విలాపవాక్యాలు 3:1-66

  • యిర్మీయా తన భావాల్ని, ఆశను వ్యక్తం చేయడం

    • “నీ కోసం ఓపిగ్గా ఎదురుచూస్తాను” (21)

    • దేవుడు ప్రతీ ఉదయం సరికొత్తగా కరుణ చూపిస్తాడు (22, 23)

    • తన మీద ఆశపెట్టుకునే వాళ్లకు దేవుడు మంచి చేస్తాడు (25)

    • యౌవనంలో కాడి మోయడం మంచిది (27)

    • దేవుడు మేఘాన్ని అడ్డుపెట్టడం (43, 44)

א [ఆలెఫ్‌] 3  ఆయన ఉగ్రత దండం వల్ల ప్రజలు కష్టాలు పడడం చూసినవాణ్ణి నేనే.   ఆయన నన్ను వెళ్లగొట్టి, వెలుగులో కాకుండా చీకట్లో నడిచేలా చేస్తున్నాడు.+   నిజానికి, రోజంతా ఆయన చెయ్యి నాకు వ్యతిరేకంగా ఉంది.+ ב [బేత్‌]   ఆయన నా మాంసాన్ని, చర్మాన్ని కృశించిపోయేలా చేశాడు;నా ఎముకల్ని విరగ్గొట్టాడు.   ఆయన నన్ను ముట్టడించాడు; నా చుట్టూ విషపు మొక్కల్ని,*+ కష్టాల్ని ఉంచాడు.   చాలాకాలం క్రితం చనిపోయినవాళ్లలా నన్ను చీకటి స్థలాల్లో కూర్చోబెట్టాడు. ג [గీమెల్‌]   నేను పారిపోకుండా నా చుట్టూ గోడ కట్టాడు;బరువైన రాగి సంకెళ్లతో నన్ను బంధించాడు.+   సహాయం కోసం నేను దీనంగా మొరపెట్టినప్పుడు, ఆయన నా ప్రార్థనను తిరస్కరిస్తున్నాడు.*+   చెక్కుడు రాళ్లను నా దారికి అడ్డంగా పెట్టాడు;నా త్రోవల్ని వంకరగా చేశాడు.+ ד [దాలెత్‌] 10  ఎలుగుబంటిలా, దాక్కొని ఉన్న సింహంలా ఆయన నామీద దాడిచేయడానికి పొంచివున్నాడు.+ 11  ఆయన నన్ను దారిలో నుండి పక్కకు లాగి, ముక్కలుముక్కలుగా చీల్చేశాడు;*నన్ను దిక్కులేనివాణ్ణి చేశాడు.+ 12  తన విల్లును వంచి,* బాణాన్ని నా మీదికి గురి పెట్టాడు. ה [హే] 13  తన అంబులపొదిలోని బాణాలతో* నా మూత్రపిండాల్ని చీల్చేశాడు. 14  అన్నిదేశాల ప్రజలు నన్ను చూసి నవ్వుకుంటున్నారు, రోజంతా నా మీద పాటలు పాడుకుంటున్నారు. 15  ఆయన నాతో చేదైన వాటిని తినిపించాడు, మాచిపత్రిని* తాగించాడు.+ ו [వావ్‌] 16  కంకర రాళ్లతో నా పళ్లు రాలగొట్టాడు;నన్ను బూడిదలో వేసి తొక్కాడు.+ 17  నువ్వు నాకు మనశ్శాంతి లేకుండా చేశావు; మంచిది అంటే ఏంటో నేను మర్చిపోయాను. 18  కాబట్టి నేనిలా అనుకున్నాను: “నా వైభవం, యెహోవా మీద నేను పెట్టుకున్న ఆశ నశించిపోయాయి.” ז [జాయిన్‌] 19  నేను కష్టాల్లో ఉన్నానని, ఇల్లు లేకుండా ఉన్నానని,+ మాచిపత్రిని, విషపుమొక్కల్ని తింటున్నానని+ గుర్తుచేసుకో. 20  నువ్వు తప్పకుండా నన్ను గుర్తుచేసుకుంటావు, నా దగ్గరికి వచ్చి* సహాయం చేస్తావు.