సామెతలు 3:1-35

  • తెలివి కలిగి యెహోవా మీద నమ్మకం ఉంచాలి (1-12)

    • విలువైనవాటితో యెహోవాను ఘనపర్చాలి (9)

  • తెలివి సంతోషాన్ని తెస్తుంది (13-18)

  • తెలివివల్ల సురక్షితంగా ఉంటారు (19-26)

  • ఇతరులతో సరిగ్గా నడుచుకోవడం (27-35)

    • వీలైనప్పుడు ఇతరులకు మేలు చేయాలి (27)

3  నా కుమారుడా, నా ఉపదేశాన్ని మర్చిపోకు,నా ఆజ్ఞల్ని హృదయపూర్వకంగా పాటించు,   అప్పుడు నువ్వు ఎక్కువకాలం జీవిస్తావు,నీకు మనశ్శాంతి ఉంటుంది.+   విశ్వసనీయ ప్రేమను, సత్యాన్ని* విడిచిపెట్టకు.+ వాటిని నీ మెడ చుట్టూ కట్టుకో;నీ హృదయమనే పలకమీద రాసుకో;+   అప్పుడు నువ్వు దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో+అనుగ్రహం పొందుతావు, లోతైన అవగాహన గలవాడిగా ఉంటావు.   నీ నిండు హృదయంతో యెహోవా మీద నమ్మకం ఉంచు,+నీ సొంత అవగాహన మీద ఆధారపడకు.+   నీ మార్గాలన్నిట్లో ఆయన్ని పరిగణనలోకి తీసుకో,+అప్పుడు ఆయన నీ జీవితాన్ని సఫలం చేస్తాడు.*+   నీ సొంత తెలివిని నమ్ముకోకు.+ యెహోవాకు భయపడి, చెడు నుండి పక్కకు తప్పుకో.   అప్పుడు నీ శరీరం ఆరోగ్యంగా,నీ ఎముకలు పుష్టిగా ఉంటాయి.   నీకున్న విలువైన వాటితో,నీ పంటలోని* ప్రథమఫలాలతో*+ యెహోవాను ఘనపర్చు.+ 10  అప్పుడు నీ గోదాముల్లో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది,+నీ ద్రాక్షతొట్లలో ద్రాక్షారసం పొంగిపొర్లుతుంది. 11  నా కుమారుడా, యెహోవా ఇచ్చే క్రమశిక్షణను తిరస్కరించకు,+ఆయన గద్దింపును అసహ్యించుకోకు;+ 12  ఎందుకంటే, తండ్రి తాను ప్రేమించే కుమారుణ్ణి గద్దించినట్టే,యెహోవా తాను ప్రేమించేవాళ్లను గద్దిస్తాడు.+ 13  తెలివిని కనుగొన్నవాళ్లు,వివేచనను సంపాదించినవాళ్లు సంతోషంగా ఉంటారు;+ 14  వెండిని సంపాదించడం కంటే తెలివిని సంపాదించడం మేలు,బంగారాన్ని లాభంగా పొందడం కంటే తెలివిని పొందడం మేలు.+ 15  అది పగడాల* కన్నా ఎంతో అమూల్యమైనది;నువ్వు కోరుకునేదేదీ దానికి సాటిరాదు. 16  దాని కుడిచేతిలో దీర్ఘాయుష్షు,దాని ఎడమచేతిలో సంపదలు, ఘనత ఉన్నాయి. 17  దాని మార్గాలు ఆహ్లాదకరం,దాని దారులన్నీ శాంతిమయం.+ 18  దాన్ని పట్టుకునేవాళ్లకు అది జీవవృక్షం,దాన్ని గట్టిగా పట్టుకునేవాళ్లు ధన్యులు.*+ 19  యెహోవా తెలివితో భూమికి పునాది వేశాడు.+ వివేచనతో ఆకాశాన్ని స్థిరంగా స్థాపించాడు.+ 20  ఆయన జ్ఞానంవల్ల అగాధ జలాలు తెరుచుకున్నాయి,మేఘాలతో నిండిన ఆకాశం చిరుజల్లులు కురిపిస్తుంది.+ 21  నా కుమారుడా, వాటిని* నీ కళ్లముందు నుండి వెళ్లిపోనివ్వకు.తెలివిని,* ఆలోచనా సామర్థ్యాన్ని భద్రంగా కాపాడుకో; 22  అవి నీకు జీవాన్నిస్తాయి,నీ మెడకు అలంకారంగా ఉంటాయి; 23  అప్పుడు నువ్వు నీ దారిలో సురక్షితంగా నడుస్తావు,నీ పాదం ఎప్పుడూ తడబడదు.*+ 24  నువ్వు పడుకున్నప్పుడు దేనికీ భయపడవు,+నువ్వు పడుకొని హాయిగా నిద్రపోతావు.+ 25  హఠాత్తుగా వచ్చే అపాయానికి గానీ,దుష్టుల మీదికి వచ్చే తుఫానుకు+ గానీ నువ్వు భయపడవు.+ 26  ఎందుకంటే, నువ్వు యెహోవా మీద పూర్తిగా నమ్మకం పెట్టుకుంటావు;+ఆయన నీ పాదాన్ని ఉచ్చులో చిక్కుకోకుండా కాపాడతాడు.+ 27  మేలు చేయడం నీకు చేతనైనప్పుడు,దాన్ని పొందాల్సిన వాళ్లకు ఆ మేలు చేయకుండా ఉండకు.+ 28  నీ సాటిమనిషికి ఇప్పుడే ఏదైనా ఇవ్వగలిగితే, “వెళ్లి రేపు రా, ఇస్తాను” అని అతనితో అనకు. 29  నీ పొరుగువాడు నిన్ను నమ్మి నీ దగ్గర సురక్షితంగా నివసిస్తుంటే,అతనికి హాని చేయడానికి కుట్ర పన్నకు.+ 30  నీకు ఏ హానీ చేయని వ్యక్తితోకారణం లేకుండా గొడవపడకు.+ 31  దౌర్జన్యం చేసేవాణ్ణి చూసి ఈర్ష్యపడకు,+అతని మార్గాల్లో దేన్నీ ఎంచుకోకు; 32  ఎందుకంటే, కపట బుద్ధి గలవాళ్లు యెహోవాకు అసహ్యం,+నిజాయితీపరులకు ఆయన దగ్గరి స్నేహితుడు.+ 33  దుష్టుల ఇంటిమీద యెహోవా శాపం ఉంటుంది,+కానీ నీతిమంతుల ఇంటిని ఆయన దీవిస్తాడు.+ 34  ఎగతాళి చేసేవాళ్లను చూసి ఆయన నవ్వుతాడు,+సాత్వికుల మీద దయ చూపిస్తాడు.+ 35  తెలివిగలవాళ్లు ఘనతను పొందుతారు,అయితే మూర్ఖులు, అవమానం తెచ్చేవాటిని గొప్పగా చూస్తారు.+

అధస్సూచీలు

లేదా “నమ్మకత్వాన్ని.”
లేదా “నీ దారుల్ని తిన్నగా చేస్తాడు.”
లేదా “అత్యంత శ్రేష్ఠమైనవాటితో.”
లేదా “రాబడి అంతటిలోని.”
పదకోశం చూడండి.
లేదా “సంతోషంగా ఉంటారు.”
ముందు వచనాల్లోని దేవుని లక్షణాల్ని సూచిస్తుందని స్పష్టమౌతోంది.
లేదా “ఆచరణాత్మక తెలివిని.”
లేదా “నీ పాదం దేనికీ కొట్టుకోదు.”