మొదటి పేతురు 3:1-22
3 అలాగే భార్యలారా, మీరు మీ భర్తలకు లోబడివుండండి.+ అప్పుడు, భర్త ఒకవేళ వాక్యానికి లోబడని వ్యక్తయితే, అతను భార్య మంచి ప్రవర్తనను చూసి వాక్యం లేకుండానే విశ్వాసంలోకి వచ్చే అవకాశం ఉంది.+
2 ఎందుకంటే మీరు చూపించే ప్రగాఢ గౌరవాన్ని, మీ పవిత్ర ప్రవర్తనను అతను కళ్లారా చూస్తాడు.+
3 మీరు పైకి కనిపించే అలంకరణ మీద, అంటే జడలు అల్లుకోవడం, బంగారు నగలు పెట్టుకోవడం+ లేదా ఖరీదైన దుస్తులు వేసుకోవడం మీద దృష్టిపెట్టకండి.
4 బదులుగా మీ హృదయ అలంకరణ మీద దృష్టిపెట్టండి. ప్రశాంతత, సౌమ్యత అనే లక్షణాలతో మిమ్మల్ని మీరు అలంకరించుకోండి.+ ఈ అలంకరణ చెరిగిపోనిది, దేవుని దృష్టిలో చాలా విలువైనది.
5 గతంలో దేవుని మీద నిరీక్షణ ఉంచిన భక్తిగల స్త్రీలు తమ భర్తలకు లోబడివుంటూ తమను తాము అలాగే అలంకరించుకునేవాళ్లు.
6 శారా కూడా అబ్రాహామును, “నా ప్రభువు” అని పిలుస్తూ అతనికి లోబడింది.+ మీరు కూడా మంచి చేస్తూ, భయానికి చోటివ్వకుండా ఉంటే+ ఆమె పిల్లలుగా ఉంటారు.
7 అలాగే భర్తలారా, మీరు మీ భార్యల్ని అర్థంచేసుకుంటూ* కాపురం చేయండి. స్త్రీలు మీకన్నా బలహీనమైనవాళ్లు, సున్నితమైన పాత్ర లాంటివాళ్లు; అంతేకాదు దేవుడు అపారదయతో ఇచ్చే జీవాన్ని పొందే విషయంలో వాళ్లు మీ తోటి వారసులు.+ కాబట్టి వాళ్లకు గౌరవం ఇవ్వండి.+ అప్పుడు మీ ప్రార్థనలకు ఆటంకం కలగకుండా ఉంటుంది.
8 చివరిగా, మీరందరూ ఏకమనస్సు కలిగివుండండి;*+ సహానుభూతిని, సహోదర అనురాగాన్ని, కనికరాన్ని,+ వినయాన్ని చూపించండి.+
9 మీకు ఎవరైనా హానిచేస్తే తిరిగి వాళ్లకు హానిచేయకండి,+ ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే తిరిగి వాళ్లను అవమానించకండి.+ బదులుగా వాళ్లను దీవించండి,+ ఇందుకోసమే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. అప్పుడు మీరు దీవెన పొందుతారు.*
10 ఎందుకంటే లేఖనం ఇలా చెప్తోంది: “జీవాన్ని ప్రేమిస్తూ, ఎన్నో మంచి రోజులు చూడాలనుకునే వ్యక్తి, చెడ్డమాటలు మాట్లాడకుండా నాలుకను, కపటంతో మాట్లాడకుండా పెదాల్ని అదుపులో పెట్టుకోవాలి.+
11 అతను చెడుకు దూరంగా ఉండాలి,+ మంచి చేయాలి; శాంతిని వెదికి, దాన్ని వెంటాడాలి.+
12 ఎందుకంటే యెహోవా* కళ్లు నీతిమంతుల్ని చూస్తూ ఉంటాయి, ఆయన చెవులు వాళ్ల ప్రార్థనల్ని* వింటాయి. అయితే యెహోవా* ముఖం చెడ్డపనులు చేసేవాళ్లకు వ్యతిరేకంగా ఉంది.”+
13 నిజానికి, మీరు మంచిపనుల విషయంలో ఉత్సాహం చూపిస్తే మీకు ఎవరు హానిచేస్తారు?+
14 మీరు నీతిమంతులుగా ఉన్నందుకు బాధలుపడాల్సి వచ్చినా, మీరు సంతోషంగా ఉంటారు.+ అయితే, వాళ్లు భయపడేదానికి మీరు భయపడకండి,* ఆందోళనపడకండి.
