మొదటి కొరింథీయులు 11:1-34

  • “నన్ను ఆదర్శంగా తీసుకొని నడుచుకోండి” (1)

  • శిరస్సత్వం, తల మీద ముసుగు (2-16)

  • ప్రభువు రాత్రి భోజనం ఆచరించడం (17-34)

11  నేను క్రీస్తును ఆదర్శంగా తీసుకొని నడుచుకుంటున్నట్టే మీరు నన్ను ఆదర్శంగా తీసుకొని నడుచుకోండి.+  అన్ని విషయాల్లో మీరు నన్ను గుర్తుచేసుకుంటున్నందుకు, నేనిచ్చిన నిర్దేశాలు పాటిస్తున్నందుకు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను.  అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను: ప్రతీ పురుషునికి శిరస్సు* క్రీస్తు;+ స్త్రీకి శిరస్సు పురుషుడు;+ క్రీస్తుకు శిరస్సు దేవుడు.+  తల మీద ముసుగు వేసుకొని ప్రార్థించే లేదా ప్రవచించే ప్రతీ పురుషుడు తన తలను అవమానిస్తున్నాడు.  కానీ స్త్రీల విషయానికొస్తే, తల మీద ముసుగు వేసుకోకుండా ప్రార్థించే లేదా ప్రవచించే ప్రతీ స్త్రీ+ తన తలను అవమానిస్తోంది, అలా చేయడం గుండు చేయించుకోవడంతో సమానం.  ఒక స్త్రీ తల మీద ముసుగు వేసుకోకపోతే, ఆమె తన జుట్టు కత్తిరించుకోవాలి; ఒకవేళ జుట్టు కత్తిరించుకోవడం లేదా గుండు చేసుకోవడం ఆమెకు అవమానమైతే, ఆమె తల మీద ముసుగు వేసుకోవాలి.  పురుషుడు దేవుని ప్రతిబింబం,+ దేవుని మహిమ; కాబట్టి అతను తల మీద ముసుగు వేసుకోకూడదు. అయితే స్త్రీ పురుషుని మహిమ.  ఎందుకంటే, దేవుడు పురుషుణ్ణి స్త్రీ శరీరం నుండి సృష్టించలేదు కానీ స్త్రీనే పురుషుని శరీరం నుండి సృష్టించాడు.+  అంతేకాదు దేవుడు స్త్రీ కోసం పురుషుణ్ణి సృష్టించలేదు కానీ పురుషుని కోసం స్త్రీని సృష్టించాడు.+ 10  అందుకే దేవదూతల్ని బట్టి,+ స్త్రీ తన విధేయతకు గుర్తుగా తల మీద ముసుగు వేసుకోవాలి. 11  అయితే ప్రభువు సంఘంలో, స్త్రీ లేకుండా పురుషుడు లేడు, పురుషుడు లేకుండా స్త్రీ లేదు. 12  ఎందుకంటే స్త్రీ పురుషుని నుండి వచ్చినట్టే,+ పురుషుడు స్త్రీ ద్వారా వచ్చాడు; కానీ అన్నిటినీ దేవుడే సృష్టించాడు.+ 13  మీరే ఆలోచించుకోండి: స్త్రీ తల మీద ముసుగు వేసుకోకుండా దేవునికి ప్రార్థించడం సరైనదేనా? 14  మనుషులు సృష్టించబడిన తీరును గమనిస్తే, పొడవు జుట్టు పురుషునికి అవమానమని మీకు తెలియట్లేదా? 15  కానీ స్త్రీకైతే పొడవు జుట్టు ఘనత. ఎందుకంటే, ముసుగుకు బదులు ఆమెకు జుట్టు ఇవ్వబడింది. 16  అయితే, ఎవరైనా వేరే పద్ధతి పాటించాలని వాదిస్తే, మాలో గానీ దేవుని సంఘాల్లో గానీ వేరే ఏ పద్ధతీ లేదని అతను తెలుసుకోవాలి. 17  ఈ నిర్దేశాలు ఇస్తున్నప్పుడు నేను మిమ్మల్ని మెచ్చుకోవట్లేదు. ఎందుకంటే, మీరు సమావేశమైనప్పుడు మీకు ప్రయోజనం కలగాల్సిందిపోయి నష్టమే కలుగుతోంది. 18  మీరు సంఘంగా సమావేశమైనప్పుడు, మీ మధ్య విభజనలు కనిపిస్తున్నాయని నాకు వార్తలు అందుతున్నాయి; కొంతవరకు నేను వాటిని నమ్ముతున్నాను. 19  ఖచ్చితంగా మీ మధ్య తెగలు కూడా ఏర్పడతాయి,+ దాంతో మీలో ఎవరికి దేవుని ఆమోదం ఉందో తేలిపోతుంది. 