మొదటి కొరింథీయులు 3:1-23
3 సహోదరులారా, పవిత్రశక్తి నిర్దేశం ప్రకారం ఆలోచించేవాళ్లతో* మాట్లాడినట్టు కాకుండా+ లోక ప్రజల్లా ఆలోచించేవాళ్లతో, క్రీస్తు మార్గం విషయంలో పసిపిల్లల్లా ఉన్నవాళ్లతో* మాట్లాడినట్టు+ మీతో మాట్లాడాను.
2 అప్పటికి ఇంకా మీరు బలమైన ఆహారం తినే స్థితిలో లేరు కాబట్టి నేను మిమ్మల్ని బలమైన ఆహారంతో కాకుండా పాలతో పోషించాను. నిజానికి, ఇప్పుడు కూడా మీరు అంత బలంగా ఏమీ లేరు.+
3 ఇప్పటికీ మీరు లోక ప్రజల్లాగే ఆలోచిస్తున్నారు.+ మీ మధ్య అసూయలు, గొడవలు ఉన్నాయంటే మీరు లోక ప్రజల్లా ఆలోచిస్తూ వాళ్లలా ప్రవర్తిస్తున్నట్టే కదా?+
4 ఒకరు “నేను పౌలు శిష్యుణ్ణి” అనీ, ఇంకొకరు “నేను అపొల్లో+ శిష్యుణ్ణి” అనీ అంటున్నారంటే మీరు లోక ప్రజల్లా ప్రవర్తిస్తున్నట్టు కాదా?
5 ఇంతకీ అపొల్లో ఎవరు? పౌలు ఎవరు? వాళ్లు ప్రభువు అప్పగించిన పనిని చేసే పరిచారకులు+ మాత్రమే. వాళ్ల ద్వారా మీరు విశ్వాసులయ్యారు.
6 నేను నాటాను,+ అపొల్లో నీళ్లు పోశాడు,+ కానీ పెరిగేలా చేసింది దేవుడే;
7 నాటేవాడిది ఏమీలేదు, నీళ్లు పోసేవాడిది ఏమీలేదు, పెరిగేలా చేసిన దేవునిదే గొప్పతనమంతా.+
8 నాటేవాడి పని, నీళ్లు పోసేవాడి పని* ఒక్కటే. అయితే ప్రతీ వ్యక్తి తన పనిని బట్టి తగిన ప్రతిఫలం పొందుతాడు.+
9 ఎందుకంటే, మేము దేవుని తోటి పనివాళ్లం. మీరేమో సాగుచేయబడుతున్న దేవుని పొలం, దేవుని భవనం.+
10 దేవుడు నాకు అనుగ్రహించిన అపారదయకు తగ్గట్టు నేను నైపుణ్యంగల* ముఖ్య నిర్మాణకుడిగా పునాది వేశాను,+ కానీ ఇంకొకరు దాని మీద కడుతున్నారు. అయితే కట్టే ప్రతీ ఒక్కరు ఎలా కడుతున్నారో చూసుకుంటూ ఉండాలి.
11 ఎందుకంటే, ఇప్పటికే వేసివున్న పునాది కాకుండా వేరే ఏ పునాదిని ఎవ్వరూ వేయలేరు. ఆ పునాది యేసుక్రీస్తే.+
12 ఎవరైనా ఆ పునాది మీద బంగారం, వెండి, అమూల్యమైన రాళ్లు, చెక్క, ఎండుగడ్డి లేదా గడ్డిపోచలతో నిర్మిస్తే,
13 వాళ్లవాళ్ల పని ఎలాంటిదో పరీక్ష రోజున బయటపడుతుంది.* ఎందుకంటే, అగ్ని ప్రతీదాన్ని బయటపెడుతుంది,+ అప్పుడు ఒక్కొక్కరి పని ఎంత నాణ్యంగా ఉందో తెలిసిపోతుంది.
14 పునాది మీద ఒక వ్యక్తి కట్టింది మంటల్లో కాలిపోకుండా ఉంటే, అతను ప్రతిఫలం పొందుతాడు;
15 ఒకవేళ అది కాలిపోతే, అతను బాగా నష్టపోతాడు, కానీ అతను మాత్రం తప్పించుకుంటాడు; కాకపోతే అతను మంటల్లో నుండి బయటపడిన వ్యక్తిలా ఉంటాడు.
16 మీరే దేవుని ఆలయమని,+ దేవుని పవిత్రశక్తి మీలో నివసిస్తుందని+ మీకు తెలీదా?
17 ఎవరైనా దేవుని ఆలయాన్ని నాశనం చేస్తే, దేవుడు అతన్ని నాశనం చేస్తాడు; ఎందుకంటే దేవుని ఆలయం పవిత్రమైనది, మీరే ఆ ఆలయం.+
18 ఎవరూ తమను తాము మోసం చేసుకోకూడదు: మీలో ఎవరైనా ఈ వ్యవస్థలో* తెలివిగలవాణ్ణని అనుకుంటే, అతను మూర్ఖుడవ్వాలి; అప్పుడే అతను నిజంగా తెలివిగలవాడు అవుతాడు.
19 ఎందుకంటే ఈ లోకపు తెలివి దేవుని దృష్టిలో మూర్ఖత్వం. లేఖనాల్లో ఇలా రాసివుంది: “ఆయన, తెలివిగలవాళ్లు తమ కుయుక్తిలో తామే చిక్కుకునేలా చేస్తాడు.”+
20 అంతేకాదు, “జ్ఞానుల ఆలోచనలు వ్యర్థమైనవని యెహోవాకు* తెలుసు.”+
21 కాబట్టి ఎవ్వరూ మనుషులు చేసేవాటి విషయంలో గొప్పలు చెప్పుకోకూడదు; ఎందుకంటే అన్నీ మీవే.
22 పౌలు గానీ, అపొల్లో గానీ, కేఫా*+ గానీ, లోకం గానీ, జీవం గానీ, మరణం గానీ, ఇప్పుడు ఉన్నవి గానీ, రాబోయేవి గానీ అన్నీ మీవే;
23 మీరేమో క్రీస్తుకు చెందినవాళ్లు;+ క్రీస్తేమో దేవునికి చెందినవాడు.
అధస్సూచీలు
^ లేదా “ఆధ్యాత్మిక వ్యక్తులతో.”
^ లేదా “క్రైస్తవ మార్గాన్ని సరిగ్గా అర్థంచేసుకోని వాళ్లతో.”
^ లేదా “ఉద్దేశం.”
^ లేదా “తెలివిగల.”
^ అక్ష., “వెల్లడిచేయబడుతుంది.”
^ అనుబంధం A5 చూడండి.
^ పేతురు అని కూడా పిలవబడ్డాడు.