హోషేయ 13:1-16

  • విగ్రహపూజ వల్ల ఎఫ్రాయిము యెహోవాను మర్చిపోయాడు (1-16)

    • “మరణమా, నీ విషపు కొండ్లు ఎక్కడ?” (14)

13  “ఎఫ్రాయిము మాట్లాడినప్పుడు, ప్రజలు భయంతో వణికిపోయేవాళ్లు;అతను ఇశ్రాయేలులో ప్రముఖుడు.+ కానీ అతను బయలును పూజించడం ద్వారా పాపం చేసి,+ చనిపోయాడు.   ఇప్పుడు వాళ్ల పాపాలు ఇంకా పెరిగిపోతున్నాయి.వాళ్లు తమ వెండితో పోత* విగ్రహాలు చేసుకుంటున్నారు;+చేతిపనివాళ్లు నైపుణ్యంగా విగ్రహాలు తయారు చేస్తున్నారు. ‘బలులు అర్పించేవాళ్లు ఆ దూడల్ని ముద్దు పెట్టుకోవాలి’ అని వాటి గురించి అంటున్నారు.+   కాబట్టి వాళ్లు ఉదయకాల మేఘాల్లా,పొద్దున్నే త్వరగా మాయమైపోయే మంచు బిందువుల్లా,కళ్లం దగ్గర గాలికి ఎగిరిపోయే ధాన్యపు పొట్టులా,పొగ గొట్టం నుండి బయటికి పోయే పొగలా ఉంటారు.   కానీ నేను యెహోవాను, ఐగుప్తు దేశంలో ఉన్నప్పటి నుండి* నీ దేవుణ్ణి;+నేను తప్ప వేరే ఏ దేవుడూ నీకు తెలీదు,నేను తప్ప వేరే రక్షకుడు లేడు.+   ఎడారిలో, ఎండిపోయిన దేశంలో నేను నిన్ను చూసుకున్నాను.+   వాళ్లు తమ పచ్చిక మైదానాలతో తృప్తిచెందారు,+తృప్తిచెందాక వాళ్లకు పొగరెక్కింది. దాంతో వాళ్లు నన్ను మర్చిపోయారు.+   నేను వాళ్లకు కొదమ సింహంలా,+దారిలో నక్కి ఉండే చిరుతపులిలా అవుతాను.   పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంటిలా నేను వాళ్ల మీద పడి,వాళ్ల ఛాతిని చీల్చేస్తాను. సింహంలా నేను అక్కడ వాళ్లను మింగేస్తాను;అడవి మృగం వాళ్లను ముక్కలుముక్కలుగా చీల్చేస్తుంది.   ఇశ్రాయేలూ, అది మిమ్మల్ని నాశనం చేస్తుంది,ఎందుకంటే, మీకు అండగా ఉన్న నా మీదే మీరు తిరుగుబాటు చేశారు. 10  ‘మాకు రాజును, అధిపతుల్ని’ ఇవ్వు అని మీరు అడిగారు కదా.+మీ నగరాలన్నిట్లో మిమ్మల్ని కాపాడే మీ రాజు ఎక్కడ?+మీ పరిపాలకులు* ఎక్కడ? 11  నేను కోపంతో మీకు రాజును ఇచ్చాను,+ఇప్పుడు మండే కోపంతో అతన్ని తీసేస్తాను.+ 12  ఎఫ్రాయిము దోషం చుట్టబడింది;*అతని పాపం నిల్వచేయబడింది. 13  పురిటినొప్పుల లాంటి వేదనలు అతనికి వస్తాయి. కానీ అతను తెలివిలేని పిల్లవాడు;పుట్టే సమయం వచ్చినప్పుడు అతను బయటికి రావాలనుకోడు. 14  సమాధి* బలం నుండి నేను వాళ్లను విడిపిస్తాను;చావు నుండి వాళ్లను తప్పిస్తాను.+ మరణమా, నీ విషపు కొండ్లు* ఎక్కడ?+ నాశనం చేసే సమాధీ, నువ్వు ఎక్కడ?+ నేను కనికరం చూపించను. 15  ఒకవేళ అతను జమ్ముగడ్డి మధ్య వర్ధిల్లినా,తూర్పు గాలి, అంటే యెహోవా గాలి వస్తుంది,అది ఎడారి నుండి వచ్చి అతని బావిని ఎండిపోజేస్తుంది, అతని ఊటను ఇంకిపోజేస్తుంది. అతని ప్రశస్తమైన వస్తువుల ఖజానా అంతటినీ అది దోచుకెళ్తుంది.+ 16  సమరయ అపరాధిగా ఎంచబడుతుంది,+ ఎందుకంటే అది తన దేవునికి ఎదురుతిరిగింది.+ వాళ్లు ఖడ్గం వల్ల చనిపోతారు,+వాళ్ల పిల్లల్ని ముక్కలుముక్కలు చేస్తారు,వాళ్ల గర్భిణీ స్త్రీల కడుపుల్ని చీల్చేస్తారు.”

అధస్సూచీలు

లేదా “లోహపు.”
అక్ష., “దేశం నుండి.”
అక్ష., “న్యాయమూర్తులు.”
లేదా “భద్రం చేయబడింది.”
లేదా “షియోల్‌,” అంటే మానవజాతి సాధారణ సమాధి. పదకోశం చూడండి.
లేదా “ముళ్లు.”