దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 12:1-40
-
దావీదు రాజరికానికి మద్దతు ఇచ్చినవాళ్లు (1-40)
12 కీషు కుమారుడైన సౌలు కారణంగా దావీదు స్వేచ్ఛగా తిరగలేకపోతున్న సమయంలో,+ సిక్లగులో+ ఉన్న దావీదు దగ్గరికి వచ్చినవాళ్లు వీళ్లు; యుద్ధంలో దావీదుకు మద్దతిచ్చిన బలమైన యోధుల్లో వీళ్లు ఉన్నారు.+
2 వాళ్ల దగ్గర విల్లులు ఉండేవి; వాళ్లు కుడిచేతితోనూ ఎడమచేతితోనూ+ వడిసెల విసరగలరు,+ విల్లుతో బాణాలు వేయగలరు. వాళ్లు బెన్యామీనుకు+ చెందిన సౌలు సహోదరులు.
3 అహీయెజెరు వాళ్ల అధిపతి, అతని తర్వాతివాడు యోవాషు; వీళ్లిద్దరూ గిబియాతీయుడైన+ షెమాయా కుమారులు; అజ్మావెతు+ కుమారులైన యెజీయేలు, పెలెటు, బెరాకా, అనాతోతీయుడైన యెహూ,
4 గిబియోనీయుడైన+ ఇష్మయా; బలమైన యోధుడైన ఇతను ఆ ముప్పై మందిలో+ ఒకడు, ముప్పై మందికి అధిపతి; అలాగే యిర్మీయా, యహజీయేలు, యోహానాను, గెదేరాతీయుడైన యోజాబాదు,
5 ఎలూజై, యెరీమోతు, బెయల్యా, షెమర్యా, హారీపీయుడైన షెఫట్య,
6 కోరహీయులైన ఎల్కానా, ఇష్షీయా, అజరేలు, యోహెజెరు, యాషాబాము,+
7 గెదోరువాడైన యెరోహాము కుమారులు యోహేలా, జెబద్యా.
8 కొంతమంది గాదీయులు ఎడారిలో తలదాచుకున్న+ దావీదు పక్షాన చేరారు; వాళ్లు బలమైన యోధులు, యుద్ధ నైపుణ్యం ఉన్న సైనికులు; వాళ్లు పెద్ద డాలు, బల్లెం పట్టుకుని ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు; వాళ్ల ముఖాలు సింహాల ముఖాల్లా ఉంటాయి, వాళ్లు పర్వతాల మీద కొండజింకల అంత వేగంగా పరుగెత్తుతారు.
9 వాళ్లలో ఏసెరు అధిపతి, రెండోవాడు ఓబద్యా, మూడోవాడు ఏలీయాబు,
10 నాలుగోవాడు మిష్మన్నా, ఐదోవాడు యిర్మీయా,
11 ఆరోవాడు అత్తయి, ఏడోవాడు ఎలీయేలు,
12 ఎనిమిదోవాడు యోహానాను, తొమ్మిదోవాడు ఎల్జాబాదు,
13 పదోవాడు యిర్మీయా, పదకొండోవాడు మక్బన్నయి.
14 వీళ్లు గాదీయులు,+ సైన్యంలో అధిపతులు. వాళ్లలో అత్యంత బలహీనుడు 100 మందితో సమానం, అత్యంత బలవంతుడు 1,000 మందితో సమానం.+
15 మొదటి నెలలో యొర్దాను నది గట్ల మీదుగా పొంగిపొర్లుతున్నప్పుడు వీళ్లు నది దాటారు. వాళ్లు లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వాళ్లందర్నీ తూర్పు వైపుకు, పడమటి వైపుకు తరిమేశారు.
16 కొంతమంది బెన్యామీనీయులు, యూదావాళ్లు కూడా దావీదు దాక్కున్న చోటికి+ వచ్చారు.
