సంఖ్యాకాండం 4:1-49
4 తర్వాత యెహోవా మోషేకు, అహరోనుకు ఇలా చెప్పాడు:
2 “వాళ్లవాళ్ల వంశాల్ని బట్టి, పూర్వీకుల కుటుంబాల్ని బట్టి మీరు లేవి వంశస్థులైన కహాతీయుల+ జనాభా లెక్క సేకరించాలి;
3 ప్రత్యక్ష గుడారంలో పని చేయడానికి నియమించబడిన గుంపులో ఉండి, 30+ నుండి 50 ఏళ్ల+ మధ్య వయసు ఉన్నవాళ్లందరి లెక్క సేకరించాలి.+
4 “ప్రత్యక్ష గుడారంలో కహాతీయులు చేయాల్సిన సేవ ఇదే.+ ఇది అతి పవిత్రమైనది:
5 ఇశ్రాయేలీయుల సమాజం ఒక చోటి నుండి ఇంకో చోటికి మారుతున్నప్పుడు అహరోను, అతని కుమారులు లోపలికి వచ్చి మందసం దగ్గరున్న తెరను+ తీసేసి, దానితో సాక్ష్యపు మందసాన్ని+ కప్పాలి.
6 వాళ్లు దానిమీద సముద్రవత్సల* తోళ్లతో చేసిన బట్టను కప్పాలి, దాని పైన నీలిరంగు బట్టను కప్పి మందసాన్ని మోసే కర్రల్ని+ వాటి స్థానంలో పెట్టాలి.
7 “వాళ్లు సముఖపు రొట్టెల* బల్ల+ పైన నీలంరంగు బట్టను పరిచి, దానికి సంబంధించిన పళ్లేలను, గిన్నెల్ని, కూజాల్ని, పానీయార్పణ పాత్రల్ని+ దానిమీద పెట్టాలి; క్రమంగా అర్పించే రొట్టెలు+ దాని పైన అలాగే ఉండాలి.
8 వాటిమీద వాళ్లు ముదురు ఎరుపు బట్టను కప్పాలి; దానిమీద సముద్రవత్సల తోళ్లతో చేసిన బట్టను కప్పి, బల్లను మోసే కర్రల్ని+ వాటి స్థానంలో పెట్టాలి.
9 తర్వాత వాళ్లు ఒక నీలంరంగు బట్టను తీసుకొని వెలుగు కోసం ఏర్పాటు చేసిన దీపస్తంభాన్ని,+ దాని దీపాల్ని,+ వాటి పట్టుకార్లను, నిప్పు పాత్రల్ని,+ దీపస్తంభాన్ని వెలిగించి ఉంచడానికి ఉపయోగించే దాని నూనె పాత్రలన్నిటినీ కప్పాలి.
10 వాళ్లు దాన్ని, దాని పాత్రలన్నిటినీ సముద్రవత్సల తోళ్లతో చేసిన బట్టలో చుట్టి మోతకర్ర మీద పెట్టాలి.
11 అలాగే వాళ్లు, బంగారంతో చేసిన వేదిక*+ మీద నీలంరంగు బట్టను కప్పాలి; తర్వాత సముద్రవత్సల తోళ్లతో చేసిన బట్టను దానిపైన కప్పి, వేదికను మోసే కర్రల్ని+ వాటి స్థానంలో పెట్టాలి.
12 ఆ తర్వాత వాళ్లు, పవిత్ర స్థలంలో ఎప్పుడూ సేవ చేయడానికి ఉపయోగించే పరిచార పాత్రలన్నిటినీ+ తీసుకొని ఒక నీలంరంగు బట్టలో పెట్టాలి; తర్వాత సముద్రవత్సల తోళ్లతో చేసిన బట్టను వాటిపైన కప్పి మోతకర్ర మీద వాటిని పెట్టాలి.
13 “వాళ్లు బలిపీఠం మీదున్న బూడిదను* తీసేసి,+ ఊదారంగు ఉన్నితో చేసిన బట్టను దానిమీద పరవాలి.
14 బలిపీఠం దగ్గర సేవ చేస్తున్నప్పుడు ఉపయోగించే దాని పాత్రలన్నిటినీ, అంటే దాని నిప్పు పాత్రల్ని, ముళ్ల గరిటల్ని, పారల్ని, గిన్నెల్ని, బలిపీఠానికి సంబంధించిన పాత్రలన్నిటినీ+ దానిమీద పెట్టాలి; తర్వాత సముద్రవత్సల తోళ్లతో చేసిన బట్టను దానిపైన కప్పి, బలిపీఠాన్ని మోసే కర్రల్ని+ వాటి స్థానంలో పెట్టాలి.