20  మీరు ఒకచోట సమావేశమైనప్పుడు, నిజంగా ప్రభువు రాత్రి భోజనం+ చేయాలనే ఉద్దేశంతో సమావేశమవ్వట్లేదు. 21  ఎందుకంటే మీరు ప్రభువు రాత్రి భోజనానికి వచ్చినప్పుడు, మీలో కొందరు ముందే ఎవరి భోజనం వాళ్లు చేసేస్తున్నారు. దానివల్ల ఒకరు ఆకలితో ఉంటున్నారు, ఇంకొకరు మత్తులో తూలుతున్నారు. 22  తినడానికి, తాగడానికి మీకు ఇళ్లు లేవా? మీరు దేవుని సంఘాన్ని అగౌరవపరుస్తారా? ఏమీ లేనివాళ్లు సిగ్గుపడేలా చేస్తారా? మీకు ఏమని చెప్పాలి? మిమ్మల్ని మెచ్చుకోవాలా? ఈ విషయంలోనైతే మిమ్మల్ని మెచ్చుకోను. 23  నేను ప్రభువు నుండి అందుకున్నదే మీకు ఇచ్చాను. అదేంటంటే, యేసు ప్రభువు తాను నమ్మకద్రోహానికి గురైన రాత్రి+ ఒక రొట్టె తీసుకొని, 24  కృతజ్ఞతలు చెల్లించి, దాన్ని విరిచి, “ఇది మీ కోసం నేను అర్పించబోయే నా శరీరాన్ని సూచిస్తోంది.+ నన్ను గుర్తుచేసుకోవడానికి దీన్ని చేస్తూ ఉండండి”+ అన్నాడు. 25  అలాగే వాళ్లు భోజనం చేసిన తర్వాత, ఆయన ద్రాక్షారసం గిన్నె కూడా తీసుకొని,+ “ఈ గిన్నె నా రక్తం ఆధారంగా+ ఏర్పడే కొత్త ఒప్పందాన్ని* సూచిస్తోంది.+ మీరు దీన్ని తాగినప్పుడల్లా, నన్ను గుర్తుచేసుకోవడానికి దీన్ని చేస్తూ ఉండండి”+ అన్నాడు. 26  ఎందుకంటే, మీరు ఈ రొట్టె తిన్నప్పుడల్లా, ఈ గిన్నెలోది తాగినప్పుడల్లా ప్రభువు మరణం గురించి ప్రకటిస్తూ ఉంటారు; ఆయన వచ్చేవరకు అలా చేస్తారు. 27  కాబట్టి ఎవరైతే అర్హత లేకుండా ఆ రొట్టె తింటారో లేదా ప్రభువు గిన్నెలోది తాగుతారో వాళ్లు ప్రభువు శరీరం విషయంలో, ఆయన రక్తం విషయంలో పాపం చేసినవాళ్లౌతారు. 28  ముందు ఒక వ్యక్తి తనను తాను జాగ్రత్తగా పరిశీలించుకుని తాను అర్హుణ్ణని నిర్ధారించుకోవాలి.+ తర్వాతే ఆ రొట్టె తినాలి, ఆ గిన్నెలోది తాగాలి. 29  ఎవరైతే అది ప్రభువు శరీరాన్ని సూచిస్తుందని అర్థంచేసుకోకుండా ఆ రొట్టె తింటారో, ఆ గిన్నెలోది తాగుతారో వాళ్లు తమ మీదికి తాము శిక్ష తెచ్చుకుంటారు. 30  అందుకే మీలో చాలామంది బలహీనంగా, అనారోగ్యంగా ఉన్నారు; ఎంతోమంది చనిపోయారు.*+ 31  కానీ, మనమేమిటో మనం గ్రహిస్తే, మనం తీర్పు పొందం. 32  అయితే, అలా గ్రహించనప్పుడు మనకు తీర్పు తీర్చబడుతుంది, మనం యెహోవా* చేతుల్లో క్రమశిక్షణ పొందుతాం.+ దానివల్ల మనం ఈ లోకంతో పాటు శిక్ష పొందకుండా ఉండగలుగుతాం.+ 33  కాబట్టి సహోదరులారా, మీరు ప్రభువు రాత్రి భోజనం చేయడానికి వచ్చినప్పుడు ఒకరికోసం ఒకరు ఆగండి. 34  ఒకవేళ ఎవరికైనా ఆకలేస్తే, ఇంటిదగ్గరే తిని రండి. అలాచేస్తే, మీరు ప్రభువు రాత్రి భోజనం చేయడానికి వచ్చినప్పుడు మీ మీదికి శిక్ష తెచ్చుకోకుండా ఉంటారు.+ ఇక మిగతా విషయాల మాటకొస్తే, నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు వాటిని సరిచేస్తాను.

అధస్సూచీలు

లేదా “తల.”
లేదా “నిబంధనను.”
ఇది ఆధ్యాత్మిక మరణాన్ని, అంటే దేవునితో సంబంధం కోల్పోవడాన్ని సూచిస్తుందని స్పష్టమౌతోంది.
అనుబంధం A5 చూడండి.