మొదటి పేతురు 4:1-19

  • క్రీస్తులా మీరు దేవుని ఇష్టప్రకారం జీవించండి (1-6)

  • అన్నిటి అంతం దగ్గరపడింది (7-11)

  • క్రైస్తవుడిగా ఉన్నందుకు బాధలుపడడం (12-19)

4  క్రీస్తు మనిషిగా ఉన్నప్పుడు బాధలు అనుభవించాడు, కాబట్టి మీరు కూడా క్రీస్తులా ఆలోచించడానికి సిద్ధమవ్వండి;* ఎందుకంటే బాధలు అనుభవించే వ్యక్తి పాపం చేయడం మానేశాడని చూపిస్తాడు.+  ఇకపై మనుషుల కోరికల ప్రకారం కాకుండా+ దేవుని ఇష్టప్రకారం జీవించాలని+ అతను అలా మానేస్తాడు.  గతంలో మీరు లెక్కలేనట్టు* ప్రవర్తిస్తూ, అదుపులేని వాంఛలు తీర్చుకుంటూ, అతిగా తాగుతూ, విచ్చలవిడి విందులు* చేసుకుంటూ, తాగుబోతుల విందుల్లో పాల్గొంటూ, అసహ్యమైన* విగ్రహపూజలు చేస్తూ లోక ప్రజల ఇష్టప్రకారం జీవించారు.+ అవన్నీ చేయడానికి గతంలో మీరు వెచ్చించిన సమయం చాలు.  మీరు ఇక తమతో కలిసి చెడ్డపనులు చేయట్లేదని వాళ్లు ఆశ్చర్యపోతున్నారు, అందుకే మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు.+  కానీ వాళ్లు క్రీస్తుకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఆయన బ్రతికున్నవాళ్లకు, మృతులకు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు.+  నిజానికి, ఇందుకే మృతులకు* కూడా మంచివార్త ప్రకటించబడింది.+ వాళ్లకు మనుషుల దృష్టిలో శరీర ప్రకారం తీర్పు జరిగినా, వాళ్లు దేవుని దృష్టిలో పవిత్రశక్తికి అనుగుణంగా జీవించాలని అలా ప్రకటించబడింది.  అయితే అన్నిటి అంతం దగ్గరపడింది. కాబట్టి మంచి వివేచన కలిగివుండండి,+ ప్రార్థించడానికి ఎప్పుడూ సిద్ధంగా* ఉండండి.+  అన్నిటికన్నా ముఖ్యంగా, ఒకరి మీద ఒకరు ప్రగాఢమైన ప్రేమ కలిగివుండండి.+ ఎందుకంటే ప్రేమ చాలా పాపాల్ని కప్పుతుంది.+  గొణుక్కోకుండా ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చుకుంటూ ఉండండి.+ 10  మీరు పొందినంత మేరకు మీలో ప్రతీ ఒక్కరు మీ వరాన్ని ఒకరికొకరు పరిచారం చేసుకోవడానికి ఉపయోగించండి. వివిధ రకాలుగా చూపించబడే దేవుని అపారదయకు+ మంచి గృహనిర్వాహకులుగా ఉంటూ అలా చేయండి. 11  ఎవరికైనా మాట్లాడే సామర్థ్యం ఉంటే, అతను దేవుని సందేశాల్ని చెప్తున్నట్టు మాట్లాడాలి; ఎవరైనా పరిచారం చేస్తే, అతను దేవుడిచ్చే బలం మీద ఆధారపడుతున్నట్టు ఆ పని చేయాలి;+ అప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవుడు అన్ని విషయాల్లో మహిమపర్చబడతాడు.+ యుగయుగాలు మహిమ, బలం దేవునికే చెందుతాయి. ఆమేన్‌​. 12  ప్రియ సహోదరులారా, మీరు అనుభవిస్తున్న అగ్నిలాంటి కష్టాల్ని* చూసి, మీకు ఏదో వింత జరుగుతున్నట్టు ఆశ్చర్యపోకండి.+ 13  బదులుగా, క్రీస్తు పడిన బాధల్లో మీరు పాలుపంచుకుంటున్నారనే+ విషయాన్ని బట్టి సంతోషిస్తూ ఉండండి.+ దానివల్ల మీరు, ఆయన మహిమ బయల్పర్చబడినప్పుడు ఇంకా ఎక్కువగా ఆనందించగలుగుతారు.+ 14  మీరు క్రీస్తు పేరు కోసం నిందలు* ఎదుర్కొంటుంటే, మీరు సంతోషంగా ఉంటారు.+ ఎందుకంటే దేవుని మహిమగల పవిత్రశక్తి మీ మీద ఉంది. 15  అయితే, మీలో ఎవ్వరూ హంతకుడిగా గానీ, దొంగగా గానీ, తప్పుచేసిన వాడిగా గానీ, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకునే వాడిగా గానీ బాధలు అనుభవించకూడదు.+ 16  కానీ ఎవరైనా క్రైస్తవుడిగా ఉన్నందుకు బాధలు అనుభవిస్తే అతను సిగ్గుపడకూడదు;+ బదులుగా, ఆ పేరుకు తగ్గట్టు జీవిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలి. 17  ఎందుకంటే, తీర్పు దేవుని ఇంటి+ దగ్గర మొదలయ్యే సమయం* వచ్చేసింది. అది మనతోనే మొదలౌతుందంటే,+ దేవుని మంచివార్తకు లోబడనివాళ్ల గతి ఏంటి?+ 18  “రక్షణ పొందడానికి నీతిమంతుడే కష్టపడాల్సి ఉందంటే, ఇక భక్తిహీనుడి పరిస్థితి, పాపి పరిస్థితి ఏంటి?”+ 19  కాబట్టి దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నందుకు బాధలు పడుతున్నవాళ్లు, మంచి చేస్తూ నమ్మకమైన సృష్టికర్తకు తమను తాము అప్పగించుకుంటూ ఉండాలి.

అధస్సూచీలు

లేదా “అలాంటి మనోవైఖరిని ఆయుధంగా ధరించండి.”
లేదా “సిగ్గులేనట్టు.” గ్రీకులో అసెల్జీయ అనే పదానికి బహువచనం ఉపయోగించారు. పదకోశం చూడండి.
లేదా “అల్లరి విందులు.”
లేదా “అక్రమమైన.”
అంటే, తప్పుల వల్ల, పాపాల వల్ల చనిపోయిన స్థితిలో ఉన్నవాళ్లకు అని అర్థం. ఎఫెసీయులు 2:1 చూడండి.
లేదా “అప్రమత్తంగా; మెలకువగా.”
లేదా “పరీక్షల్ని.”
లేదా “అవమానాలు.”
లేదా “నిర్ణయించబడిన సమయం.”