సంఖ్యాకాండం 16:1-50

  • కోరహు, దాతాను, అబీరాముల తిరుగుబాటు (1-19)

  • తిరుగుబాటుదారుల మీదికి తీర్పు (20-50)

16  తర్వాత ఇస్హారు కుమారుడూ,+ కహాతు+ మనవడూ, లేవి+ మునిమనవడూ అయిన కోరహు;+ రూబేను+ గోత్రానికి చెందిన ఏలీయాబు కుమారులైన దాతాను, అబీరాములు,+ అలాగే పేలెతు కుమారుడైన ఓను ఒక్కటై  సమాజంలో ప్రధానులు, ఎంపిక చేయబడినవాళ్లు, ప్రముఖులు అయిన 250 మంది ఇశ్రాయేలు పురుషులతో కలిసి మోషే మీద తిరగబడ్డారు.  వాళ్లు మోషే, అహరోనులకు వ్యతిరేకంగా ఒక్కటై+ వాళ్లతో ఇలా అన్నారు: “మా మీద అధికారం చెలాయించింది చాలు! సమాజమంతా, అందులో ఉన్నవాళ్లంతా పవిత్రులే;+ యెహోవా వాళ్ల మధ్య ఉన్నాడు.+ అలాంటప్పుడు యెహోవా సమాజం మీద మిమ్మల్ని మీరు ఎందుకు హెచ్చించుకుంటున్నారు?”  ఆ మాటలు విన్నప్పుడు మోషే నేలమీద సాష్టాంగపడ్డాడు.  తర్వాత అతను కోరహుతో, అతని మద్దతుదారులతో ఇలా అన్నాడు: “తనకు చెందినవాళ్లు ఎవరో,+ ఎవరు పవిత్రులో, ఎవరు తనను సమీపించాలో+ ఉదయం యెహోవా తెలియజేస్తాడు; ఆయన ఎవర్ని ఎంచుకుంటాడో+ వాళ్లే ఆయన్ని సమీపిస్తారు.  కోరహూ! నువ్వూ, నీ మద్దతుదారులూ+ ఇలా చేయండి: మీరు ధూపపాత్రలు* తీసుకొని,+  రేపు యెహోవా ముందు వాటిలో నిప్పు వేసి, దానిమీద ధూపద్రవ్యం వేయండి; యెహోవా ఎవర్ని ఎంచుకుంటాడో+ అతనే పవిత్రుడు. లేవీయులైన మీరు+ హద్దు దాటారు!”  తర్వాత మోషే కోరహుతో ఇలా అన్నాడు: “లేవీయులారా, దయచేసి నా మాట వినండి.  ఇశ్రాయేలు దేవుడు ఇశ్రాయేలీయుల సమాజం నుండి మిమ్మల్ని వేరుచేసి,+ మీరు యెహోవా గుడారం దగ్గర సేవ చేసేలా తనను సమీపించడానికీ, సమాజానికి పరిచారం చేసేలా దాని ముందు నిలబడడానికీ+ మిమ్మల్ని అనుమతించడం మీకు అంత చిన్న విషయంలా అనిపిస్తుందా? 10  ఆయన లేవీయులైన మీ సహోదరులందరితో పాటు మిమ్మల్ని తన దగ్గరికి చేర్చుకోవడం మీకు చిన్న విషయంలా అనిపిస్తుందా? ఇప్పుడు మీరు యాజకత్వాన్ని కూడా చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా?+ 11  ఇలా చేయడం వల్ల నువ్వూ, నీతో చేరిన నీ మద్దతుదారులూ యెహోవాకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇక అహరోను సంగతంటారా, మీరు అతని మీద సణగడానికి అతను ఎంతటివాడు?”+ 12  తర్వాత మోషే ఏలీయాబు కుమారులైన దాతాను, అబీరాములను+ పిలవడానికి మనుషుల్ని పంపించాడు, కానీ వాళ్లు ఇలా అన్నారు: “మేము రాము! 