మొదటి కొరింథీయులు 10:1-33
10 సహోదరులారా, మీరు ఒక విషయం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మన పూర్వీకులు అందరూ మేఘం+ కింద నడిచారు, అందరూ సముద్రం గుండా వెళ్లారు.+
2 వాళ్లంతా మోషేను అనుసరిస్తుండగా మేఘం ద్వారా, సముద్రం ద్వారా బాప్తిస్మం పొందారు.
3 వాళ్లంతా దేవుడు ఇచ్చిన ఒకే ఆహారం తిన్నారు,+
4 దేవుడు ఇచ్చిన ఒకే నీళ్లు తాగారు.+ వాళ్లు తమ వెంట వచ్చిన రాతిబండలోని నీళ్లు తాగేవాళ్లు, అది దేవుడు అనుగ్రహించిన రాతిబండ, ఆ రాతిబండ క్రీస్తును సూచించింది.*+
5 అయితే, వాళ్లలో చాలామందిని దేవుడు అంగీకరించలేదు, అందుకే వాళ్లు ఎడారిలో* చనిపోయారు.+
6 మనం వాళ్లలా హానికరమైనవి కోరుకోకుండా ఉండడానికి+ ఈ విషయాలు మనకు హెచ్చరికలుగా ఉన్నాయి.
7 వాళ్లలో కొందరు విగ్రహాల్ని పూజించేవాళ్లుగా తయారయ్యారు, మనం వాళ్లలా తయారవ్వకుండా ఉందాం; లేఖనాల్లో రాసివున్నట్టు, “ఆ ప్రజలు తిని తాగడానికి కూర్చున్నారు. ఆ తర్వాత వాళ్లు లేచి జల్సాగా సమయం గడపడం మొదలుపెట్టారు.”+
8 అంతేకాదు, మనం లైంగిక పాపం* చేయకుండా ఉందాం. వాళ్లలో కొందరు లైంగిక పాపం* చేసి, ఒక్కరోజే 23,000 మంది చనిపోయారు.+
9 అంతేకాదు, మనం యెహోవాను* పరీక్షించకుండా ఉందాం.+ వాళ్లలో కొందరు అలా పరీక్షించి, పాముల వల్ల చనిపోయారు.+
10 అంతేకాదు, మనం సణగకుండా ఉందాం. వాళ్లలో కొందరు సణిగి,+ నాశకుడి చేతిలో చనిపోయారు.+
11 మనం వాటి నుండి నేర్చుకోవడానికి ఇవన్నీ వాళ్లకు జరిగాయి, ఈ వ్యవస్థలు అంతం కాబోయే సమయంలో జీవిస్తున్న మనకు హెచ్చరికగా ఉండడానికి అవి లేఖనాల్లో రాయబడ్డాయి.+
12 అందుకే, తాను నిలబడి ఉన్నానని అనుకునే వ్యక్తి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.+
13 మనుషులకు సాధారణంగా వచ్చే పరీక్షలు* తప్ప కొత్తవేమీ మీకు రాలేదు.+ అయితే దేవుడు నమ్మకమైనవాడు, మీరు తట్టుకోగలిగే దానికన్నా ఎక్కువగా మిమ్మల్ని పరీక్షకు గురికానివ్వడు;+ ఏదైనా పరీక్ష వచ్చినప్పుడు, దాన్నుండి తప్పించుకునే మార్గం కలగజేస్తాడు, సహించడానికి సహాయం చేస్తాడు.+
14 కాబట్టి నా ప్రియ సహోదరులారా, విగ్రహపూజకు దూరంగా పారిపోండి.+
15 మీరు వివేచనాపరులు కాబట్టి నేను చెప్తున్నవాటి విషయంలో ఏమి చేయాలో మీరే నిర్ణయించుకోండి.
16 మనం దీవించే* దీవెన పాత్ర క్రీస్తు రక్తానికి గుర్తు కాదా?+ మనం విరిచే రొట్టె, క్రీస్తు శరీరానికి గుర్తు కాదా?+
17 రొట్టె ఒక్కటే; మనమంతా ఆ ఒక్క రొట్టెనే తింటున్నాం, కాబట్టి మనం చాలామందిమి ఉన్నా ఒకే శరీరంగా ఉన్నాం.+
18 ఇశ్రాయేలీయుల గురించి ఆలోచించండి. బలి అర్పించినవాటిని తినేవాళ్లు బలిపీఠంతో భాగస్వాములు కారా?+
19 ఇంతకీ నేను ఏమి చెప్తున్నాను? విగ్రహాలకు బలి అర్పించినవాటిలో ఏదో ఉందని, లేదా విగ్రహంలో ఏదో ఉందని చెప్తున్నానా?
