు.+ నాశనం రప్పించకుండా ఆయన తన చేతిని వెనక్కి తీసుకోలేదు. ప్రాకారం, ప్రహరీగోడ విలపించేలా చేస్తున్నాడు. అవి రెండూ పడిపోయాయి. ט [తేత్‌]   ఆమె ద్వారాలు భూమిలోకి కుంగిపోయాయి.+ ఆమె అడ్డగడియల్ని ఆయన నాశనం చేశాడు, విరగ్గొట్టాడు. ఆమె రాజు, ఆమె అధిపతులు వేరే దేశాల్లో ఉన్నారు.+ ధర్మశాస్త్రం* లేదు; చివరికి ఆమె ప్రవక్తలకు కూడా యెహోవా నుండి ఎలాంటి దర్శనమూ రావట్లేదు.+ י [యోద్‌] 10  సీయోను కూతురి పెద్దలు మౌనంగా నేలమీద కూర్చున్నారు.+ వాళ్లు తలల మీద దుమ్ము పోసుకుంటున్నారు, గోనెపట్ట కట్టుకున్నారు.+ యెరూషలేము కన్యలు నేల వరకు తమ తలలు వంచారు. כ [కఫ్‌] 11  ఏడ్చీ ఏడ్చీ నా కళ్లు క్షీణించిపోయాయి.+ నా అంతరంగం* అల్లకల్లోలంగా ఉంది. నా ప్రజల కూతురి* పతనాన్ని బట్టి నా గుండె పగిలిపోయింది,*+ఎందుకంటే చిన్నపిల్లలు, పసివాళ్లు పట్టణ సంతవీధుల్లో సొమ్మసిల్లి పడిపోతున్నారు.+ ל [లామెద్‌] 12  వాళ్లు గాయపడిన వ్యక్తిలా నగర సంతవీధుల్లో సొమ్మసిల్లి పడిపోతూ, తమ తల్లుల ఒడిలో ప్రాణాలు విడుస్తూ,“అమ్మా, ఆకలేస్తోంది, దాహమేస్తోంది!”* అని అంటున్నారు.+ מ [మేమ్‌] 13  యెరూషలేము కూతురా, నేను దేన్ని సాక్ష్యంగా పెట్టను?నువ్వు దేనిలా ఉన్నావని చెప్పను? సీయోను కన్యా, నిన్ను ఓదార్చడానికి దేనితో నిన్ను పోల్చను? నీ నాశనం సముద్రమంత గొప్పది.+ నిన్ను ఎవరు బాగుచేయగలరు?+ נ [నూన్‌] 14  నీ ప్రవక్తలు నీ గురించి చూసిన దర్శనాలు తప్పుడువి, వ్యర్థమైనవి,+నువ్వు చెరలోకి వెళ్లకుండా ఉండేలా వాళ్లు నీ తప్పుల్ని బయటపెట్టలేదు,+బదులుగా వాళ్లు నీకు తప్పుడు దర్శనాల్ని, మోసపూరిత దర్శనాల్ని చెప్తూ వచ్చారు.+ ס [సామెఖ్‌] 15  దారిన వెళ్లేవాళ్లందరూ నిన్ను ఎగతాళి చేస్తూ చప్పట్లు కొడుతున్నారు.+ ఆశ్చర్యంతో ఈల వేస్తూ,+ యెరూషలేము కూతుర్ని చూసి తలలు ఆడిస్తూ ఇలా అంటున్నారు: “ ‘అది పరిపూర్ణ సౌందర్యం గలది, భూమంతటికీ సంతోష కారణం’ అని ప్రజలు చెప్పుకున్న నగరం ఇదేనా?”+ פ [పే] 16  నీ శత్రువులంతా నీ వైపు నోళ్లు తెరిచారు. వాళ్లు ఈల వేస్తూ, పళ్లు కొరుకుతూ ఇలా అంటున్నారు: “మనం దాన్ని మింగేశాం.+ ఈ రోజు కోసమే మనం ఎదురుచూశాం!+ అది వచ్చేసింది, మనం దాన్ని చూశాం!”+ ע [అయిన్‌] 17  యెహోవా తాను అనుకున్నది చేశాడు;+ తన మాటను,చాలాకాలం క్రితం తాను ఆజ్ఞాపించిన దాన్ని+ నెరవేర్చాడు.+ ఆయన కనికరం చూపించకుండా నాశనం చేశాడు.+ శత్రువు నీ పతనాన్ని చూసి సంతోషించేలా ఆయన చేశాడు; ఆయన నీ విరోధుల బలాన్ని* హెచ్చించాడు. צ [సాదె] 18  సీయోను కూతురి ప్రాకారమా, వాళ్ల హృదయం యెహోవాకు మొరపెడుతోంది. రాత్రింబగళ్లు కన్నీళ్లు వరదలా ప్రవహించనీ. ఏమాత్రం విరామం తీసుకోకు, నీ కంటికి* విశ్రాంతినివ్వకు. ק [ఖొఫ్‌] 19  లే! రాత్రంతా* ఏడుస్తూ ఉండు. నీ హృదయాన్ని యెహోవా ముఖం ఎదుట నీళ్లలా కుమ్మరించు. కరువువల్ల ప్రతీ వీధి మూల దగ్గర సొమ్మసిల్లి పడిపోతున్ననీ పిల్లల ప్రాణాల కోసం+ చేతులెత్తి ఆయన్ని వేడుకో. ר [రేష్‌] 20  యెహోవా, ఇదిగో, నువ్వు ఎంతో కఠినంగా వ్యవహరించిన నీ ప్రజల వైపు చూడు. స్త్రీలు తమ కన్న బిడ్డల్ని,* ఆరోగ్యంగా పుట్టిన తమ పిల్లల్ని తింటూనే ఉండాలా?+యాజకులు, ప్రవక్తలు యెహోవా పవిత్రమైన స్థలంలో చంపబడాలా?+ ש [షీన్‌] 21  పిల్లలు, వృద్ధులు చనిపోయి వీధుల్లో నేలమీద పడివున్నారు.+ నా కన్యలు,* యువకులు కత్తి పాలయ్యారు.+ నీ ఉగ్రత రోజున నువ్వు వాళ్లను చంపావు; కనికరం లేకుండా వధించావు.+ ת [తౌ] 22  పండుగ రోజు కోసం అన్నట్టు,+ నువ్వు అన్నివైపుల నుండి భయాల్ని పిలిపిస్తున్నావు. యెహోవా ఉగ్రత రోజున ఎవ్వరూ తప్పించుకోలేదు, బ్రతికి బయటపడలేదు;+నేను కని,* పెంచిన వాళ్లను నా శత్రువు సమూలనాశనం చేశాడు.+

అధస్సూచీలు

లేదా “బలాన్నంతటినీ.”
అక్ష., “తొక్కాడు.”
లేదా “సబ్బాతును.”
లేదా “నాశనం చేశాడు.”
లేదా “ఉపదేశం.”
అక్ష., “పేగులు.”
అక్ష., “నా కాలేయం భూమి మీదికి ఒలికింది.”
బహుశా జాలిని లేదా సానుభూతిని కావ్యరూపంలో ఇలా వ్యక్తం చేసివుండవచ్చు.
అక్ష., “ధాన్యం, ద్రాక్షారసం ఎక్కడ?”
అక్ష., “కొమ్మును.”
అక్ష., “నీ కనుపాపకు.”
అక్ష., “రాత్రివేళ, జాముల ఆరంభంలో.”
లేదా “ఫలాన్ని.”
లేదా “యువతులు.”
లేదా “ఆరోగ్యంగా కని.”