మొదటి తిమోతి 4:1-16
4 అయితే, తర్వాతి కాలాల్లో కొందరు, దేవుని నుండి వచ్చాయనిపించే మోసపూరిత సందేశాల* మీద,+ చెడ్డదూతల* బోధల మీద మనసుపెట్టడం వల్ల విశ్వాసం నుండి తొలగిపోతారని దేవుని పవిత్రశక్తి స్పష్టంగా చెప్తోంది.
2 అబద్ధాలాడేవాళ్ల వేషధారణ వల్ల+ వాళ్లు అలా తయారౌతారు, వాళ్ల మనస్సాక్షి మొద్దుబారిపోయింది.*
3 వాళ్లు, పెళ్లి చేసుకోవడం తప్పంటారు.+ అలాగే విశ్వాసం, సత్యం గురించిన సరైన జ్ఞానం ఉన్నవాళ్లు కృతజ్ఞతలు చెల్లించి+ తినడం కోసం దేవుడు సృష్టించినవాటిని+ తినకూడదని వాళ్లు ఆజ్ఞాపిస్తారు.+
4 దేవుడు సృష్టించిన ప్రతీది మంచిదే;+ కృతజ్ఞతలు చెల్లించి తింటే, ఏదీ నిషిద్ధమైనది కాదు.+
5 ఎందుకంటే దేవుని మాటతో, ప్రార్థనతో అది పవిత్రమౌతుంది.
6 నువ్వు ఈ సలహాను సహోదరులకు ఇస్తే, క్రీస్తుయేసుకు మంచి పరిచారకునిగా ఉంటావు; అలాగే విశ్వాసానికి సంబంధించిన మాటలతో, నువ్వు జాగ్రత్తగా అనుసరించిన మంచి బోధకు సంబంధించిన మాటలతో పోషించబడుతూ ఉంటావు.+
7 అయితే, ముసలమ్మల కథల్లాంటి భక్తిహీనమైన కట్టుకథల్ని తిరస్కరించు.+ బదులుగా, దైవభక్తి చూపించడమే లక్ష్యంగా పెట్టుకుని నీకు నువ్వే శిక్షణ ఇచ్చుకో.
8 శారీరక శిక్షణ* కొంతవరకే ప్రయోజనకరం, కానీ దైవభక్తి అన్ని విషయాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే, అది ఇప్పటి జీవితం గురించి, రాబోయే జీవితం+ గురించి వాగ్దానం చేస్తుంది.
9 ఆ మాట నమ్మదగినది, దాన్ని పూర్తిగా అంగీకరించవచ్చు.
10 ఇందుకే మనం కష్టపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం.+ ఎందుకంటే మనం జీవంగల దేవుని మీద నిరీక్షణ ఉంచాం; ఆయన అన్నిరకాల ప్రజలకు,+ ముఖ్యంగా నమ్మకమైన సేవకులకు రక్షకుడు.+
11 ఈ ఆజ్ఞల్ని తెలియజేస్తూ, బోధిస్తూ ఉండు.
12 నీ యౌవనాన్ని బట్టి నిన్ను ఎవ్వరూ, ఎప్పుడూ చిన్నచూపు చూడకుండా జాగ్రత్తపడు. బదులుగా మాట్లాడే విషయంలో, ప్రవర్తన విషయంలో, ప్రేమ విషయంలో, విశ్వాసం విషయంలో, పవిత్రత* విషయంలో నమ్మకమైన సేవకులకు ఆదర్శంగా ఉండు.
13 నేను వచ్చేవరకు, బహిరంగంగా చదివే విషయంలో,+ ప్రోత్సహించే* విషయంలో, బోధించే విషయంలో కృషిచేస్తూ ఉండు.
14 నీలో ఉన్న వరాన్ని, అంటే పెద్దల సభ నీ మీద చేతులు ఉంచినప్పుడు+ ప్రవచనం ద్వారా నీకు ఇవ్వబడిన వరాన్ని నిర్లక్ష్యం చేయకు.
15 వీటి గురించి ధ్యానించు; వీటిలో నిమగ్నమవ్వు, అప్పుడు నీ ప్రగతి అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది.
16 నీ మీద, నీ బోధ మీద ఎప్పుడూ శ్రద్ధ పెట్టు.+ ఈ విషయాల్లో పట్టుదల చూపించు, అలాచేస్తే నిన్ను నువ్వు రక్షించుకుంటావు, నీ బోధ వినేవాళ్లను కూడా రక్షిస్తావు.+
అధస్సూచీలు
^ లేదా “మోసపూరిత ప్రేరేపిత సందేశాల.”
^ లేదా “కాల్చిన ఇనుముతో వాతవేయబడింది.”
^ లేదా “వ్యాయామం.”
^ లేదా “స్వచ్ఛత.”
^ లేదా “ఉపదేశించే.”