17 అప్పుడు దావీదు బయటికి వచ్చి వాళ్లతో ఇలా అన్నాడు: “మీరు నాకు సహాయం చేయడానికి నా దగ్గరికి శాంతిగా వచ్చివుంటే, మనం స్నేహితులం అవుతాం. కానీ నేను ఏ తప్పూ చేయకపోయినా నన్ను నా శత్రువులకు అప్పగించడానికి మీరు వచ్చివుంటే, మన పూర్వీకుల దేవుడు అది చూసి తీర్పు తీర్చాలి.”+
18 అప్పుడు ఆ ముప్పై మందికి అధిపతైన అమాశై మీదికి పవిత్రశక్తి వచ్చింది,*+ అతను ఇలా అన్నాడు:
“దావీదూ, మేము నీ వాళ్లం; యెష్షయి కుమారుడా, మేము నీతో ఉన్నాం.+
నీకు శాంతి కలగాలి, నీకు సహాయం చేసేవాళ్లకు శాంతి కలగాలి,ఎందుకంటే నీ దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు.”+
దావీదు వాళ్లను ఆహ్వానించి, వాళ్లను కూడా సైన్యాల్లో అధిపతులుగా నియమించాడు.
19 మనష్షేవాళ్లలో నుండి కూడా కొంతమంది సౌలును విడిచిపెట్టి దావీదు దగ్గరికి వచ్చారు, ఆ సమయంలో దావీదు సౌలుతో యుద్ధం చేయడానికి ఫిలిష్తీయులతో పాటు వచ్చాడు; అయితే దావీదు ఫిలిష్తీయులకు సహాయం చేయలేదు, ఎందుకంటే ఫిలిష్తీయుల పాలకులు+ ఒకరితో ఒకరు మాట్లాడుకుని, “ఇతను తన ప్రభువు సౌలు దగ్గరికి వెళ్లిపోతాడు, అది మన ప్రాణాలకే ప్రమాదం” అని చెప్పి దావీదును పంపించేశారు.+
20 దావీదు సిక్లగుకు+ వెళ్లినప్పుడు, అతని దగ్గరికి వెళ్లిన మనష్షేవాళ్లు ఎవరంటే: అద్నా, యోజాబాదు, యెదీయవేలు, మిఖాయేలు, యోజాబాదు, ఎలీహు, జిల్లెతై; వీళ్లు వేలమంది మనష్షేవాళ్ల మీద అధిపతులు.+
21 వాళ్లు దోపిడీ ముఠాను ఎదిరించడంలో దావీదుకు సహాయం చేశారు, ఎందుకంటే వాళ్లందరూ బలమైన యోధులు, ధైర్యవంతులు;+ వాళ్లు సైన్యంలో అధిపతులు అయ్యారు.
22 ప్రజలు దావీదుకు సహాయం చేయడానికి రోజూ అతని దగ్గరికి వస్తూ ఉన్నారు,+ చివరికి ఆ సైన్యం దేవుని సైన్యమంత గొప్ప సైన్యం అయ్యింది.+
23 యెహోవా ఆదేశం ప్రకారం సౌలు రాజరికాన్ని దావీదుకు ఇవ్వడానికి, హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరికి వచ్చినవాళ్ల+ సంఖ్య ఇది, వీళ్లు యుద్ధం కోసం సిద్ధంగా ఉన్న యోధులు.+
24 పెద్ద డాళ్లు, ఈటెలు ధరించి యుద్ధానికి సిద్ధంగా ఉన్న యూదావాళ్లు 6,800 మంది.
25 షిమ్యోనీయుల్లో నుండి బలమైన, ధైర్యంగల సైనికులు 7,100 మంది.
26 లేవీయుల్లో నుండి 4,600 మంది.
27 అహరోను కుమారులకు+ నాయకుడైన యెహోయాదా,+ అతనితో పాటు 3,700 మంది,
28 అలాగే బలం, ధైర్యం ఉన్న యువకుడైన సాదోకు,+ అతనితో పాటు అతని పూర్వీకుల కుటుంబానికి చెందిన 22 మంది అధిపతులు.
