హెబ్రీయులు 13:1-25
13 సహోదర ప్రేమ చూపిస్తూ ఉండండి.+
2 ఆతిథ్యం ఇవ్వడం* మర్చిపోకండి;+ దానివల్ల కొందరు తమకు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు.+
3 చెరసాలలో ఉన్నవాళ్లను గుర్తుచేసుకోండి.+ మీరు కూడా వాళ్లతోపాటు చెరసాలలో ఉన్నట్టు భావిస్తూ+ వాళ్లను గుర్తుచేసుకోండి. అలాగే ఇతరుల చేతుల్లో బాధలు పడుతున్నవాళ్లను గుర్తుచేసుకోండి, ఎందుకంటే మీరు కూడా వాళ్లతోపాటు ఒకే శరీరంలో భాగంగా ఉన్నారు.*
4 వివాహాన్ని అందరూ గౌరవప్రదమైనదిగా చూడాలి, భార్యాభర్తలు ఒకరికొకరు నమ్మకద్రోహం చేసుకోకూడదు.*+ లైంగిక పాపం* చేసేవాళ్లకు, వ్యభిచారం చేసేవాళ్లకు దేవుడు తీర్పుతీరుస్తాడు.+
5 డబ్బును ప్రేమించకండి,+ ఉన్నవాటితో సంతృప్తిగా జీవించండి.+ ఎందుకంటే, దేవుడే ఇలా అన్నాడు: “నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టను, నిన్ను ఎన్నడూ వదిలేయను.”+
6 అందుకే మనం మంచి ధైర్యంతో ఇలా అనగలం: “నాకు సహాయం చేసేది యెహోవాయే;* నేను భయపడను. మనుషులు నన్నేమి చేయగలరు?”+
7 మీకు దేవుని వాక్యాన్ని బోధించి, మీలో నాయకత్వం వహిస్తున్నవాళ్లను గుర్తుచేసుకోండి.+ వాళ్ల ప్రవర్తన వల్ల వచ్చే మంచి ఫలితాల గురించి ఆలోచిస్తూ వాళ్ల విశ్వాసాన్ని ఆదర్శంగా తీసుకోండి.+
8 యేసుక్రీస్తు నిన్న, నేడు ఒకేలా ఉన్నాడు, ఎప్పటికీ ఒకేలా ఉంటాడు.
9 రకరకాల వింత బోధల వల్ల తప్పుదోవ పట్టకండి. మీ హృదయాల్ని బలపర్చుకోవడానికి దేవుని అపారదయ మీద ఆధారపడండి, ఆహారపదార్థాల* మీద కాదు. వాటికి అనవసరమైన ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు వాటివల్ల ఎలాంటి ప్రయోజనం పొందరు.+
10 మనకు ఒక బలిపీఠం ఉంది. దానిమీద ఉన్నదాన్ని తినే హక్కు* గుడారంలో పవిత్రసేవ చేసేవాళ్లకు లేదు.+
11 ఎందుకంటే, వాళ్లు పాపపరిహారార్థ బలిగా అర్పించే జంతువుల కళేబరాల్ని పాలెం బయట కాల్చేస్తారు;+ అయితే వాళ్ల పాపాల క్షమాపణ కోసం ప్రధానయాజకుడు వాటి రక్తాన్ని అతి పవిత్ర స్థలంలోకి తీసుకెళ్తాడు.
12 కాబట్టి యేసు కూడా తన సొంత రక్తంతో ప్రజల్ని పవిత్రపర్చడానికి,+ నగర ద్వారం బయట బాధలు అనుభవించాడు.+
13 అందుకే మనం ఆయన భరించిన నిందను భరిస్తూ,+ పాలెం బయట ఉన్న ఆయన దగ్గరికి వెళ్దాం.
14 ఎందుకంటే, ఎప్పటికీ నిలిచివుండే నగరం మనకు ఇక్కడ లేదు, మనం రానున్న నగరం కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాం.+
15 కాబట్టి మనం యేసు ద్వారా ఎల్లప్పుడూ దేవునికి స్తుతి బలిని అర్పిద్దాం,+ అంటే మన పెదాలతో+ దేవుని పేరును అందరికీ చాటుదాం.+
16 అంతేకాదు మంచి చేయడం, మీకున్న వాటిని ఇతరులతో పంచుకోవడం మర్చిపోకండి.+ అలాంటి బలులు దేవునికి చాలా ఇష్టం.+
17 మీలో నాయకత్వం వహిస్తున్నవాళ్లకు విధేయత చూపిస్తూ,+ వాళ్లకు లోబడివుండండి.+ ఎందుకంటే వాళ్లు మీ ప్రాణాలకు కాపలాగా ఉన్నారు, ఈ విషయంలో వాళ్లు దేవునికి లెక్క అప్పజెప్పాలి.+ మీరు అలా లోబడివుంటే వాళ్లు దుఃఖంతో కాకుండా సంతోషంతో ఆ పని చేయగలుగుతారు. ఒకవేళ వాళ్లు దుఃఖంతో ఆ పని చేయాల్సివస్తే మీకే నష్టం.
18 మా గురించి ప్రార్థిస్తూ ఉండండి; ఎందుకంటే, మేము అన్ని విషయాల్లో నిజాయితీగా ప్రవర్తించాలని అనుకుంటున్నాం,+ మంచి మనస్సాక్షి కలిగివున్నామని నమ్ముతున్నాం.
19 అయితే ముఖ్యంగా, నేను ఇంకా త్వరగా మీ దగ్గరికి వచ్చేలా ప్రార్థించమని మిమ్మల్ని వేడుకుంటున్నాను.
20 శాశ్వత ఒప్పందపు రక్తాన్ని కలిగివున్న గొప్ప కాపరి+ అయిన మన యేసు ప్రభువును మృతుల్లో నుండి బ్రతికించిన, శాంతికి మూలమైన దేవుడు
21 తన ఇష్టాన్ని నెరవేర్చడానికి కావాల్సిన ప్రతీ మంచిదాన్ని మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. తనకు ఇష్టమైనది చేసేలా యేసుక్రీస్తు ద్వారా ఆయన మనల్ని పురికొల్పుతాడు. యుగయుగాలు దేవునికి మహిమ కలగాలి. ఆమేన్.
22 సహోదరులారా, ఈ ప్రోత్సాహకరమైన మాటల్ని ఓపిగ్గా వినమని మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను, నిజానికి నేను రాసిన ఈ ఉత్తరం చిన్నదే.
23 మన సహోదరుడు తిమోతి విడుదలయ్యాడనే విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. అతను త్వరగా వస్తే, మిమ్మల్ని చూడడానికి మేమిద్దరం కలిసి వస్తాం.
24 మీలో నాయకత్వం వహిస్తున్న వాళ్లందరికీ, పవిత్రులందరికీ నా శుభాకాంక్షలు చెప్పండి. ఇక్కడ ఇటలీలో ఉన్నవాళ్లు+ మీకు శుభాకాంక్షలు చెప్తున్నారు.
25 దేవుని అపారదయ మీ అందరికీ తోడుండాలి.
అధస్సూచీలు
^ లేదా “అపరిచితుల పట్ల దయ చూపించడం.”
^ లేదా “మీరు కూడా వాళ్లతో కలిసి బాధలు పడుతున్నట్టు వాళ్లను గుర్తుచేసుకోండి” అయ్యుంటుంది.
^ అక్ష., “పెళ్లి పాన్పు ఏ కళంకం లేనిదై ఉండాలి.”
^ అనుబంధం A5 చూడండి.
^ అంటే, ఆహారం గురించిన నియమాల.
^ అక్ష., “అధికారం.”