దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 28:1-21

  • ఆలయ నిర్మాణం గురించి దావీదు ప్రసంగం (1-8)

  • సొలొమోనుకు నిర్దేశాలు, నిర్మాణ నమూనా ఇవ్వడం (9-21)

28  తర్వాత దావీదు ఇశ్రాయేలు అధిపతులందర్నీ, అంటే గోత్రాల అధిపతుల్ని, రాజుకు పరిచర్య చేసే విభాగాల అధిపతుల్ని,+ సహస్రాధిపతుల్ని,* శతాధిపతుల్ని,*+ రాజుకూ అతని కుమారులకూ+ చెందిన మొత్తం ఆస్తినీ మందల్నీ చూసుకునే అధిపతుల్ని,+ ఆస్థాన అధికారుల్ని, బలవంతులూ సమర్థులూ అయిన ప్రతీ ఒక్కర్ని యెరూషలేములో సమావేశపర్చాడు.  దావీదు లేచి నిలబడి ఇలా అన్నాడు: “నా సహోదరులారా, నా ప్రజలారా, నేను చెప్పేది వినండి. యెహోవా ఒప్పంద మందసం కోసం విశ్రాంతి స్థలంగా, మన దేవుని పాదపీఠంగా ఒక మందిరం కట్టాలనేది నా హృదయ కోరిక;+ దాన్ని కట్టడానికి నేను ఏర్పాట్లు చేశాను.+  కానీ సత్యదేవుడు నాతో, ‘నా పేరు కోసం ఒక మందిరాన్ని నువ్వు కట్టవు, ఎందుకంటే నువ్వు యుద్ధాలు చేసి రక్తం చిందించావు’ అని అన్నాడు.+  అయితే నేను ఇశ్రాయేలు మీద శాశ్వతంగా రాజు అయ్యేలా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వాళ్లందరిలో నన్ను ఎంచుకున్నాడు.+ ఆయన యూదాను నాయకునిగా ఎంచుకున్నాడు,+ యూదా గోత్రంలో నా తండ్రి ఇంటిని ఎంచుకున్నాడు; ఇశ్రాయేలు అంతటి మీద నన్ను రాజును చేయడానికి ఆయన నా తండ్రి కుమారుల్లో నన్ను ఆమోదించాడు.+  యెహోవా నాకు చాలామంది కుమారుల్ని ఇచ్చాడు, యెహోవా రాజరిక సింహాసనం మీద కూర్చొని ఇశ్రాయేలును పరిపాలించడానికి+ వాళ్లందరిలో నా కుమారుడైన సొలొమోనును ఆయన ఎంచుకున్నాడు.+  “ఆయన నాతో ఇలా అన్నాడు, ‘నీ కుమారుడైన సొలొమోనే నా మందిరాన్ని, నా ప్రాంగణాల్ని కడతాడు; ఎందుకంటే నేను అతన్ని నా కుమారునిగా ఎంచుకున్నాను, నేను అతనికి తండ్రిని అవుతాను.+  అతను ఇప్పుడు చేస్తున్నట్టుగా నా ఆజ్ఞల్ని, నా న్యాయనిర్ణయాల్ని దృఢ నిశ్చయంతో పాటిస్తే+ నేను అతని రాజరికాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తాను.’+  కాబట్టి యెహోవా సమాజమైన ఇశ్రాయేలీయులందరి కళ్లముందు, మన దేవుని ముందు నేను చెప్పేదేమిటంటే: మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ తెలుసుకుని, వాటిని పాటించండి; అప్పుడు మీరు మంచి దేశంలోనే ఉంటారు, మీ తర్వాత మీ కుమారులకు దాన్ని శాశ్వత ఆస్తిగా అందజేస్తారు.  “నా కుమారుడా, సొలొమోనా, నీ తండ్రి దేవుణ్ణి తెలుసుకుని, సంపూర్ణ* హృదయంతో, ఇష్టపూర్వకంగా* ఆయన్ని సేవించు;+ ఎందుకంటే యెహోవా హృదయాలన్నిటినీ పరిశీలిస్తాడు,+ ఆయన ప్రతీ ఆలోచనను, ఉద్దేశాన్ని గ్రహిస్తాడు.+ నువ్వు ఆయన్ని వెదికితే ఆయన్ని కనుగొంటావు;+ కానీ నువ్వు ఆయన్ని విడిచిపెడితే, ఆయన నిన్ను శాశ్వతంగా తిరస్కరిస్తాడు.+ 10  ఇదిగో, పవిత్రమైన స్థలంగా ఉండేందుకు ఒక మందిరాన్ని కట్టడానికి యెహోవా నిన్ను ఎంచుకున్నాడు. ధైర్యంగా ఉండి, పని చేయి.” 