మొదటి థెస్సలొనీకయులు 1:1-10

  • శుభాకాంక్షలు (1)

  • థెస్సలొనీకయుల విశ్వాసాన్ని బట్టి కృతజ్ఞతలు (2-10)

1  తండ్రైన దేవునితో, అలాగే ప్రభువైన యేసుక్రీస్తుతో ఐక్యంగా ఉన్న థెస్సలొనీకయుల సంఘానికి పౌలు, సిల్వాను,*+ తిమోతి+ రాస్తున్న ఉత్తరం. దేవుడు మీకు అపారదయను, శాంతిని అనుగ్రహించాలి.  మేము మా ప్రార్థనల్లో మీ అందర్నీ గుర్తుచేసుకున్న ప్రతీసారి దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాం.+  విశ్వాసం వల్ల మీరు చేస్తున్న పనిని, ప్రేమతో మీరు చేస్తున్న కృషిని, ప్రభువైన యేసుక్రీస్తు మీద మీకున్న నిరీక్షణనుబట్టి+ మీరు చూపిస్తున్న సహనాన్ని తండ్రైన దేవుని ముందు మేము ఎప్పుడూ గుర్తుచేసుకుంటున్నాం.  దేవుడు ప్రేమించే సహోదరులారా, ఆయన మిమ్మల్ని ఎంచుకున్నాడని మాకు తెలుసు.  ఎందుకంటే, మేము మీకు మంచివార్తను కేవలం మాటలతో మాత్రమే కాదుగానీ దేవుని పవిత్రశక్తితో, బలమైన నమ్మకంతో ప్రకటించాం, అది మీపై గొప్ప ప్రభావం చూపించింది. మీ మంచి కోసం మేము మీ మధ్య ఎలా పనిచేశామో మీకే తెలుసు.  మీరు మమ్మల్ని, ప్రభువును ఆదర్శంగా తీసుకున్నారు.+ ఎందుకంటే, మీరు ఎన్నో కష్టాల్లో ఉన్నా+ పవిత్రశక్తి వల్ల కలిగే సంతోషంతో వాక్యాన్ని స్వీకరించారు.  అలా మీరు మాసిదోనియ, అకయ ప్రాంతాల్లో ఉన్న విశ్వాసులందరికీ ఆదర్శంగా నిలిచారు.  మీ వల్ల మాసిదోనియ, అకయ ప్రాంతాల్లోని ప్రజలు యెహోవా* వాక్యాన్ని విన్నారు. అంతేకాదు, దేవుని మీద మీకున్న విశ్వాసం గురించి అన్ని ప్రాంతాల వాళ్లకు తెలిసింది.+ కాబట్టి ఇక మేము ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు.  ఎందుకంటే, మేము మిమ్మల్ని మొదటిసారి ఎలా కలిశామో, మీరు జీవంగల సత్యదేవునికి దాసులుగా ఉండడానికి ఎలా మీ విగ్రహాల్ని వదిలేసి+ దేవునివైపు తిరిగారో వాళ్లే చెప్తుంటారు. 10  అంతేకాదు, దేవుడు మృతుల్లో నుండి బ్రతికించిన తన కుమారుడి కోసం, అంటే యేసు కోసం మీరు ఎలా ఎదురుచూస్తున్నారో+ వాళ్లు చెప్తుంటారు. రానున్న దేవుని ఆగ్రహం+ నుండి మనల్ని రక్షించేది ఆయనే.

అధస్సూచీలు

సీల అని కూడా పిలవబడ్డాడు.
అనుబంధం A5 చూడండి.