మొదటి కొరింథీయులు 8:1-13
8 ఇప్పుడు, విగ్రహాలకు అర్పించిన ఆహారం+ గురించి రాస్తున్నాను. నిజమే, ఈ విషయంలో మనందరికీ జ్ఞానం ఉంది.+ జ్ఞానం వల్ల గర్వం వస్తుంది, కానీ ప్రేమ బలపరుస్తుంది.+
2 ఒక విషయం గురించిన జ్ఞానం తనకుందని ఎవరైనా అనుకుంటే, నిజానికి దాని గురించి ఉండాల్సినంత జ్ఞానం అతనికి లేదు.
3 కానీ ఎవరికైనా దేవుని మీద ప్రేమ ఉంటే, ఆ వ్యక్తి దేవునికి తెలుసు.
4 విగ్రహాలకు అర్పించినవాటిని తినడం విషయానికొస్తే, లోకంలో విగ్రహం వట్టిదని,+ ఒకేఒక్క దేవుడు తప్ప వేరే దేవుడు లేడని+ మనకు తెలుసు.
5 పరలోకంలో గానీ, భూమ్మీద గానీ దేవుళ్లని పిలవబడేవాళ్లు ఉన్నారు;+ నిజంగానే, ప్రజలు చాలామందిని “దేవుళ్లు,” “ప్రభువులు” అని అంటున్నారు,
6 అయినా మనకు మాత్రం ఒక్కడే దేవుడు ఉన్నాడు,+ ఆయనే తండ్రి;+ ఆయన వల్లే అన్నీ ఉనికిలోకి వచ్చాయి, మనం ఉన్నది ఆయన కోసమే.+ అలాగే, ఒక్కడే ప్రభువు ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారానే అన్నీ సృష్టించబడ్డాయి,+ మనం కూడా ఆయన ద్వారానే ఉనికిలోకి వచ్చాం.
7 అయితే, అందరికీ ఈ జ్ఞానం లేదు.+ కొందరు ఒకప్పుడు విగ్రహాల్ని పూజించేవాళ్లు కాబట్టి ఆహారం తినేటప్పుడు అది విగ్రహాలకు అర్పించిందన్నట్టుగా తింటారు.+ వాళ్ల మనస్సాక్షి బలహీనంగా ఉండడం వల్ల అది వాళ్లను బాధిస్తుంది.*+
8 ఆహారం మనల్ని దేవునికి దగ్గర చేయదు;+ మనం తినకపోతే నష్టమేమీ లేదు, తింటే ఒరిగేదేమీ లేదు.+
9 అయితే, ఆహారాన్ని ఎంచుకునే విషయంలో మీకున్న హక్కు బలహీనంగా ఉన్నవాళ్లకు అడ్డురాయిలా మారకుండా చూసుకుంటూ ఉండండి.+
10 ఎందుకంటే, జ్ఞానం ఉన్న నువ్వు విగ్రహపూజ జరిగే ఆలయంలో భోంచేయడం బలహీనమైన మనస్సాక్షి ఉన్న సహోదరుడు చూస్తే, అతను విగ్రహాలకు అర్పించింది తినేంత దూరం వెళ్లడా?
11 కాబట్టి నీ జ్ఞానం వల్ల, బలహీనంగా ఉన్న నీ సహోదరుడు, అంటే క్రీస్తు ఎవరి కోసమైతే చనిపోయాడో ఆ సహోదరుడు నాశనమౌతాడు.+
12 ఈ విధంగా మీరు మీ సహోదరుల విషయంలో పాపం చేసి వాళ్ల బలహీనమైన మనస్సాక్షిని గాయపరిస్తే,+ మీరు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నట్టే.
13 అందుకే, నేను తినే ఆహారం నా సహోదరుణ్ణి విశ్వాసంలో తడబడేట్టు చేస్తే, నా వల్ల నా సహోదరుడు విశ్వాసంలో తడబడకుండా ఉండడం కోసం ఇంకెప్పుడూ నేను మాంసం తినను.+
అధస్సూచీలు
^ అక్ష., “అది కలుషితమైంది.”