13  ఈ ఎడారిలో మమ్మల్ని చంపాలని నువ్వు పాలుతేనెలు ప్రవహించే దేశం నుండి మమ్మల్ని బయటికి తీసుకురావడం ఏమైనా చిన్న విషయమా?+ అదీగాక, ఇప్పుడు నువ్వొక్కడివే మా మీద రాజ్యమేలాలని* అనుకుంటున్నావా? 14  ఇప్పటివరకూ నువ్వు మమ్మల్ని పాలుతేనెలు ప్రవహించే ఏ దేశానికీ+ తీసుకెళ్లలేదు, పొలాన్ని గానీ ద్రాక్షతోటను గానీ స్వాస్థ్యంగా ఇవ్వలేదు. వాళ్లు* కళ్లు మూసుకొని గుడ్డివాళ్లలా నీ వెనకాల తిరగాలని అనుకుంటున్నావా?* మేము రాము!” 15  దాంతో మోషేకు విపరీతమైన కోపమొచ్చి యెహోవాతో ఇలా అన్నాడు: “వాళ్ల ధాన్యార్పణను అస్సలు చూడకు. నేను వాళ్ల దగ్గర నుండి ఒక్క గాడిదను కూడా తీసుకోలేదు, వాళ్లలో ఒక్కరికి కూడా హానిచేయలేదు.”+ 16  తర్వాత మోషే కోరహుతో ఇలా అన్నాడు: “నువ్వూ, నీ మద్దతుదారులందరూ కలిసి రేపు యెహోవా ముందు కనిపించండి; అహరోను కూడా అక్కడికి వస్తాడు. 17  ప్రతీ వ్యక్తి తన ధూపపాత్ర తీసుకొని, దానిమీద ధూపద్రవ్యం వేసి ఆ ధూపపాత్రను యెహోవా ముందుకు తీసుకురావాలి; మొత్తం 250 ధూపపాత్రల్ని తీసుకురావాలి. నువ్వు, అహరోను కూడా మీ ధూపపాత్రల్ని తీసుకురావాలి.” 18  కాబట్టి వాళ్లలో ప్రతీ ఒక్కరు తమ ధూపపాత్ర తీసుకొని, దానిలో నిప్పు పెట్టి, దానిమీద ధూపద్రవ్యం వేసి మోషే, అహరోనులతో పాటు ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర నిలబడ్డారు. 19  వాళ్లకు వ్యతిరేకంగా కోరహు తన మద్దతుదారుల్ని+ ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర సమావేశపర్చినప్పుడు, యెహోవా మహిమ సమాజమంతటికీ కనిపించింది.+ 20  అప్పుడు యెహోవా మోషే, అహరోనులకు ఇలా చెప్పాడు: 21  “మీరు ఈ గుంపుకు దూరంగా నిలబడండి, నేను ఒక్క క్షణంలో వాళ్లను నాశనం చేస్తాను.”+ 22  దాంతో వాళ్లు నేలమీద సాష్టాంగపడి ఇలా అన్నారు: “దేవా, అందరికీ ప్రాణం* ఇచ్చే దేవా,+ ఒక్క మనిషి చేసిన పాపానికి సమాజమంతటి మీద కోప్పడతావా?”+ 23  అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 24  “నువ్వు సమాజంతో ఇలా చెప్పు: ‘మీరు కోరహు, దాతాను, అబీరాముల డేరాల నుండి దూరంగా వెళ్లండి.’ ”+ 25  తర్వాత మోషే లేచి దాతాను, అబీరాముల దగ్గరికి వెళ్లాడు; అతనితో పాటు ఇశ్రాయేలు పెద్దలు+ కూడా వెళ్లారు. 26  అతను సమాజంతో ఇలా అన్నాడు: “దయచేసి ఈ దుష్టుల డేరాలకు దూరంగా వెళ్లండి, వాళ్లకు చెందిన దేన్నీ ముట్టుకోకండి; లేదంటే వాళ్ల పాపాల్లో మీరు కూడా కొట్టుకుపోతారు.” 