15 “ఇశ్రాయేలీయుల సమాజం ఒక చోటి నుండి ఇంకో చోటికి మారుతున్నప్పుడు అహరోను, అతని కుమారులు పవిత్ర స్థలాన్ని, పవిత్ర స్థలానికి సంబంధించిన ఉపకరణాలన్నిటినీ కప్పే పని పూర్తిచేయాలి.+ తర్వాత కహాతీయులు వచ్చి వాటిని మోస్తారు.+ అయితే వాళ్లు పవిత్ర స్థలాన్ని ముట్టుకోకూడదు, ఒకవేళ ముట్టుకుంటే చనిపోతారు.+ ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన ఈ పనుల్ని కహాతీయులు చూసుకోవాలి, అది వాళ్ల బాధ్యత.*
16 “దీపాల్ని వెలిగించడానికి వాడే నూనెను,+ పరిమళ ధూపద్రవ్యాన్ని,+ క్రమంగా అర్పించే ధాన్యార్పణను, అభిషేక తైలాన్ని+ పర్యవేక్షించే బాధ్యత యాజకుడైన అహరోను కుమారుడు ఎలియాజరుది.+ గుడారమంతటినీ, దానిలో ఉన్న వాటన్నిటినీ, పవిత్ర స్థలాన్ని, దాని పాత్రలన్నిటినీ పర్యవేక్షించే బాధ్యత అతనిదే.”
17 యెహోవా మోషేకు, అహరోనుకు ఇంకా ఇలా చెప్పాడు:
18 “లేవీయుల మధ్య నుండి కహాతీయుల వంశాల్ని+ నాశనం కానివ్వకండి.
19 వాళ్లు అతి పవిత్రమైన+ వస్తువుల దగ్గరికి రావడం వల్ల చనిపోకుండా ఉండేలా మీరు ఇలా చేయండి. అహరోను, అతని కుమారులు లోపలికి వెళ్లి వాళ్లలో ఒక్కొక్కర్ని వాళ్లవాళ్ల పని మీద నియమించి, వాళ్లు ఏమేం మోయాలో చెప్తారు.
20 వాళ్లు ఒక్క క్షణమైనా పవిత్రమైన వస్తువుల్ని చూడడానికి లోపలికి రాకూడదు, ఒకవేళ వస్తే చనిపోతారు.”+
21 తర్వాత యెహోవా మోషేకు ఇలా చెప్పాడు:
22 “వాళ్లవాళ్ల పూర్వీకుల కుటుంబాల్ని బట్టి, వంశాల్ని బట్టి నువ్వు గెర్షోనీయుల+ జనాభా లెక్క సేకరించాలి.
23 ప్రత్యక్ష గుడారంలో పని చేయడానికి నియమించబడిన గుంపులో ఉండి, 30 నుండి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లందర్నీ నువ్వు నమోదు చేయాలి.
24 గెర్షోనీయుల వంశస్థులు వీటిని చూసుకోవడానికి, మోయడానికి నియమించబడ్డారు:+
25 వాళ్లు ఏమేం మోస్తారంటే గుడారపు తెరల్ని,+ ప్రత్యక్ష గుడారాన్ని, దాని కప్పును, దానిపైన ఉండే సముద్రవత్సల తోళ్ల పైకప్పును,+ ప్రత్యక్ష గుడారపు ప్రవేశ ద్వారం దగ్గర ఉండే తెరను,+
26 ప్రాంగణంలో వేలాడే తెరల్ని,+ గుడారం చుట్టూ బలిపీఠం చుట్టూ ఉండే ప్రాంగణ ప్రవేశ ద్వారం తెరను,+ వాటి తాళ్లను, వాటి పాత్రలన్నిటినీ, దాని సేవ కోసం ఉపయోగించే ప్రతీదాన్ని. ఇది వాళ్ల నియామకం.
27 గెర్షోనీయుల+ సేవలన్నిటినీ, వాళ్ల బరువులన్నిటినీ అహరోను, అతని కుమారులు పర్యవేక్షించాలి; నువ్వు ఈ బరువులన్నిటినీ వాళ్ల బాధ్యతగా నియమించాలి.
28 ప్రత్యక్ష గుడారంలో గెర్షోనీయుల వంశస్థులు చేయాల్సిన సేవ ఇది;+ యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు నిర్దేశం కింద వాళ్లు తమ బాధ్యతలు నిర్వహిస్తారు.+
29 “మెరారీయుల+ విషయానికొస్తే, వాళ్ల వంశాన్ని బట్టి, పూర్వీకుల కుటుంబాన్ని బట్టి నువ్వు వాళ్లను నమోదు చేయాలి.
30 ప్రత్యక్ష గుడారంలో పని చేయడానికి నియమించబడిన గుంపులో ఉండి, 30 నుండి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లందర్నీ నువ్వు నమోదు చేయాలి.
