హోషేయ 6:1-11

  • యెహోవా దగ్గరికి తిరిగి రమ్మని పిలుపు (1-3)

  • త్వరగా మాయమైపోయే విశ్వసనీయ ప్రేమ (4-6)

    • బలుల కన్నా విశ్వసనీయ ప్రేమ మేలు (6)

  • ప్రజల అవమానకరమైన ప్రవర్తన (7-11)

6  “రండి, మనం యెహోవా దగ్గరికి తిరిగెళ్దాం,ఆయన మనల్ని ముక్కలుముక్కలుగా చీల్చేశాడు,+ ఆయనే మనల్ని బాగుచేస్తాడు. ఆయన మనల్ని కొట్టాడు, ఆయనే మన గాయాలకు కట్టు కడతాడు.   రెండు రోజుల తర్వాత ఆయన మనల్ని బలపరుస్తాడు. మూడో రోజున మనల్ని పైకి లేపుతాడు,మనం ఆయన ముందు జీవిస్తాం.   మనం యెహోవాను తెలుసుకుందాం, ఆయన్ని తెలుసుకోవడానికి తీవ్రంగా కృషిచేద్దాం. సూర్యుడు ఉదయించడం ఎంత ఖచ్చితమో, ఆయన రావడం కూడా అంతే ఖచ్చితం;కురిసే వర్షంలా, భూమిని తడిపే కడవరి వానలా*ఆయన మన దగ్గరికి వస్తాడు.”   “ఎఫ్రాయిమూ, నేను నిన్ను ఏం చేయాలి? యూదా, నిన్ను నేనేం చేయాలి? నీ విశ్వసనీయ ప్రేమ ఉదయకాల మేఘాల లాంటిది,త్వరగా మాయమైపోయే మంచు బిందువుల లాంటిది.   అందుకే, ప్రవక్తల ద్వారా నేను వాళ్లను నరికేస్తాను;+నా నోటి మాటలతో వాళ్లను చంపేస్తాను.+ నీ మీదికి వచ్చే తీర్పులు వెలుగులా ప్రకాశిస్తాయి.+   ఎందుకంటే నేను విశ్వసనీయ ప్రేమను* ఇష్టపడతాను, బలుల్ని కాదు;దేవుని గురించిన జ్ఞానాన్ని ఇష్టపడతాను, సంపూర్ణ దహనబలుల్ని కాదు.+   కానీ వాళ్లు, కేవలం మనుషుల్లా నా ఒప్పందాన్ని మీరారు.+ తమ దేశంలో నాకు నమ్మకద్రోహం చేశారు.   గిలాదు దుష్టుల పట్టణం,+రక్తసిక్తమైన పాదముద్రలతో అది నిండిపోయింది.+   యాజకుల సమూహం, మనిషి మీద దాడిచేయడానికి మాటువేసే దోపిడీ ముఠాల్లా ఉంది. షెకెము+ దగ్గరున్న దారిలో వాళ్లు హత్య చేస్తారు,వాళ్లది అవమానకరమైన ప్రవర్తన. 10  నేను ఇశ్రాయేలు ఇంటివాళ్లలో ఘోరమైనదాన్ని చూశాను. అక్కడ ఎఫ్రాయిము వ్యభిచారం చేస్తోంది;+ఇశ్రాయేలు తనను తాను మలినపర్చుకుంది.+ 11  అయితే యూదా, నీ కోసం కోతకాలం నిర్ణయించబడింది,బందీలుగా ఉన్న నా ప్రజల్ని నేను తిరిగి సమకూర్చినప్పుడు అది జరుగుతుంది.”+

అధస్సూచీలు

కడవరి వానలు దాదాపు ఏప్రిల్‌ మధ్యలో మొదలయ్యేవి. అనుబంధం B15 చూడండి.
లేదా “కరుణను.”