11  తర్వాత దావీదు వసారాకు,+ మందిరానికి సంబంధించిన వేర్వేరు గదులకు, నిల్వచేసే గదులకు, మేడ గదులకు, లోపలి గదులకు, ప్రాయశ్చిత్త మూత మందిరానికి*+ సంబంధించిన నిర్మాణ నమూనాను+ తన కుమారుడైన సొలొమోనుకు ఇచ్చాడు. 12  యెహోవా మందిరంలోని ప్రాంగణాలకు,+ దాని చుట్టూ ఉన్న అన్ని భోజనాల గదులకు, సత్యదేవుని మందిర ఖజానాలకు, ప్రతిష్ఠించిన* వస్తువులు ఉంచే ఖజానాలకు+ సంబంధించి పవిత్రశక్తి* ద్వారా తనకు వెల్లడిచేయబడిన ప్రతీదాని నిర్మాణ నమూనాను దావీదు సొలొమోనుకు ఇచ్చాడు. 13  అలాగే యాజకుల, లేవీయుల విభాగాల+ గురించి, యెహోవా మందిర సేవలోని బాధ్యతలన్నిటి గురించి, యెహోవా మందిర సేవలో ఉపయోగించే పాత్రలన్నిటి గురించి నిర్దేశాలు ఇచ్చాడు. 14  అంతేకాదు వేర్వేరు సేవల్లో ఉపయోగించే బంగారు పాత్రలన్నిటి కోసం ఎంత బంగారం వాడాలో, వేర్వేరు సేవల్లో ఉపయోగించే వెండి పాత్రలన్నిటి కోసం ఎంత వెండి వాడాలో దావీదు నిర్దేశాలు ఇచ్చాడు. 15  ఆయా బంగారు దీపస్తంభాల,+ వాటి బంగారు దీపాల బరువును అలాగే ఆయా వెండి దీపస్తంభాల, వాటి దీపాల బరువును కూడా తెలియజేశాడు. 16  అలాగే, సముఖపు రొట్టెలు* పెట్టే బల్లల్లో+ ఒక్కో బల్లకు ఎంత బంగారం వాడాలో, వెండి బల్లల కోసం ఎంత వెండి వాడాలో, 17  స్వచ్ఛమైన బంగారంతో చేసే ముళ్ల గరిటల, గిన్నెల, కూజాల బరువు ఎంత ఉండాలో, చిన్న బంగారు గిన్నెల్లో+ అలాగే చిన్న వెండి గిన్నెల్లో ఒక్కోదాని బరువు ఎంత ఉండాలో తెలియజేశాడు. 18  ధూపవేదిక+ కోసం ఎంత మేలిమి బంగారం వాడాలో, అలాగే రథం ప్రతీక+ కోసం, అంటే తమ రెక్కల్ని చాచి యెహోవా ఒప్పంద మందసాన్ని కప్పే బంగారు కెరూబుల+ కోసం ఎంత మేలిమి బంగారం వాడాలో తెలియజేశాడు. 19  దావీదు ఇలా అన్నాడు: “యెహోవా చెయ్యి నా మీద ఉంది, నిర్మాణ నమూనాకు+ సంబంధించిన వివరాలన్నిటినీ రాసేలా+ ఆయన నాకు లోతైన అవగాహన ఇచ్చాడు.” 20  అప్పుడు దావీదు తన కుమారుడు సొలొమోనుతో ఇలా చెప్పాడు: “ధైర్యంగా, నిబ్బరంగా ఉండి, పని చేయి. నా దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి భయపడకు, బెదిరిపోకు.+ ఆయన నిన్ను విడిచిపెట్టడు, నిన్ను వదిలేయడు;+ యెహోవా మందిర సేవకు సంబంధించిన పనంతా పూర్తయ్యే వరకు ఆయన నీకు తోడుగా ఉంటాడు. 21  సత్యదేవుని మందిర సేవంతటి కోసం యాజకుల, లేవీయుల+ విభాగాలు+ సిద్ధంగా ఉన్నాయి. అన్నిరకాల పనుల్ని ఇష్టంగా చేసే నైపుణ్యంగల పనివాళ్లు+ నీ దగ్గర ఉన్నారు; అలాగే నీ నిర్దేశాలన్నిటినీ పాటించే అధిపతులు,+ ప్రజలందరు ఉన్నారు.”

అధస్సూచీలు

అంటే, 1,000 మంది మీద అధిపతులు.
అంటే, 100 మంది మీద అధిపతులు.
లేదా “సంతోష హృదయంతో.” పదకోశంలో “ప్రాణం” చూడండి.
లేదా “పూర్తిగా అంకితమైన.”
లేదా “కరుణా పీఠం మందిరానికి.”
లేదా “పవిత్రపర్చిన; సమర్పించిన.”
పదకోశంలో “రూ-ఆహ్‌; న్యూమా” చూడండి.
లేదా “సన్నిధి రొట్టెలు.”