31 ప్రత్యక్ష గుడారం దగ్గర తమ సేవకు సంబంధించి వీటిని మోయాల్సిన బాధ్యత వాళ్ల మీద ఉంటుంది:+ గుడారపు చట్రాలు,*+ దాని అడ్డకర్రలు,+ దాని స్తంభాలు,+ దాని దిమ్మలు;+
32 చుట్టూ ఉండే ప్రాంగణపు స్తంభాలు,+ వాటి దిమ్మలు,+ వాటి మేకులు,+ వాటి తాళ్లు, వాటికి సంబంధించిన ఉపకరణాలన్నీ, అలాగే వాటికి సంబంధించిన సేవంతా. ఏ ఉపకరణాల్ని మోయాల్సిన బాధ్యత ఎవరిదో నువ్వు పేరుపేరున నియమించాలి.
33 యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు నిర్దేశం కింద+ మెరారీయుల వంశస్థులు+ ప్రత్యక్ష గుడారం దగ్గర సేవ చేయాల్సిన విధానం ఇది.”
34 అప్పుడు మోషే, అహరోను, ఇశ్రాయేలు సమాజ ప్రధానులు+ కహాతీయుల్ని+ వాళ్లవాళ్ల వంశాల్ని బట్టి, పూర్వీకుల కుటుంబాన్ని బట్టి నమోదు చేశారు;
35 ప్రత్యక్ష గుడారంలో పని చేయడానికి నియమించబడిన గుంపులో ఉండి, 30 నుండి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లందర్నీ నమోదు చేశారు.+
36 తమతమ వంశాల్ని బట్టి నమోదైన వాళ్ల మొత్తం సంఖ్య 2,750.+
37 కహాతీయుల వంశస్థుల్లో పేరు నమోదైన వాళ్లు, అంటే ప్రత్యక్ష గుడారం దగ్గర సేవచేస్తూ వచ్చిన వాళ్లందరు వీళ్లే. మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆదేశం మేరకు మోషే, అహరోనులు వీళ్లను నమోదు చేశారు.+
38 గెర్షోనీయుల్ని+ వాళ్లవాళ్ల వంశాల్ని బట్టి, పూర్వీకుల కుటుంబాన్ని బట్టి నమోదు చేశారు.
39 ప్రత్యక్ష గుడారం దగ్గర పని చేయడానికి నియమించబడిన గుంపులో ఉండి, 30 నుండి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లందర్నీ నమోదు చేశారు.
40 తమతమ వంశాల్ని బట్టి, పూర్వీకుల కుటుంబాన్ని బట్టి నమోదైన వాళ్ల మొత్తం సంఖ్య 2,630.+
41 గెర్షోనీయుల వంశస్థుల్లో పేరు నమోదైన వాళ్లు, అంటే ప్రత్యక్ష గుడారం దగ్గర సేవచేస్తూ వచ్చిన వాళ్లందరు వీళ్లే. యెహోవా ఇచ్చిన ఆదేశం మేరకు మోషే, అహరోనులు వీళ్లను నమోదు చేశారు.+
42 మెరారీయుల్ని వాళ్లవాళ్ల వంశాల్ని బట్టి, పూర్వీకుల కుటుంబాన్ని బట్టి నమోదు చేశారు.
43 ప్రత్యక్ష గుడారం దగ్గర పని చేయడానికి నియమించబడిన గుంపులో ఉండి, 30 నుండి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లందర్నీ నమోదు చేశారు.+
44 తమతమ వంశాల్ని బట్టి, పూర్వీకుల కుటుంబాన్ని బట్టి నమోదైన వాళ్ల మొత్తం సంఖ్య 3,200.+
45 మెరారీయుల వంశస్థుల్లో పేరు నమోదైన వాళ్లు వీళ్లే. మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆదేశం మేరకు మోషే, అహరోనులు వీళ్లను నమోదు చేశారు.+
46 మోషే, అహరోను, ఇశ్రాయేలు ప్రధానులు ఈ లేవీయులందర్నీ వాళ్లవాళ్ల వంశాల్ని బట్టి, పూర్వీకుల కుటుంబాల్ని బట్టి నమోదు చేశారు.
47 వాళ్లు 30 నుండి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్నవాళ్లు; వాళ్లంతా ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన సేవ చేయడానికి, బరువులు మోయడానికి నియమించబడ్డారు.+
48 నమోదైన వాళ్ల మొత్తం సంఖ్య 8,580.+
49 మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆదేశం మేరకు వాళ్లలో ఒక్కొక్కరు తమకు నియమించిన సేవ ప్రకారం, బరువు ప్రకారం నమోదు చేయబడ్డారు; యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే వాళ్లు నమోదు చేయబడ్డారు.
అధస్సూచీలు
^ అంటే, సీల్ అనే సముద్ర జీవి.
^ లేదా “సన్నిధి రొట్టెల.”
^ అంటే, ధూపవేదిక.
^ లేదా “కొవ్వు బూడిదను,” అంటే, బలి ఇచ్చే జంతువుల కొవ్వులో నానిన బూడిదను.
^ అక్ష., “బరువు.”
^ లేదా “ఫ్రేములు.”