27  వెంటనే వాళ్లు కోరహు, దాతాను, అబీరాముల డేరాల దగ్గర నుండి దూరంగా వెళ్లారు; అప్పుడు దాతాను, అబీరాము బయటికి వచ్చి తమ భార్యలతో పాటు, కుమారులతో పాటు, తమ చిన్నపిల్లలతో పాటు తమ డేరాల ప్రవేశ ద్వారం దగ్గర నిలబడ్డారు. 28  అప్పుడు మోషే ఇలా అన్నాడు: “ఇవన్నీ చేయడానికి యెహోవాయే నన్ను పంపించాడని, నా అంతట నేనే చేయట్లేదని దీన్ని బట్టి మీకు తెలుస్తుంది: 29  మనుషులందరూ చనిపోయే విధంగానే వీళ్లూ చనిపోతే, మనుషులందరికీ వచ్చే శిక్షే వీళ్లకూ వస్తే గనుక యెహోవా నన్ను పంపనట్టే.+ 30  అయితే యెహోవా వాళ్లను ఏదైనా అసాధారణ రీతిలో శిక్షిస్తే, భూమి నోరు తెరిచి వాళ్లను, వాళ్లకు సంబంధించిన ప్రతీదాన్ని మింగేస్తే, వాళ్లు ప్రాణాలతోనే సమాధిలోకి* దిగిపోతే, వాళ్లు యెహోవా మీద గౌరవం లేనట్టు ప్రవర్తించారని అప్పుడు మీకు ఖచ్చితంగా తెలుస్తుంది.” 31  మోషే అలా మాట్లాడడం పూర్తవ్వగానే, వాళ్ల కింద ఉన్న నేల చీలిపోయింది.+ 32  భూమి నోరు తెరిచి వాళ్లను, వాళ్ల ఇంటివాళ్లను, కోరహుకు సంబంధించిన ప్రతీ ఒక్కర్ని,+ వాళ్ల వస్తువులన్నిటినీ మింగేసింది. 33  కాబట్టి వాళ్లూ, వాళ్లకు సంబంధించిన వాళ్లందరూ ప్రాణాలతోనే సమాధిలోకి* దిగిపోయారు, తర్వాత భూమి వాళ్లను కప్పేసింది; అలా వాళ్లు సమాజం మధ్యలో లేకుండా నశించిపోయారు.+ 34  వాళ్ల అరుపులు విని వాళ్ల చుట్టూ ఉన్న ఇశ్రాయేలీయులందరూ, “భూమి మనల్ని కూడా మింగేస్తుందేమో!” అంటూ పారిపోయారు. 35  తర్వాత యెహోవా దగ్గర నుండి అగ్ని బయల్దేరి,+ ధూపం వేస్తున్న ఆ 250 మందిని దహించేసింది.+ 36  అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 37  “ఆ మంటలో నుండి ధూపపాత్రల్ని తీసుకోమని+ నువ్వు యాజకుడైన అహరోను కుమారుడు ఎలియాజరుకు చెప్పు, ఎందుకంటే అవి పవిత్రమైనవి. అంతేకాదు, ఆ మంటను* కాస్త దూరంగా పారేయమని నువ్వు అతనికి చెప్పు. 38  పాపం చేసి ప్రాణాల మీదికి తెచ్చుకున్న ఆ మనుషుల ధూపపాత్రలతో పల్చని రేకులు చేసి బలిపీఠానికి+ తొడగాలి; ఎందుకంటే వాళ్లు యెహోవా ముందుకు వాటిని తీసుకొచ్చారు, దానివల్ల అవి పవిత్రం అయ్యాయి. అవి ఇశ్రాయేలీయులకు సూచనగా పనిచేయాలి.”+ 39  కాబట్టి యాజకుడైన ఎలియాజరు, కాల్చివేయబడినవాళ్లు తెచ్చిన రాగి ధూపపాత్రల్ని తీసుకొని, బలిపీఠానికి తొడగడానికి వాటిని రేకులుగా సాగగొట్టాడు. 