మొదటి యోహాను 3:1-24
3 తండ్రి మనమీద చూపించిన ప్రేమ ఎలాంటిదో చూడండి,+ దేవుని పిల్లలని పిలవబడే అవకాశాన్ని ఆయన మనకు ఇచ్చాడు!+ అవును, మనం దేవుని పిల్లలం. అందుకే లోకానికి మనం తెలీదు,+ ఎందుకంటే అది ఆయన్ని తెలుసుకోలేదు.+
2 ప్రియ సహోదరులారా, మనం ఇప్పుడు దేవుని పిల్లలం,+ కానీ భవిష్యత్తులో మనం ఎలా ఉంటామో ఇంకా వెల్లడి చేయబడలేదు.+ అయితే ఆయన వెల్లడి చేయబడినప్పుడు మనం ఆయనలా ఉంటామని మాత్రం మనకు తెలుసు, ఎందుకంటే మనం ఆయన్ని నిజంగా చూస్తాం.
3 ఈ నిరీక్షణ ఉన్న ప్రతీ ఒక్కరు తమను తాము పవిత్రపర్చుకుంటారు,+ ఎందుకంటే ఆయన పవిత్రుడు.
4 అలవాటుగా పాపం చేసే ప్రతీ ఒక్కరు నియమాన్ని కూడా మీరుతున్నారు, నియమాన్ని మీరడమే పాపం.
5 మన పాపాల్ని తీసేయడానికి+ ఆయన వెల్లడి చేయబడ్డాడనే విషయం కూడా మీకు తెలుసు, ఆయనలో ఏ పాపం లేదు.
6 ఆయనతో ఐక్యంగా ఉన్న వాళ్లెవ్వరూ అలవాటుగా పాపం చేయరు;+ అలవాటుగా పాపం చేసే వాళ్లెవ్వరూ ఆయన్ని చూడలేదు, ఆయన్ని తెలుసుకోలేదు.
7 చిన్నపిల్లలారా, ఎవ్వరూ మిమ్మల్ని తప్పుదారి పట్టించకుండా చూసుకోండి; నీతిగా నడుచుకునేవాళ్లు ఆయనలాగే నీతిమంతులు.
8 అలవాటుగా పాపం చేసేవాళ్లు అపవాది వైపు ఉన్నారు, ఎందుకంటే అపవాది మొదటి నుండి పాపం చేస్తూనే ఉన్నాడు.+ అపవాది పనుల్ని నాశనం చేయడానికే దేవుని కుమారుడు వెల్లడి చేయబడ్డాడు.+
9 దేవుని పిల్లలెవ్వరూ అలవాటుగా పాపం చేయరు,+ ఎందుకంటే అలాంటి వాళ్లలో దేవుని విత్తనం* ఉంది. వాళ్లు దేవుని పిల్లలు+ కాబట్టి అలవాటుగా పాపం చేయలేరు.
10 దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో దీన్నిబట్టి స్పష్టమౌతుంది: నీతిగా నడుచుకోని వాళ్లెవ్వరూ, సహోదరుణ్ణి ప్రేమించని వాళ్లెవ్వరూ దేవుని పిల్లలు కారు.+
11 మొదటి నుండి మీరు విన్నది, మనం ఒకరినొకరం ప్రేమించుకోవాలనే సందేశాన్నే;+
12 మనం కయీనులా ఉండకూడదు, అతను దుష్టుడి వైపు ఉండి తన తమ్ముణ్ణి దారుణంగా చంపేశాడు.+ అతను ఎందుకు అలా చేశాడు? ఎందుకంటే అతని పనులు చాలా చెడ్డవి,+ కానీ అతని తమ్ముడి పనులు నీతిగలవి.+
13 సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషిస్తున్నందుకు ఆశ్చర్యపోకండి.+
14 మనం సహోదరుల్ని ప్రేమిస్తాం+ కాబట్టి, మరణాన్ని దాటి జీవంలోకి వచ్చామని+ మనకు తెలుసు. అలా ప్రేమించని వ్యక్తి మరణంలోనే ఉండిపోయాడు.+
15 తన సహోదరుణ్ణి ద్వేషించే ప్రతీ వ్యక్తి హంతకుడే,+ ఏ హంతకుడూ శాశ్వత జీవితం పొందడని మీకు తెలుసు.+
16 ఆయన తన ప్రాణాన్ని మనకోసం అర్పించాడు కాబట్టి మనం ప్రేమంటే ఏమిటో తెలుసుకున్నాం.+ అలాగే సహోదరుల కోసం మన ప్రాణాలు ఇవ్వాల్సిన బాధ్యత మనమీద ఉంది.+
17 ఈ లోకంలో బ్రతకడానికి కావాల్సినవి ఉన్న ఒక వ్యక్తి, తన సహోదరుడు అవసరంలో ఉండడం చూసి కూడా అతని మీద కనికరం చూపించకపోతే, ఆ వ్యక్తికి దేవుని మీద ప్రేమ ఉందని ఎలా చెప్పగలం?+
18 చిన్నపిల్లలారా, మన ప్రేమను మాటల్లో కాదు+ చేతల్లో చూపించాలి,+ ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి.
19 దానివల్ల, మనం సత్యం వైపు ఉన్నామని గ్రహిస్తాం, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మన హృదయాలకు భరోసా ఇస్తాం,*
20 ఎందుకంటే కొన్ని విషయాల్లో మన హృదయాలు మనల్ని నిందించవచ్చు; దేవుడు మన హృదయాల కన్నా గొప్పవాడని, ఆయనకు అన్నీ తెలుసని+ మనం గుర్తుంచుకుందాం.
21 ప్రియ సహోదరులారా, ఒకవేళ మన హృదయాలు మనల్ని నిందించకపోతే, మనం దేవునితో ధైర్యంగా మాట్లాడగలుగుతాం;+
22 అంతేకాదు, మనం ఏమి అడిగినా ఆయన మనకు ఇస్తాడు.+ ఎందుకంటే మనం ఆయన ఆజ్ఞలు పాటిస్తున్నాం, ఆయనకు నచ్చే పనులు చేస్తున్నాం.
23 నిజానికి దేవుని ఆజ్ఞ ఏమిటంటే: మనం తన కుమారుడైన యేసుక్రీస్తు పేరు మీద విశ్వాసం ఉంచాలి, ఆయన ఆజ్ఞాపించినట్టు ఒకరినొకరం ప్రేమించుకోవాలి.+
24 అంతేకాదు, దేవుని ఆజ్ఞలు పాటించేవాళ్లు ఆయనతో ఐక్యంగా ఉంటారు, ఆయన వాళ్లతో ఐక్యంగా ఉంటాడు. ఆయన మనకు ఇచ్చిన పవిత్రశక్తిని బట్టి, ఆయన మనతో ఐక్యంగా ఉన్నాడని మనకు తెలుసు.+
అధస్సూచీలు
^ అంటే, పునరుత్పత్తి చేసే లేదా ఫలించే సామర్థ్యం ఉన్న విత్తనం.
^ లేదా “మన హృదయాల్ని ఒప్పిస్తాం.”