+ 21  నా మనసులో ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటున్నాను; అందుకే నీ కోసం ఓపిగ్గా ఎదురుచూస్తాను.+ ח [హేత్‌] 22  యెహోవా విశ్వసనీయ ప్రేమ వల్లే మనం ఇంకా నాశనం కాలేదు,+ఆయన ఎప్పటికీ కరుణ చూపిస్తూనే ఉంటాడు.+ 23  ప్రతీ ఉదయం ఆయన సరికొత్తగా కరుణ చూపిస్తాడు;+ ఆయన ఎప్పుడూ నమ్మదగినవాడు.+ 24  నేనిలా అన్నాను: “యెహోవాయే నా వంతు,+ అందుకే నేను ఆయన కోసం ఓపిగ్గా ఎదురుచూస్తాను.”+ ט [తేత్‌] 25  తన మీద ఆశపెట్టుకునే వాళ్లకు, తనను వెతుకుతూ ఉండేవాళ్లకు+ యెహోవా మంచి చేస్తాడు.+ 26  యెహోవా దయచేసే రక్షణ+ కోసం మౌనంగా* ఎదురుచూడడం మంచిది. 27  యౌవనంలో ఉన్నప్పుడే కాడి మోయడం మంచిది.+ י [యోద్‌] 28  దేవుడు దాన్ని అతని మీద పెట్టినప్పుడు అతను ఒంటరిగా కూర్చొని మౌనంగా ఉండాలి.+ 29  అతను తన ముఖాన్ని మట్టిలో పెట్టాలి;*+ బహుశా అప్పటికీ ఏదైనా ఆశ ఉంటుందేమో.+ 30  తనను కొట్టేవాడికి అతను తన చెంపను చూపించాలి; అతను పూర్తిగా అవమానాలపాలు అవ్వాలి. כ [కఫ్‌] 31  ఎందుకంటే యెహోవా తన ప్రజల్ని శాశ్వతంగా విడిచిపెట్టడు.+ 32  ఆయన దుఃఖం కలిగించినా, తన అపారమైన విశ్వసనీయ ప్రేమను బట్టి కరుణ కూడా చూపిస్తాడు.+ 33  ఆయన మనుషుల్ని బాధపెట్టాలని, దుఃఖపెట్టాలని అనుకోడు.+ ל [లామెద్‌] 34  భూమ్మీది ఖైదీలందర్నీ+ కాళ్ల కింద చితకతొక్కడం, 35  సర్వోన్నతుని సన్నిధిలో న్యాయం చేయకపోవడం,+ 36  వ్యాజ్యంలో మోసం చేయడం లాంటి వాటిని యెహోవా సహించడు. מ [మేమ్‌] 37  యెహోవా ఆజ్ఞాపిస్తే తప్ప, ఒక మాట చెప్పి అది జరిగేలా చేయడం ఎవరివల్ల అవుతుంది? 38  సర్వోన్నతుని నోటి నుండిమంచి విషయాలు, చెడు విషయాలు కలిసి రావు. 39  తాము చేసిన పాపాల పర్యవసానాల గురించి బ్రతికున్నవాళ్లు ఎందుకు ఫిర్యాదు చేయాలి?+ נ [నూన్‌] 40  మన మార్గాల్ని పరిశీలించుకొని, జాగ్రత్తగా పరీక్షించుకొని యెహోవా దగ్గరికి తిరిగెళ్దాం.+ 41  పరలోకంలో ఉన్న దేవుని వైపు మన చేతులతో పాటు మన హృదయాల్ని కూడా ఎత్తి ఇలా వేడుకుందాం:+ 42  “మేము తప్పుచేశాం, తిరుగుబాటు చేశాం; నువ్వు మమ్మల్ని క్షమించలేదు.+ ס [సామెఖ్‌] 43  కోపంతో మమ్మల్ని నీ దగ్గరికి రాకుండా అడ్డుకున్నావు;+కనికరం లేకుండా మమ్మల్ని తరిమి చంపేశావు.+ 44  మా ప్రార్థనలు నిన్ను చేరకుండా, మేము నీ దగ్గరికి రాకుండా మేఘాన్ని అడ్డుపెట్టావు.