మొదటి థెస్సలొనీకయులు 5:1-28
5 సహోదరులారా, సమయాల గురించి, కాలాల గురించి మీకు ఏమీ రాయాల్సిన అవసరం లేదు.
2 ఎందుకంటే, యెహోవా* రోజు+ రాత్రిపూట దొంగ వచ్చినట్టు వస్తుందని+ మీకు బాగా తెలుసు.
3 ప్రజలు ఎప్పుడైతే, “అందరూ ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నారు!” అని అంటూ ఉంటారో అప్పుడు, గర్భిణీ స్త్రీకి పురిటినొప్పులు వచ్చినట్టు, హఠాత్తుగా వాళ్ల మీదికి నాశనం వస్తుంది,+ వాళ్లు అస్సలు తప్పించుకోలేరు.
4 అయితే సహోదరులారా, ఆ రోజు అకస్మాత్తుగా మీ మీదికి రావడానికి మీరేమీ దొంగల్లా చీకట్లో లేరు.
5 ఎందుకంటే, మీరంతా వెలుగు పుత్రులు, పగటి పుత్రులు.+ మనం రాత్రికో, చీకటికో చెందినవాళ్లం కాదు.+
6 కాబట్టి, ఇతరుల్లా మనం నిద్రపోకుండా మెలకువగా ఉందాం,+ మన ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకుందాం.
7 ఎందుకంటే, నిద్రపోయేవాళ్లు రాత్రిపూట నిద్రపోతారు, మద్యం మత్తులో ఉండేవాళ్లు రాత్రిపూట మత్తుగా ఉంటారు.
8 అయితే పగటికి చెందిన మనం మన ఆలోచనా సామర్థ్యాన్ని కాపాడుకుందాం; విశ్వాసం, ప్రేమ అనే కవచాన్ని* ధరించుకుందాం; రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణాన్ని* పెట్టుకుందాం.+
9 ఎందుకంటే, దేవుడు మనల్ని ఎంచుకున్నది తన ఆగ్రహం చూపించడానికి కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షించడానికి.+
10 మనం మెలకువగా ఉన్నా, నిద్రపోయినా* తనతో కలిసి జీవించాలని+ క్రీస్తు మన కోసం చనిపోయాడు.
11 కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్నట్టే, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ,* ఒకరినొకరు బలపర్చుకుంటూ ఉండండి.+
12 సహోదరులారా, ఇప్పుడు మేము మిమ్మల్ని కోరేదేమిటంటే, మీ మధ్య కష్టపడి పనిచేస్తూ, ప్రభువు సేవలో మీకు నాయకత్వం వహిస్తూ, మీకు ఉపదేశిస్తున్న వాళ్లను గౌరవించండి;
13 వాళ్లు చేసే పనిని బట్టి, ప్రేమతో వాళ్లమీద విశేషమైన గౌరవం చూపించండి.+ ఒకరితో ఒకరు శాంతిగా మెలగండి.+
14 అదే సమయంలో సహోదరులారా, మేము మిమ్మల్ని వేడుకునేది ఏమిటంటే, పద్ధతిగా నడుచుకోనివాళ్లను హెచ్చరించండి,+ కృంగినవాళ్లతో* ఊరటనిచ్చేలా మాట్లాడండి, బలహీనులకు మద్దతివ్వండి, అందరితో ఓర్పుగా ఉండండి.+
15 మీలో ఎవ్వరూ హాని చేసినవాళ్లకు తిరిగి హాని చేయకూడదు.+ బదులుగా తోటి విశ్వాసులకు, అలాగే అందరికీ ఏది మంచిదో దాన్నే ఎప్పుడూ చేయండి.+
16 ఎప్పుడూ ఆనందిస్తూ ఉండండి.+
17 ఎప్పుడూ ప్రార్థించండి.+
18 ప్రతీ విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెప్పండి.+ క్రీస్తుయేసు శిష్యులుగా మీరు అలా చేయడమే దేవుని ఇష్టం.
19 దేవుని పవిత్రశక్తి జ్వాలను ఆర్పకండి.+
20 ప్రవచనాల్ని చులకనగా చూడకండి.+
21 అన్నిటినీ పరీక్షించి, ఏది మంచిదో నిర్ధారించుకోండి,+ దాన్ని గట్టిగా పట్టుకోండి.
22 అన్నిరకాల దుష్టత్వానికి దూరంగా ఉండండి.+
23 శాంతికి మూలమైన దేవుడు తానే స్వయంగా మిమ్మల్ని పూర్తిగా పవిత్రపర్చాలి. సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత వరకు* మీ స్ఫూర్తి, మీ ప్రాణం,* మీ శరీరం అంతా ఏ విషయంలోనూ కళంకం* లేకుండా కాపాడబడాలి.+
24 మిమ్మల్ని పిలుస్తున్న దేవుడు నమ్మకమైనవాడు, ఆయన తప్పకుండా అలా చేస్తాడు.
25 సహోదరులారా, మా కోసం ప్రార్థిస్తూ ఉండండి.+
26 సహోదరులందర్నీ పవిత్రమైన ముద్దు పెట్టుకొని పలకరించండి.
27 ఈ ఉత్తరాన్ని సహోదరులందరికీ చదివి వినిపించమని ప్రభువు పేరున మిమ్మల్ని వేడుకుంటున్నాను.+
28 మన ప్రభువైన యేసుక్రీస్తు అపారదయ మీకు తోడుండాలి.
అధస్సూచీలు
^ అనుబంధం A5 చూడండి.
^ అంటే, హెల్మెట్.
^ లేదా “ఛాతి కవచాన్ని.”
^ లేదా “మరణంలో నిద్రించినా.”
^ లేదా “ఒకరికొకరు ఊరటను ఇచ్చుకుంటూ.”
^ లేదా “నిరుత్సాహంలో ఉన్నవాళ్లతో.”
^ అక్ష., “ప్రత్యక్షమైనప్పుడు.”
^ లేదా “నింద.”