20 లేదు. నేను చెప్పేదేమిటంటే, అన్యజనులు అర్పించే బలులు చెడ్డదూతలకే* అర్పిస్తున్నారు కానీ దేవునికి కాదు;+ అందుకే, మీరు ఆ చెడ్డదూతలతో భాగస్వాములు కాకూడదని కోరుకుంటున్నాను.+
21 మీరు యెహోవా* గిన్నెలోది తాగుతూ, చెడ్డదూతల గిన్నెలోది తాగలేరు. “యెహోవా* బల్ల”+ మీదివి తింటూ, చెడ్డదూతల బల్ల మీదివి తినలేరు.
22 మరైతే మనం ఏమి చేయడానికి ప్రయత్నిస్తున్నాం? ‘మనం యెహోవాకు* రోషం పుట్టిస్తున్నామా’?+ ఆయన కన్నా మనం బలవంతులమా?
23 అన్నీ సరైనవే, కానీ అన్నీ ప్రయోజనకరమైనవి కావు. అన్నీ చేయదగినవే, కానీ అన్నీ ప్రోత్సాహాన్ని ఇవ్వవు.+
24 ప్రతీ ఒక్కరు సొంత ప్రయోజనం గురించి కాకుండా ఇతరుల ప్రయోజనం గురించి ఆలోచిస్తూ ఉండాలి.+
25 మీ మనస్సాక్షిని బట్టి ఆరాలేమీ తీయకుండా, మాంసం కొట్టులో అమ్మే దేన్నైనా సరే తినండి.
26 ఎందుకంటే “భూమి, దానిలో ఉన్న ప్రతీది యెహోవా* సొంతం.”+
27 ఒక అవిశ్వాసి మిమ్మల్ని భోజనానికి పిలిస్తే, మీకు ఇష్టమైతే వెళ్లండి. మీ మనస్సాక్షిని బట్టి ఆరాలేమీ తీయకుండా, అక్కడ ఏది పెడితే అది తినండి.
28 కానీ ఎవరైనా, “ఇది విగ్రహాలకు అర్పించింది” అని మీతో అంటే, వాళ్లను బట్టి, మనస్సాక్షిని బట్టి తినకండి.+
29 ఇక్కడ నేను మాట్లాడేది మీ మనస్సాక్షి గురించి కాదు, వాళ్ల మనస్సాక్షి గురించి. అయినా వేరేవాళ్ల మనస్సాక్షి ఆధారంగా నా స్వేచ్ఛ ఎందుకు విమర్శకు గురికావాలి?+
30 నేను దేవునికి కృతజ్ఞతలు చెప్పి తిన్నా సరే, నేను తినేదాని గురించి ఇతరులు నన్ను విమర్శిస్తే నేను దాన్ని తినడం సరైనదేనా?+
31 కాబట్టి మీరు తిన్నా, తాగినా, ఇంకేమి చేసినా అన్నీ దేవునికి మహిమ తీసుకొచ్చేలా చేయండి.+
32 యూదులకు, గ్రీకువాళ్లకు, దేవుని సంఘానికి అభ్యంతరం కలిగించకుండా చూసుకోండి.+
33 నేను కూడా అందర్నీ అన్ని విషయాల్లో సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నాను; నా సొంత ప్రయోజనం చూసుకోకుండా,+ ఎక్కువమంది రక్షించబడాలనే ఉద్దేశంతో వాళ్ల ప్రయోజనం గురించి ఆలోచిస్తున్నాను.+
అధస్సూచీలు
^ లేదా “ఆ రాతిబండ క్రీస్తే.”
^ అనుబంధం A5 చూడండి.
^ లేదా “శ్రమలు, ప్రలోభాలు.”
^ లేదా “ప్రార్థించే.”
^ అనుబంధం A5 చూడండి.
^ అనుబంధం A5 చూడండి.
^ అనుబంధం A5 చూడండి.
^ అనుబంధం A5 చూడండి.