+ 45  దేశదేశాల ప్రజల మధ్య మమ్మల్ని మురికిలా, చెత్తలా చేశావు.” פ [పే] 46  మా శత్రువులంతా మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.+ 47  మేము ఎప్పుడూ భయపడుతూ ఉన్నాం, ఉచ్చులో చిక్కుకున్నాం,+ దిక్కులేని స్థితిలో ఉన్నాం, నాశనమైపోయాం.+ 48  నా ప్రజల కూతురి పతనాన్ని చూసి నా కళ్లలో నుండి కన్నీళ్లు వరదలా పారుతున్నాయి.+ ע [అయిన్‌] 49  నేను ఆగకుండా ఏడుస్తూ ఉన్నాను,+ 50  యెహోవా ఆకాశం నుండి కిందికి చూసేవరకు+ నేను ఏడుస్తూనే ఉంటాను. 51  నా నగర కూతుళ్లందరికీ* జరిగింది చూసినప్పుడు+ నాకు దుఃఖం కలుగుతోంది. צ [సాదె] 52  కారణం లేకుండానే నా శత్రువులు పక్షిని వేటాడినట్టు నన్ను వేటాడారు. 53  వాళ్లు నన్ను గోతిలో పడేసి నాశనం చేయాలని చూశారు; నా మీదికి రాళ్లు విసురుతూ వచ్చారు. 54  నీళ్లు నా తలమీదుగా ప్రవహించాయి, “నేను నాశనమైపోయాను!” అని అనుకున్నాను. ק [ఖొఫ్‌] 55  యెహోవా, నేను గోతి అట్టడుగు స్థలాల్లో నుండి నీ పేరున మొరపెట్టాను.+ 56  నా స్వరం విను; సహాయం కోసం, ఉపశమనం కోసం నేను పెట్టే మొర వినకుండా నీ చెవి మూసుకోకు. 57  నేను మొరపెట్టిన రోజున నువ్వు దగ్గరికి వచ్చావు. “భయపడకు” అని నాతో అన్నావు. ר [రేష్‌] 58  యెహోవా, నువ్వు నా తరఫున వాదించావు, నా ప్రాణాన్ని విడిపించావు.+ 59  యెహోవా, నాకు జరిగిన అన్యాయం నువ్వు చూశావు; దయచేసి నాకు న్యాయం చేయి.+ 60  వాళ్ల ప్రతీకారాన్ని, వాళ్లు నా మీద పన్నిన పన్నాగాలన్నిటినీ నువ్వు చూశావు. ש [సీన్‌] లేదా [షీన్‌] 61  యెహోవా, వాళ్లు నా మీద వేసిన నిందలు, పన్నిన పన్నాగాలు అన్నీ నీకు తెలుసు;+ 62  నా మీదికి లేచేవాళ్ల మాటల్ని, రోజంతా వాళ్లు నా గురించి చెప్పుకునే గుసగుసల్ని నువ్వు విన్నావు. 63  వాళ్లను చూడు; వాళ్లు కూర్చున్నా, నిల్చున్నా నన్ను ఎగతాళి చేస్తూ పాటలు పాడుతున్నారు! ת [తౌ] 64  యెహోవా, వాళ్ల పనుల్ని బట్టి నువ్వు వాళ్లకు తగిన శాస్తి చేస్తావు. 65  నువ్వు వాళ్ల హృదయాన్ని కఠినం చేస్తావు, అదే నువ్వు వాళ్లకు ఇచ్చే శాపం. 66  యెహోవా, నువ్వు కోపంతో వాళ్లను తరుముతావు, నీ ఆకాశం కింద లేకుండా వాళ్లను సర్వనాశనం చేస్తావు.

అధస్సూచీలు

లేదా “చేదు విషాన్ని.”
లేదా “అడ్డుకుంటున్నాడు.”
లేదా “కదల్లేని స్థితిలో వదిలేశాడు” అయ్యుంటుంది.
అక్ష., “తొక్కి.”
అక్ష., “కుమారులతో.”
పదకోశం చూడండి.
లేదా “కిందికి వంగి.”
లేదా “ఓపిగ్గా.”
లేదా “పూర్తిగా లోబడాలి.”
లేదా “చుట్టుపక్కల పట్టణాలన్నిటికీ.”