15 కానీ మీ హృదయాల్లో క్రీస్తును ప్రభువుగా, పవిత్రుడిగా స్వీకరించండి. మీ నిరీక్షణ గురించి అడిగే ప్రతీ ఒక్కరికి జవాబు ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండండి. అయితే, అలా జవాబు ఇస్తున్నప్పుడు సౌమ్యంగా,+ ప్రగాఢ గౌరవంతో మాట్లాడండి.+
16 మంచి మనస్సాక్షిని కాపాడుకోండి.+ అప్పుడు ప్రజలు మిమ్మల్ని ఏ రకంగానైనా నిందిస్తే, క్రీస్తు శిష్యులుగా మీరు చూపించే మంచి ప్రవర్తన వల్ల+ వాళ్లు సిగ్గుపడతారు.
17 మీరు చెడు చేస్తున్నందుకు బాధలుపడడం కన్నా, మంచి చేస్తున్నందుకు బాధలుపడడం మేలు+ (ఒకవేళ ఆ బాధల్ని దేవుడు అనుమతిస్తే).
18 ఎందుకంటే అనీతిమంతుల కోసం నీతిమంతుడైన క్రీస్తు+ అన్నికాలాలకు సరిపోయేలా ఒక్కసారే చనిపోయాడు. పాపాల్ని తీసేయడానికి, మిమ్మల్ని దేవుని దగ్గరికి నడిపించడానికి ఆయన అలా చనిపోయాడు.+ ఆయన మానవ శరీరంతో చనిపోయాడు, కానీ పరలోక సంబంధమైన శరీరంతో బ్రతికించబడ్డాడు.+
19 క్రీస్తు పరలోక సంబంధమైన శరీరంతోనే వెళ్లి, బంధించబడివున్న దేవదూతలకు+ ప్రకటించాడు.
20 ఆ దేవదూతలు నోవహు కాలంలో అవిధేయులయ్యారు. ఆ కాలంలో ఓడ నిర్మించబడుతుండగా+ దేవుడు ఓర్పుతో వేచిచూస్తూ ఉన్నాడు.+ ఆ ఓడలో కొందరే, అంటే ఎనిమిది మంది* మాత్రమే నీటి ద్వారా రక్షించబడ్డారు.+
21 దానికి పోలికగా ఉన్న బాప్తిస్మం కూడా యేసుక్రీస్తు పునరుత్థానం ద్వారా మిమ్మల్ని ఇప్పుడు రక్షిస్తోంది (బాప్తిస్మం అంటే శరీర మలినాన్ని తీసేసుకోవడం కాదుగానీ, మంచి మనస్సాక్షి+ కోసం దేవునికి చేసుకునే విన్నపం).
22 యేసుక్రీస్తు పరలోకానికి వెళ్లాడు, దేవుని కుడిపక్కన ఉన్నాడు.+ దేవుడు దేవదూతల్ని, అధికారాల్ని ఆయనకు లోబర్చాడు.+
అధస్సూచీలు
^ లేదా “మీ భార్యలతో జ్ఞానం ప్రకారం.”
^ లేదా “ఒకేలా ఆలోచించండి.”
^ లేదా “దీవెనను స్వాస్థ్యంగా పొందుతారు.”
^ అనుబంధం A5 చూడండి.
^ అనుబంధం A5 చూడండి.
^ లేదా “అభ్యర్థనల్ని.”
^ లేదా “వాళ్ల బెదిరింపులకు భయపడకండి” అయ్యుంటుంది.
^ లేదా “ప్రాణాలు.”