29 సౌలు సహోదరులైన బెన్యామీనీయుల్లో+ నుండి 3,000 మంది; వాళ్లలో చాలామంది అప్పటివరకు సౌలుకు, అతని కుటుంబానికి నమ్మకంగా ఉన్నారు.
30 ఎఫ్రాయిమీయుల్లో నుండి బలం, ధైర్యం ఉన్న 20,800 మంది; వాళ్లు తమ పూర్వీకుల కుటుంబాల్లో పేరున్న వాళ్లు.
31 దావీదును రాజుగా చేయడానికి, మనష్షే అర్ధగోత్రంలో నుండి పేర్లతో ఎంపిక చేయబడిన 18,000 మంది.
32 ఇశ్శాఖారు గోత్రంలో నుండి 200 మంది అధిపతులు, అలాగే వాళ్ల కింద ఉన్న వాళ్ల సహోదరులందరూ. ఆ అధిపతులు పరిస్థితుల్ని అర్థం చేసుకొని, ఇశ్రాయేలీయులు ఏం చేయాలో గ్రహించినవాళ్లు.
33 జెబూలూను గోత్రంలో నుండి అన్నిరకాల ఆయుధాలు ధరించి, యుద్ధానికి సిద్ధంగా ఉన్న 50,000 మంది సైనికులు; వాళ్లందరూ పూర్తి విశ్వసనీయతతో దావీదు దగ్గరికి వచ్చారు.*
34 నఫ్తాలి గోత్రంలో నుండి 1,000 మంది అధిపతులు, వాళ్లతో పాటు పెద్ద డాళ్లు, ఈటెలు ధరించిన 37,000 మంది.
35 దాను గోత్రంలో నుండి యుద్ధానికి సిద్ధంగా ఉన్న 28,600 మంది.
36 ఆషేరు గోత్రంలో నుండి యుద్ధానికి సిద్ధంగా ఉన్న 40,000 మంది సైనికులు.
37 యొర్దాను అవతలి వైపు ఉన్న+ రూబేనీయుల్లో, గాదీయుల్లో, మనష్షే అర్ధగోత్రం వాళ్లలో నుండి అన్నిరకాల యుద్ధ ఆయుధాలు ధరించిన 1,20,000 మంది సైనికులు.
38 వాళ్లందరూ యుద్ధ పంక్తులు తీరగలవాళ్లు; వాళ్లు దావీదును ఇశ్రాయేలు అంతటి మీద రాజుగా చేయడానికి సంపూర్ణ హృదయంతో హెబ్రోనుకు వచ్చారు, మిగతా ఇశ్రాయేలీయులు కూడా దావీదును రాజుగా చేయాలని ఐక్యంగా* కోరుకున్నారు.+
39 వాళ్ల సహోదరులు వాళ్ల కోసం ఏర్పాట్లు చేయడంతో వాళ్లు తింటూ, తాగుతూ దావీదుతోపాటు అక్కడే మూడు రోజులు ఉన్నారు.
40 అంతేకాదు దగ్గర్లో ఉన్నవాళ్లు, అలాగే ఇశ్శాఖారు, జెబూలూను, నఫ్తాలి అంత దూరంలో ఉన్నవాళ్లు కూడా గాడిదల మీద, ఒంటెల మీద, కంచర గాడిదల మీద, పశువుల మీద ఆహారాన్ని తెస్తూ ఉన్నారు; వాళ్లు పెద్ద మొత్తంలో పిండిని, అంజూర రొట్టెల్ని, ఎండుద్రాక్ష రొట్టెల్ని, ద్రాక్షారసాన్ని, నూనెను, పశువుల్ని, గొర్రెల్ని తెస్తూ ఉన్నారు; ఎందుకంటే ఇశ్రాయేలులో సంతోషం వెల్లివిరిసింది.
అధస్సూచీలు
^ అక్ష., “కమ్ముకుంది.”
^ లేదా “దావీదు దగ్గరికి వచ్చిన వాళ్లెవ్వరూ ద్వంద్వ హృదయంగల వాళ్లు కాదు.”
^ లేదా “ఒకే హృదయంతో.”