40  మోషే ద్వారా యెహోవా తనకు చెప్పినట్టే అతను చేశాడు. వేరేవాళ్లు* ఎవ్వరూ, అంటే అహరోను వంశానికి చెందని వాళ్లెవ్వరూ యెహోవా ముందు ధూపం వేయకూడదనీ+ ఎవ్వరూ కోరహులా, అతని మద్దతుదారుల్లా అవ్వకూడదనీ+ అది ఇశ్రాయేలీయులకు గుర్తుచేసింది. 41  సరిగ్గా ఆ తర్వాతి రోజే ఇశ్రాయేలీయుల సమాజమంతా మోషే, అహరోనుల మీద సణగడం మొదలుపెట్టి,+ “మీరిద్దరూ యెహోవా ప్రజల్ని చంపేశారు” అని అన్నారు. 42  సమాజం మోషే, అహరోనులకు వ్యతిరేకంగా సమావేశమైనప్పుడు వాళ్లు ప్రత్యక్ష గుడారం వైపుకు తిరిగారు; అప్పుడు ఇదిగో! మేఘం దాన్ని కప్పేసింది, యెహోవా మహిమ కనిపించడం మొదలైంది.+ 43  మోషే, అహరోనులు ప్రత్యక్ష గుడారం ముందుకు వెళ్లారు,+ 44  అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: 45  “మీరిద్దరు ఈ సమాజం మధ్య నుండి దూరంగా వెళ్లండి, నేను ఒక్క క్షణంలో వాళ్లను తుడిచిపెట్టేస్తాను.”+ ఆ మాట విన్నప్పుడు వాళ్లు నేలమీద సాష్టాంగపడ్డారు.+ 46  మోషే అహరోనుకు ఇలా చెప్పాడు: “నువ్వు ధూపపాత్ర తీసుకొని, బలిపీఠం మీద నుండి కొన్ని నిప్పులు అందులో వేసి,+ దానిమీద ధూపద్రవ్యం పెట్టి త్వరగా సమాజం దగ్గరికి వెళ్లి వాళ్లకోసం ప్రాయశ్చిత్తం చేయి;+ ఎందుకంటే యెహోవా ఉగ్రత బయల్దేరింది. తెగులు మొదలైంది!” 47  మోషే చెప్పినట్టు అహరోను వెంటనే దాన్ని తీసుకొని సమాజం మధ్యకు పరుగెత్తాడు; అయితే ఇదిగో! అప్పటికే ప్రజల మధ్య తెగులు మొదలైంది. కాబట్టి అతను ఆ ధూపపాత్రలో ధూపద్రవ్యం వేసి, ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేయడం మొదలుపెట్టాడు. 48  అతను చనిపోయినవాళ్లకు, బ్రతికున్నవాళ్లకు మధ్య నిలబడుతూ ఉన్నాడు, చివరికి ఆ తెగులు ఆగిపోయింది. 49  కోరహు వల్ల చనిపోయినవాళ్లు కాకుండా ఇంకా 14,700 మంది తెగులు వల్ల చనిపోయారు. 50  చివరికి అహరోను ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గరున్న మోషే దగ్గరికి వచ్చేసరికి ఆ తెగులు ఆగిపోయింది.

అధస్సూచీలు

లేదా “నిప్పు పాత్రలు.”
లేదా “అధికారం చెలాయించాలని.”
ఇది తిరుగుబాటులో చేరినవాళ్లను సూచించవచ్చు.
అక్ష., “ఆ మనుషుల కళ్లు పీకేస్తావా?”
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
లేదా “షియోల్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.
లేదా “షియోల్‌లోకి,” అంటే మానవజాతి సాధారణ సమాధిలోకి. పదకోశం చూడండి.
ఇది నిప్పు పాత్రల్లో లేదా వాటికి దగ్గర్లో ఉన్న నిప్పులు, బొగ్గులు, బూడిద అని స్పష్టమౌతోంది.
లేదా “అపరిచితులు.”